నియామకాలు లేవు.. అన్నీ రద్దులే!

వైకాపా ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోగా ఖాళీ పోస్టులను రద్దుచేస్తోంది. పాఠశాల విద్యకు కొత్తగా పోస్టు మంజూరుచేయాలంటే ఖాళీ పోస్టులను విలీనం చేయాలన్న నిబంధన విధిస్తోంది.

Updated : 29 May 2023 05:37 IST

నాలుగేళ్లలో 6,592 ఎస్జీటీ, 1,160 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ పోస్టుల రద్దు
ఒక్క పోస్టు రద్దు కాదన్న మంత్రి బొత్స నోరు మెదపడం లేదు
ఒప్పంద ఉపాధ్యాయులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం
ఇప్పుడు పోస్టులే లేకుండా చేస్తున్నారు


* అధికారంలోకి రాగానే అర్హతలు, సర్వీసును పరిగణనలోకి తీసుకుని ఎక్కువ మందిని క్రమబద్ధీకరిస్తాం

ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్లకు పాదయాత్రలో జగన్‌ హామీ


* ఒక్క పోస్టు రద్దు కాదు.. ఎక్కడా ఒక్క పాఠశాల మూతపడదు

 మంత్రి బొత్స సత్యనారాయణ


వాస్తవం: కొత్తగా నియామకాలు చేపట్టకపోగా ఉన్న పోస్టులనే ప్రభుత్వం రద్దు చేస్తోంది. ఇప్పటివరకు రద్దయిన ఎస్జీటీ, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్ల పోస్టులే ఇందుకు నిదర్శనం.


ఈనాడు, అమరావతి: వైకాపా ప్రభుత్వం గత నాలుగేళ్లలో ఉపాధ్యాయ నియామకాలు చేపట్టకపోగా ఖాళీ పోస్టులను రద్దుచేస్తోంది. పాఠశాల విద్యకు కొత్తగా పోస్టు మంజూరుచేయాలంటే ఖాళీ పోస్టులను విలీనం చేయాలన్న నిబంధన విధిస్తోంది. విద్య కోసం రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని చెబుతున్న సీఎం జగన్‌కు కొత్త పోస్టులు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు. ఉపాధ్యాయ పోస్టుల హేతుబద్ధీకరణ పేరుతో మిగులుగా తేల్చి.. రద్దుచేస్తున్నారు. ఒక్క పోస్టూ రద్దుకాదని చెప్పిన మంత్రి బొత్స సత్యనారాయణ వందల పోస్టులను రద్దుచేసినా నోరు మెదపడం లేదు. ఖాళీ పోస్టులను రద్దుచేస్తేనే కొత్తవాటిని ఇస్తామని ప్రభుత్వం మెలికపెట్టడంతో విద్యాశాఖ వేల పోస్టులను విలీనం చేస్తోంది. దీంతో భవిష్యత్తులో డీఎస్సీ నియామకాలు, ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ టీచర్ల క్రమబద్ధీకరణ లేకుండా పోయే పరిస్థితి ఏర్పడింది. ఇప్పటివరకు 7,752 పోస్టులను రద్దుచేసింది. బోధనేతర పోస్టుల కోసం సైతం బోధన పోస్టులను తీసేసింది. భవిష్యత్తులో ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య పెరిగినా కొత్త ఉపాధ్యాయ నియామకాలు లేకుండా ఖాళీలను విలీనం చేసేస్తోంది.

ఇలా పోతున్నాయి..

మండలానికి ఇద్దరు విద్యాధికారుల చొప్పున నియమించేందుకు 692 పోస్టులను ప్రభుత్వం మంజూరుచేసింది. ఈ పోస్టులను ఇచ్చేందుకు ఇప్పటికే ఖాళీగా ఉన్నవాటిని విలీనం చేయాలని మెలికపెట్టింది. దీంతో పాఠశాలల్లో ఖాళీగా ఉన్న 1,145 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ పోస్టులు రద్దయ్యాయి. నూతన విద్యావిధానంలో ఈ టీచింగ్‌కు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు. కానీ, రాష్ట్రప్రభుత్వం ఆ పోస్టులు లేకుండా చేస్తోంది. ప్రభుత్వ పాఠశాలల్లో ఒప్పంద, పార్ట్‌టైమ్‌ కింద 5,742 మంది ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. తమ పోస్టులను ప్రభుత్వం క్రమబద్ధీకరిస్తుందేమోనని వారు ఎదురుచూస్తుండగా.. ప్రభుత్వం ఏకంగా పోస్టులు లేకుండా చేస్తోంది.

* రాష్ట్ర విభజన సమయంలో పాఠశాల విద్యాశాఖలోని అదనపు డైరెక్టర్ల పోస్టులు తెలంగాణకు వెళ్లిపోయాయి. వీటిని కొత్తగా సృష్టించేందుకంటూ గతంలో 15 ఆర్ట్‌, క్రాఫ్ట్‌, డ్రాయింగ్‌ పోస్టులను రద్దుచేసింది. దాంతో ఉన్నతాధికారులు పదోన్నతులు పొందారు.

* ఆదర్శ పాఠశాలల్లో 3,260 ఉపాధ్యాయ పోస్టులకు సర్వీసు నిబంధనల కోసమంటూ 4,764 ఎస్జీటీ పోస్టులను రద్దుచేసింది. కర్నూలు మినహా ఉమ్మడి 12 జిల్లాల్లో 397 చొప్పున పోస్టులను విలీనం చేసేశారు.

* ఉన్నత పాఠశాలలను హైస్కూల్‌ ప్లస్‌గా మార్చి, వాటిలో ఇంటర్‌ ప్రారంభించారు. వీటిలో బోధించేందుకు 1,752 మంది స్కూల్‌ అసిస్టెంట్లు అవసరం. ప్రభుత్వం కొత్తగా వీటిని మంజూరుచేయాల్సి ఉండగా.. ఇప్పటికే ఉన్న 1,752 ఎస్జీటీ పోస్టులను విలీనం చేసేసింది. భవిష్యత్తులో ఎస్జీటీ పోస్టులే కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది.

* కర్నూలు జిల్లాలో ప్రధానోపాధ్యాయ పోస్టుల కోసం 76 ఎస్జీటీ పోస్టులను రద్దుచేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు