భూ ఆక్రమణల్లో కడప టాప్!
భూ ఆక్రమణలతో ఉమ్మడి కడప జిల్లా మార్మోగిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికార గణం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది.
రెవెన్యూ శాఖ సేవా లోపాల్లోనూ అదే తీరు
వైకాపా నేతల అండతో అక్రమార్కుల దందా
1.34 లక్షల ఫిర్యాదుల పరిశీలన ద్వారా గుర్తింపు
ఈనాడు, అమరావతి: భూ ఆక్రమణలతో ఉమ్మడి కడప జిల్లా మార్మోగిపోతోంది. ముఖ్యమంత్రి జగన్ సొంత జిల్లాలో భూ ఆక్రమణలను అడ్డుకోవాల్సిన అధికార గణం చూసీ చూడనట్టు వ్యవహరిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా భూ ఆక్రమణలపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలిస్తే.. ఉమ్మడి కడప జిల్లా ప్రథమ స్థానంలో ఉంది. రెవెన్యూ శాఖ ద్వారా సేవలు సక్రమంగా అందడం లేదని ప్రభుత్వానికి వచ్చే ఫిర్యాదుల్లో కూడా ఆ జిల్లానే తొలి స్థానం ఆక్రమించడం గమనార్హం. రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ శాఖకు సంబంధించి 2020 ఏప్రిల్ నుంచి ఇటీవల వరకు అధికారికంగా వచ్చిన ఫిర్యాదులు 1.34 లక్షల వరకు ఉన్నాయి.
అందులో పట్టాదారు పాస్ పుస్తకాలు, అడంగల్‌లో తప్పుల సవరణలపై 39 వేలు ఉండగా, ప్రభుత్వ, ప్రైవేట్ భూముల ఆక్రమణలపై 31 వేలు, గ్రామ రెవెన్యూ సిబ్బందిపై 10 వేల వరకు, ఇతర విభాగాల్లో మరికొన్ని ఫిర్యాదులు వచ్చాయి. అత్యధికంగా వైయస్సార్ కడప జిల్లాలోనే భూ ఆక్రమణలపై 1,892, రికార్డుల్లో మార్పులు, చేర్పుల కోసం వచ్చిన ఫిర్యాదులు 1,800 వరకు ఉండడం చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ శాఖకు సంబంధించి చాలాచోట్ల చేయి తడపందే పనులు చేయరు. అడంగల్‌లో పేర్ల నమోదు, తప్పులు సరిచేసుకునేందుకు వచ్చిన వారిని రెవెన్యూ సిబ్బంది రాచి రంపాన పెడుతున్నారు. ఈ చర్యలతో విసిగిన రైతులు స్పందన, యాప్, ఇతర మార్గాల్లో ప్రభుత్వానికి ఫిర్యాదులు చేస్తున్నారు.
ప్రాణాలు తీసుకోవడానికీ వెనుకాడడం లేదు
రైతులు తమ భూమిపై యాజమాన్య హక్కు పొందాలంటే.. పట్టాదారు పాసు పుస్తకం అవసరం. తగిన ఆధారాలతో వీటికోసం దరఖాస్తు చేసినా.. అధికారులు మంజూరు చేయడం లేదన్న బాధతో పలువురు మండల కార్యాలయాల వద్దే ఆత్మహత్యలకు ప్రయత్నిస్తున్నారు. రెవెన్యూ రికార్డుల్లో, ఆన్‌లైన్‌లో తన పేరు చేర్చాలని అధికారుల చుట్టూ తిరిగినా.. స్పందన లేదని ఓ రైతు పురుగు మందు తాగి ప్రాణాలు విడిచిన ఘటన అనంతపురం జిల్లా పుట్లూరు మండల పరిధిలో గత మార్చిలో జరిగింది. ఇదే తరహాలో చిత్తూరు జిల్లా ఐరాల మండలం 45-కొత్తపల్లెకు చెందిన ఓ వితంతువు, పల్నాడు జిల్లా అచ్చంపేటలో మరో మహిళా రైతు ఆత్మహత్యా యత్నాలకు పాల్పడ్డారు. రికార్డుల్లో మార్పులు, చేర్పులపై అధికంగా వైయస్సార్ కడప జిల్లాలో 1,879, కర్నూలు జిల్లాలో 1,159, కొత్త పట్టాదారు పాసు పుస్తకాలు మంజూరు చేయడం లేదని ప్రకాశం జిల్లాలో 1,039 వరకు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి.
గ్రామ సచివాలయాలకు వెళ్లినా..
గ్రామ సచివాలయాలకు వెళ్లినప్పటికీ.. రెవెన్యూ సిబ్బంది నుంచి సేవలు సకాలంలో అందడం లేదని పేర్కొంటూ రాష్ట్ర వ్యాప్తంగా పది వేల వరకు ఫిర్యాదులు రావడం గమనార్హం. ఒక పనిపై రెండు, మూడుసార్లు సచివాలయాలకు వెళ్తున్నా.. సకాలంలో పూర్తికావడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వైయస్సార్ కడప, కర్నూలు జిల్లాల్లో 500 చొప్పున ఈ తరహా ఫిర్యాదులు వచ్చాయి. అందిన 1.34 లక్షల ఫిర్యాదులను చాలా వరకు పరిష్కరించినట్లు గణాంకాలు చెబుతున్నాయి.
కబ్జాలే కబ్జాలు
భూ అక్రమణలను అడ్డుకోవాలని విశాఖ నుంచి అనంతపురం జిల్లా వరకు ప్రజల నుంచి భారీగా ఫిర్యాదులు వస్తున్నాయి. అధికార పార్టీ నేతల మద్దతుతో కబ్జాదారుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోంది. వైకాపా నేతలకు వత్తాసు పలుకుతున్న రెవెన్యూ, పోలీసు అధికారుల వల్ల కొన్ని సంఘటనలు అసలు వెలుగులోకే రావడం లేదు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోనే అత్యధికంగా వైయస్సార్ కడప జిల్లాలో 1,892 వరకు ఫిర్యాదులు రావడం గమనార్హం. తరువాత స్థానాల్లో అనకాపల్లి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాలున్నాయి. ప్రధానంగా నకిలీ పత్రాలు సృష్టించి ప్రభుత్వ భూముల ఆక్రమణలకు పాల్పడుతున్నారు. చెరువుల్ని సైతం వదలడం లేదు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో భూ కబ్జాలకు పాల్పడుతున్న అయిదుగురు నిందితులను గత నెలలో అరెస్టు చేయగా.. వీరిలో ఇద్దరు ఎమ్మెల్యే అనుచరులు ఉన్నారు.
కడప జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఓ మండల రెవెన్యూ కార్యాలయం దందాపై రైతుల ఫిర్యాదుతో అవినీతి నిరోధక శాఖ అధికారులు విచారణ చేశారు. ఉమ్మడి అనంతపురం జిల్లా బొమ్మనహాళ్ మండలంలోని బొల్లనగుడ్డంలో తమ భూములను కొందరు రెవెన్యూ రికార్డులను తారుమారు చేయించి విక్రయించారని.. బాధితులు అధికారులకు ఫిర్యాదు చేశారు. భూకబ్జాదారుల దౌర్జన్యంతో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో ఇద్దరు అన్నదమ్ములు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ప్రకాశం జిల్లా మార్కాపురం నియోజకవర్గం వేములకోట పంచాయతీలో ప్రభుత్వానికి చెందిన రెండెకరాల భూమిని అక్కడి కొట్టాలపల్లి బీసీ, ఎస్టీలకు రుద్రభూమిగా కేటాయించారు. ఇక్కడ జరుగుతున్న అంతిమ సంస్కారాలను వైకాపాకు చెందిన వారు అడ్డుకోవడంతో స్పందన ద్వారా అధికారులకు ఫిర్యాదు చేశారు. చంద్రగిరి పట్టణంలో మురుగు కాలువలనూ కబ్జాదారులు వదలడం లేదు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ