CSE - IT Jobs: సీఎస్‌ఈనే సర్వస్వం కాదు

‘‘మనిషిలాగా ఆలోచించి శరవేగంగా ఏమైనా చేయగల సాంకేతికత వస్తుందని 2017లో తొలిసారిగా ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది. అది చాట్‌ జీపీటీ రూపంలో వచ్చేసింది.

Updated : 29 May 2023 07:58 IST

వచ్చే పదేళ్లలో ఆ బ్రాంచి విద్యార్థుల కొలువులకు ముప్పు
చాట్‌ జీపీటీ లాంటి టూల్సే ఉద్యోగుల పనులు చేస్తాయి
కృత్రిమ మేధతో ఎన్నో రంగాలపై ప్రభావం
‘ఈనాడు’ ముఖాముఖిలో వేన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఆచార్యుడు రత్నబాబు చిన్నం

ఈనాడు, హైదరాబాద్‌: ‘‘మనిషిలాగా ఆలోచించి శరవేగంగా ఏమైనా చేయగల సాంకేతికత వస్తుందని 2017లో తొలిసారిగా ఓ పరిశోధన పత్రం ప్రచురితమైంది. అది చాట్‌ జీపీటీ రూపంలో వచ్చేసింది. గత నవంబరులో విడుదలైన చాట్‌ జీపీటీ ఇప్పటికే అత్యంత తెలివిగా సమాధానాలు ఇస్తోంది. కొన్ని రకాల సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రామింగ్‌ కోడ్‌లను కూడా బాగా రాస్తోంది. వచ్చే పదేళ్లలో ఇది ఎలా మారుతుంది? మనిషికి ప్రత్యామ్నాయంగా ఏం చేస్తుంది? అని ఊహిస్తే కొంత ఆందోళన కలగకమానదు’’ అని అంటున్నారు కృత్రిమ మేధ, బిగ్‌డేటా, బిజినెస్‌ ఎనలిటిక్స్‌ నిపుణుడు, అమెరికా డెట్రాయిట్‌లోని వేన్‌ స్టేట్‌ యూనివర్సిటీ ఇండస్ట్రియల్‌ అండ్‌ సిస్టమ్స్‌ ఇంజినీరింగ్‌ అధిపతి ఆచార్య రత్నబాబు చిన్నం. సాఫ్ట్‌వేర్‌ రంగంలోని కిందిస్థాయి ఉద్యోగుల పనులను సమీప భవిష్యత్తులో చాట్‌ జీపీటీ లాంటివే చేస్తాయని స్పష్టం చేస్తున్నారు. 

హైదరాబాద్‌కు వచ్చిన రత్నబాబు చిన్నం కృత్రిమ మేధ(ఏఐ), సాఫ్ట్‌వేర్‌ రంగంలో అవకాశాలు, అమెరికా విద్య తదితర అంశాలపై ‘ఈనాడు’తో ముఖాముఖి మాట్లాడారు. 

తెలుగు రాష్ట్రాల విద్యార్థులు అత్యధికంగా కంప్యూటర్‌ సైన్స్‌ ఇంజినీరింగ్‌ (సీఎస్‌ఈ) కోర్సులో చేరుతున్నారు? వీరికి భవిష్యత్తులో ఉద్యోగావకాశాలు ఎలా ఉంటాయి?

తెలుగు రాష్ట్రాల్లో ఏటా వేలాది మంది సీఎస్‌ఈ చదువుతున్నారు. వారిలో చాలా మంది అమెరికా విద్యకు వస్తున్నారు. అయితే, వారిలో కంప్యూటర్‌ సైన్స్‌కు సంబంధించిన నైపుణ్యాలు ఉండటం లేదని గమనించా. ప్రస్తుతం చాట్‌ జీపీటీ కొన్ని రకాల సాఫ్ట్‌వేర్‌ కోడ్‌లను సీఎస్‌ఈ విద్యార్థుల కంటే బాగా రాస్తోంది. నా కూతురు కూడా కంప్యూటర్‌ సైన్స్‌ చదివి ఓ స్టార్టప్‌ కంపెనీలో పనిచేస్తోంది. వచ్చే 10-15 సంవత్సరాల్లో ఆమె భవిష్యత్తు ఎలా ఉంటుందో అన్న ఆందోళన నాలోనూ ఉంది. చాట్‌ జీపీటీ పనితీరు ప్రారంభంలోనే మనుషుల కంటే బాగా ఉంది. అందువల్ల మరో 10 సంవత్సరాల్లో కంప్యూటర్‌ సైన్స్‌ పూర్తిచేసే వారిలో 80 శాతం ఉద్యోగాలు ఉండవని నా అంచనా. కిందిస్థాయి ఉద్యోగుల పనులను చాట్‌ జీపీటీ వంటి టూల్సే చేస్తాయి. విద్యార్థులు సీఎస్‌ఈ చేయాలనుకుంటే ఆధునిక సాంకేతికతపై పట్టు సాధించాలి. కృత్రిమ మేధ చేయలేని పనులూ చేసే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి. మెకానికల్‌, సివిల్‌ లాంటి బ్రాంచీలకు కూడా ప్రాధాన్యమివ్వాలి.

కృత్రిమ మేధతో లాభాలు లేవంటారా?

ఏఐతో లాభాలు, నష్టాలు రెండూ ఉన్నాయి. వైద్యులు ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ నివేదికను విశ్లేషించి చెప్పే దాని కంటే ఎంతో వేగంగా ఏఐ చెప్పగలదని గూగుల్‌ ప్రకటించింది. దాని వల్ల రేడియాలజీ నిపుణుల కొలువులపై ప్రభావం ఉంటుంది. సాధారణంగా పుట్టిన వారం రోజులలోపు శిశువుల మెదడు స్పష్టంగా ఉండదు. వారి మెదడులో ఉన్న సమస్యలను ఏఐ ద్వారా గుర్తించవచ్చు. పిల్లలు సరిగా చదువుతున్నారా? లేదా? అని కూడా విశ్లేషిస్తుంది. డ్రైవర్‌ రహిత కార్లు వస్తున్నందున భవిష్యత్తులో డ్రైవర్‌ కొలువులు పోయే ప్రమాదముంటుంది. ఇంకెన్ని రంగాలపై దుష్ఫలితాలు ఉంటాయో ఇప్పుడే చెప్పలేం.

ఏఐతో కలిగే అనర్థాల నివారణకు ప్రభుత్వం ఏం చేయాలి?

ప్రపంచవ్యాప్తంగా ఈ రంగంలో ఏం జరుగుతోందో నిపుణులతో భారత్‌ ఓ కమిటీ వేసి ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఉండాలి. గూగుల్‌ ఏఐ విభాగం అధిపతిగా ఉన్న జెఫ్రీ హింటన్‌ కూడా ఏఐను తాను తక్కువ అంచనా వేశానని, ఇంకా ముందుకు వెళితే ఎన్నో అనర్థాలు వస్తాయని ప్రపంచాన్ని హెచ్చరిస్తూ ఇటీవలే ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అందుకే ఏఐను ఎంత వరకు, ఎక్కడ, ఎలా వాడుకోవాలి? దానివల్ల తలెత్తే అనర్థాల నివారణకు ఏం చేయాలి? అని విధానపర నిర్ణయాలు తీసుకోవాలి. ఏఐను శాపంగా భావించకుండా దాన్ని ఓ వరంలా మార్చుకోవాలి. ఉదాహరణకు వైద్య రంగంలో దీని ద్వారా జబ్బులను ముందుగానే గుర్తించవచ్చు.

భవిష్యత్తులో టెక్నాలజీ ఎలా మార్పు చెందనుంది?

వచ్చే పదేళ్లలో సాంకేతికపరంగా ఇంకెన్ని మార్పులు వస్తాయో స్పష్టంగా చెప్పలేం. గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ కూడా.. 2030 నాటికి టెక్నాలజీ స్వరూపం ఎలా ఉండనుందో తనకూ తెలియదని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.

భారత్‌, అమెరికా విద్యావిధానం మధ్య వ్యత్యాసం ఏమిటి?

అమెరికాలోని చాలా వర్సిటీలు తమ సిలబస్‌ను ఎప్పటికప్పుడు మార్చుకుంటున్నాయి. ఇక్కడ అది లోపించింది. కాకపోతే ఇక్కడి ఐఐటీల వంటి అటానమస్‌ విద్యాసంస్థల్లో ఆ స్వేచ్ఛ ఉంది. థియరీ కాకుండా రియల్‌ టైమ్‌ ప్రాజెక్టులు చేయాలి. అడ్వాన్స్‌డ్‌ సిలబస్‌, బోధన ఉండాలి.


దిగ్గజ కంపెనీలతో కలిసి పరిశోధనలు

గుంటూరుకు చెందిన రత్నబాబు మణిపాల్‌ విశ్వవిద్యాలయంలో బీటెక్‌ చదివి అమెరికాలోని టెక్సాస్‌ విశ్వవిద్యాలయం నుంచి ఎంఎస్‌, పీహెచ్‌డీ చేశారు. 1989 నుంచి అమెరికాలో ఉంటున్న ఆయన ఫోర్డ్‌ మోటార్‌ కంపెనీ, ఇంటెల్‌, జనరల్‌ డైనమిక్స్‌ లాంటి ఎన్నో కంపెనీలతో కలిసి పరిశోధనలలో పాల్గొంటున్నారు. వేన్‌ వర్సిటీలో సెంటర్‌ ఫర్‌ ఆపరేషనల్‌ ఎక్స్‌లెన్స్‌ అండ్‌ ఏఐ, బిగ్‌డేటా, బిజినెస్‌ ఎనలిటిక్స్‌కు వ్యవస్థాపక డైరెక్టరుగానూ వ్యవహరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని