Kurnool: ఎల్లమ్మా.. నీ వెండి బంగారాలు ఏవమ్మా?

ఏదైనా ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) బదిలీపై వెళ్లేటప్పుడు, ఆ దేవాలయ స్థిర, చరాస్తులు, బంగారం, వెండి అన్నింటినీ తర్వాత ఈవోగా వచ్చేవారికి అప్పగించాలి.

Updated : 29 May 2023 07:02 IST

అధికారులు మారినా అప్పగించని వైనం

ఈనాడు, అమరావతి: ఏదైనా ఆలయ కార్యనిర్వహణ అధికారి (ఈవో) బదిలీపై వెళ్లేటప్పుడు, ఆ దేవాలయ స్థిర, చరాస్తులు, బంగారం, వెండి అన్నింటినీ తర్వాత ఈవోగా వచ్చేవారికి అప్పగించాలి. ఇది దేవాదాయశాఖ నిబంధన. కానీ కర్నూలు నగర శివారులో ఎల్లమ్మ అమ్మవారి ఆలయ ఈవో మాత్రం బదిలీపై వెళ్లి నాలుగేళ్లు అవుతున్నా ఇప్పటివరకు వెండి, బంగారాలు అప్పగించలేదు. ఈ విషయం ఉన్నతాధికారులకు తెలిసినా చోద్యం చూస్తున్నారు. కర్నూలు నగరం నందికొట్కూరు రోడ్డులో వెంకాయపల్లి వద్ద ఎల్లమ్మ ఆలయం ఉంది. మంగళ, శుక్రవారాల్లో భక్తులు పెద్దఎత్తున వస్తుంటారు. భక్తులు విరాళంగా ఇచ్చే, హుండీలో వేసే బంగారం, వెండి వస్తువులను ఈవో భద్రపరచాలి. ఈవో బదిలీ అయితే, తర్వాత వచ్చే అధికారికి అన్నీ అప్పగించాలి. కానీ ఇక్కడ అలా జరగలేదు.

నాలుగేళ్లుగా బంగారం, వెండి ఏమైంది?

ఈ ఆలయానికి 2014లో ఈవోగా రామాంజనేయులు బదిలీపై వచ్చారు. అప్పటివరకు పనిచేసిన ఈవో వాణి.. ఆభరణాలన్నీ అప్పగించి రిలీవ్‌ అయ్యారు. తర్వాత రామాంజనేయులు దాదాపు నాలుగేళ్లకు పైగా పనిచేశారు. ఆయన హయాంలోనూ బంగారం, వెండి వస్తువులు అమ్మవారికి కానుకగా వచ్చాయి. ఆయన బదిలీపై వెళ్లేటప్పుడు వాటిని తర్వాత వచ్చిన ఈవోకి అప్పగించలేదు. గత నాలుగేళ్లలో ముగ్గురు ఈవోలు మారినా... గతంలో ఉన్న ఆభరణాలు ఏమయ్యాయనే స్పష్టత లేదు. రామాంజనేయులు తర్వాత శోభ, చంద్రశేఖర్‌రెడ్డి ఈవోలుగా పనిచేశారు. వీరి హయాంలో వచ్చిన కానుకలను ప్రస్తుత ఈవో సీతారామ్‌రెడ్డికి అప్పగించారు. ఇలా కేజీకి పైగా బంగారం, 10 కేజీల వరకు వెండి ప్రస్తుత ఈవో వద్ద ఉన్నాయి. కానీ రామాంజనేయులు హయాంలో, అంతకుముందు ఉండాల్సిన బంగారం, వెండి వస్తువులు మాత్రం ప్రస్తుత ఈవోకి చేరలేదు. దీనిపై ప్రస్తుత ఈవో సీతారామ్‌రెడ్డిని ‘ఈనాడు’ ఫోనులో సంప్రదించగా.. నాలుగేళ్ల కిందట బదిలీ అయిన ఈవో బంగారం, వెండి వస్తువులు అప్పగించని విషయం వాస్తవమేనని తెలిపారు. ఇలా ఇంకెన్ని ఆలయాల్లో జరిగిందనేది ప్రశ్నార్థకంగా ఉంది. సదరు రామాంజనేయులు.. ప్రస్తుతం అనంతపురం జిల్లా దేవాదాయశాఖ అధికారిగా కొనసాగుతుండటం మరో విశేషం!

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని