కులవృత్తిదారులకు ఆర్థిక సాయం జూన్‌ 9న!

రాష్ట్రంలో కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీల నుంచి దాదాపు లక్షన్నర మందికి ఆర్థిక సహాయంపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించనుంది.

Updated : 29 May 2023 06:32 IST

పూర్తి రాయితీతో ఒక్కొక్కరికి రూ.లక్ష
నియోజకవర్గానికి 1200- 1500 మంది లబ్ధిదారుల ఎంపిక
నేడు విధివిధానాల ప్రకటన

ఈనాడు, హైదరాబాద్‌: రాష్ట్రంలో కులవృత్తులతో జీవనోపాధి పొందుతున్న ఎంబీసీ, బీసీల నుంచి దాదాపు లక్షన్నర మందికి ఆర్థిక సహాయంపై ప్రభుత్వం విధివిధానాలు ప్రకటించనుంది. ప్రతి నియోజకవర్గంలో 1200 నుంచి 1500 మందికి లబ్ధి చేకూర్చేలా కసరత్తు చేస్తోంది. ఎలాంటి పూచీకత్తు లేకుండా పూర్తి సబ్సిడీతో రూ. లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది. ఈ కార్యక్రమాన్ని నిరంతరం కొనసాగించాలని నిర్ణయించిన ప్రభుత్వం.. దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తొలివిడత పథకాన్ని ప్రకటించనుంది. దరఖాస్తుల స్వీకరణ, లబ్ధిదారుల ఎంపిక, ఆర్థిక సహాయం తదితర విధివిధానాలను మంత్రివర్గ ఉపసంఘం ఖరారు చేయనుంది. ఈ మేరకు సోమవారం సాయంత్రం 4 గంటలకు సమావేశమై, సీఎం సమక్షంలో తుది విధానాలు ప్రకటించనుంది. నాయీబ్రాహ్మణులు, విశ్వబ్రాహ్మణులు, కుమ్మరి, మేదరి, రజక, పూసల వర్గాలతో పాటు.. మరిన్ని కులాలను గుర్తించిన ఉపసంఘం ఆయా వివరాలను వెల్లడించనుంది. అర్హులైన కులవృత్తులు చేసుకుంటున్న కుటుంబాల నుంచి ఆన్‌లైన్లో దరఖాస్తు తీసుకుని దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా పంపిణీ చేయనుంది.

జూన్‌ 9న ఆర్థిక సహాయం పంపిణీ కార్యక్రమాన్ని నియోజకవర్గాల వారీగా చేపట్టే అవకాశాలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం ఎంబీసీ, బీసీ కార్పొరేషన్లకు స్వయం ఉపాధి రుణాల కోసం ప్రభుత్వం రూ.603 కోట్లు కేటాయించింది. ఎంబీసీ కార్పొరేషన్‌కు రూ.303 కోట్లు, బీసీ కార్పొరేషన్‌కు రూ. 300 కోట్లు ఉన్నాయి. తాజాగా ప్రకటించిన ఆర్థిక సహాయానికి ఈ నిధుల్ని వినియోగిస్తారో లేక ప్రత్యామ్నాయంగా సర్దుబాటు చేస్తారో తెలియాల్సి ఉంది. చేతివృత్తులు చేసుకునే వర్గాలు ఎక్కువగా ఎంబీసీ కేటగిరీలో ఉన్నాయి. ఈ ఏడాదికి అందుబాటులోని నిధులతో 39 వేల మంది ఎంబీసీలకు లబ్ధి చేకూర్చాలని బీసీ సంక్షేమశాఖ ఇప్పటికే కార్యాచరణ రూపొందించింది. కానీ ఎంబీసీల్లో కులవృత్తులపై ఆధారపడిన కుటుంబాలు దాదాపు 12 లక్షల వరకు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా. వీరిలో కనీసం లక్ష నుంచి లక్షన్నర మందికి ఆర్థిక సహాయం చేయడం ద్వారా ఆయా కులవృత్తులను ప్రోత్సహించడంతో పాటు వారు మరింత ఆదాయం సమకూర్చుకునేలా తోడ్పడాలని ప్రభుత్వం భావిస్తోంది. బీసీ కార్పొరేషన్‌ పరిధిలో రూ.303 కోట్లతో కనీసం 35 వేల మందికి రాయితీ రుణాలు అందించాలని కార్యాచరణ రూపొందించిన బీసీ సంక్షేమశాఖ ఆ మేరకు దస్త్రాన్ని సీఎం కేసీఆర్‌కు పంపించింది.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని