విశాఖ వివాదాస్పద భూముల్లో వైకాపా నేతల పాగా!

విశాఖలో విలువైన భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. పరిపాలనా రాజధాని అని, సెప్టెంబర్‌లో ఇక్కడికి మకాం మారుస్తామని అగ్రనేతలు ప్రకటిస్తుండటంతో ఆలోపే విలువైన భూముల్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో వైకాపా నేతలు అడుగులు వేస్తున్నారు.

Updated : 30 May 2023 06:30 IST

రూ.30 కోట్ల విలువైన సర్కారు భూమిపై కన్ను
చక్రం తిప్పుతున్న ప్రభుత్వ పెద్దల బంధువులు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో విలువైన భూములపై అధికార పార్టీ నేతలు కన్నేశారు. పరిపాలనా రాజధాని అని, సెప్టెంబర్‌లో ఇక్కడికి మకాం మారుస్తామని అగ్రనేతలు ప్రకటిస్తుండటంతో ఆలోపే విలువైన భూముల్ని చేజిక్కించుకోవాలన్న ఆలోచనతో వైకాపా నేతలు అడుగులు వేస్తున్నారు. ఇందులో భాగంగా వివాదాస్పద భూములపై దృష్టిసారించారు. డెవలపర్లుగా రంగప్రవేశం చేసి రూ.కోట్ల విలువైన భూముల్లో పాగా వేసే ఎత్తుగడలో ఉన్నారు. ఈ క్రమంలో విశాఖలోని కూర్మన్నపాలెంలో దాదాపు రూ.30 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొందరు చదును చేయడం చర్చనీయాంశంగా మారింది. కూర్మన్నపాలెంలో సర్వే నంబరు 23/1లో 5.38 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇందులో 1.60 ఎకరాలకు 1961లో రెబాక అప్పన్నకు డి-పట్టా ఇచ్చారు. ఆయన నుంచి హైమావతి అనే మహిళ 1966 సెప్టెంబరు 7న (డాక్యుమెంట్‌ నెంబరు 255/66) 1.10 ఎకరాలు కొన్నారు. ప్రభుత్వ భూమిని విక్రయించడంపై అధికారులకు ఫిర్యాదు అందడంతో 1981లో డి-పట్టాను రద్దు చేశారు. అయినప్పటికీ హైమావతి తన కుమార్తెకు 2004 డిసెంబరు 29న చదరపు గజాల చొప్పున (డాక్యుమెంట్‌ నంబరు 5636/ 2004) అమ్మారు. తర్వాత స్థానిక రెవెన్యూ అధికారులు, అప్పన్న కుటుంబీకుల సహాయంతో మిగిలిన 50 సెంట్లకు పక్కనున్న కొంత ప్రభుత్వ భూమిని కూడా కలిపేసి 76 సెంట్లుగా నమోదు చేసి 2005లో హైమావతి కుమార్తె పేరున మార్చుకున్నారు. ఆమె ఈ మొత్తం భూమిని ప్లాట్లుగా మార్చి 18 మందికి అమ్మారు. తొలుత రిజిస్టర్‌ చేసిన రెండు డాక్యుమెంట్లను జిల్లా ఉన్నతాధికారుల ఆదేశాలతో.. 2015లో గాజువాక తహసీల్దార్‌ వేణుగోపాల్‌, డిప్యూటీ తహసీల్దార్‌ అరుణలు రద్దు చేశారు. అప్పటికే ఈ స్థలంలో నిర్మించిన అపార్ట్‌మెంట్‌ను సీజ్‌ చేయడంతోపాటు, విద్యుత్తు సరఫరా నిలిపివేశారు.

న్యాయస్థానంలో వ్యాజ్యం నడుస్తుండగా..

రద్దు చేసిన ప్రభుత్వ భూమిలో 46 సెంట్లకు 1959లోనే డాక్యుమెంట్‌ ఉందంటూ మరో వర్గం తెరపైకి వచ్చింది. అప్పటికే భూములు కొన్నవారు తమకు హక్కు ఉందన్నారు. రెండు వర్గాలు హైకోర్టును ఆశ్రయించాయి. సంబంధిత టైటిల్స్‌ను కింది కోర్టులో రుజువు చేసుకోవాలంటూ 2017లో హైకోర్టు ఇరువర్గాలకు సూచించింది. ఈ మేరకు 46 సెంట్ల భూమి తమదన్న వర్గం దిగువ కోర్టులో వ్యాజ్యం వేసింది. న్యాయస్థానంలో ఈ భూమి వ్యవహారం నడుస్తుండగా.. హక్కుదారుల (ప్లాట్లు కొన్న యజమానుల) నుంచి డెవలప్‌మెంట్‌కు తీసుకున్నామంటూ ఓ బిల్డర్‌ తాజాగా తెరపైకి వచ్చారు.  

తెర వెనుక అధికార పెద్దలు?

భూమి హక్కు విషయం కోర్టులో పెండింగ్‌ ఉండగానే.. కొన్ని రోజుల క్రితం ప్రకాశ్‌ అనే వ్యక్తి ఆ భూమిని జేసీబీలతో చదును చేసినట్లు ఒక వర్గం వారు ఆరోపిస్తున్నారు. పనులు అడ్డుకొని దువ్వాడ పోలీస్‌స్టేషన్‌తోపాటు విశాఖ నగర పోలీస్‌ కమిషనర్‌కు ఈ నెల 28న అతనిపై ఫిర్యాదు చేశారు. డెవలప్‌మెంట్‌కు స్థలం తీసుకున్నానంటున్న వ్యక్తి శ్రీకాకుళానికి చెందిన ఓ మంత్రి బంధువునని చెప్పుకుంటున్నారని సమాచారం. ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రి సోదరుడి వియ్యంకుడు ఇక్కడ 2 ప్లాట్లు కొన్నట్లు తెలుస్తోంది. పనులు అడ్డుకున్నప్పుడు ఈ విషయం చెప్పి, బెదిరింపులకు దిగారు. గత ఎన్నికల్లో గోదావరి జిల్లాల నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయిన ఓ నేత సైతం పనులు అడ్డుకున్న వర్గంతో చర్చించినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం మొత్తం ఉత్తరాంధ్రకు చెందిన మరో మంత్రి కనుసన్నల్లో జరుగుతోంది. టైటిల్‌ రుజువు చేసుకునేందుకు వ్యాజ్యం దాఖలు చేసిన వర్గాన్ని అధికార పార్టీకి చెందిన పెద్దలు బెదిరిస్తున్నట్లు సమాచారం.


పట్టీపట్టనట్లు అధికారులు

ప్రభుత్వ భూమిలో పాగా వేసిన వారిలో ప్రభుత్వ పెద్దల బంధుగణం ఉండటంతో రెవెన్యూ అధికారులు పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. 23/1 సర్వే నంబరులో ప్రభుత్వ భూమి 5.38 ఎకరాలుందని, అందులో 1.60 ఎకరాలు రెబాక అప్పన్నకు డి-పట్టా ఇచ్చారని, ఆపై రద్దు చేశారని గాజువాక రెవెన్యూ అధికారులే చెబుతున్నారు. ప్రభుత్వ భూమిగా రికార్డుల్లో ఉండటంతో 2017లో హైకోర్టును ఆశ్రయించినప్పుడు రెవెన్యూ అధికారులు పార్టీగా హాజరయ్యారు. ‘డి-పట్టా, తద్వారా జరిగిన రెండు రిజిస్ట్రేషన్‌ డాక్యుమెంట్లు రద్దు చేసినందున అది ప్రభుత్వ భూమే. రద్దు చేయడానికి ముందున్న దస్త్రాలతో ఆ భూమిని అమ్మడం నేరం. ఇవి ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లవు’ అని విశాఖపట్నానికి చెందిన ఓ సీనియర్‌ న్యాయవాది ‘ఈనాడు’తో చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని