శిథిల వంతెనలు కూలేవరకూ కట్టరా?

రాష్ట్రంలో గుంతలమయమైన రహదారుల మరమ్మతులు చేయట్లేదు. అత్యంత అధ్వానంగా ఉన్న రోడ్లను పునరుద్ధరణ చేయట్లేదు.

Updated : 30 May 2023 10:35 IST

ఏళ్ల తరబడి జరుగుతున్న పనులు
కొత్తగా నిర్మిస్తున్న వంతెనలదీ ఇదే దుస్థితి
బిల్లుల చెల్లింపులు లేకపోవడమే ప్రధాన కారణం

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో గుంతలమయమైన రహదారుల మరమ్మతులు చేయట్లేదు. అత్యంత అధ్వానంగా ఉన్న రోడ్లను పునరుద్ధరణ చేయట్లేదు. వంతెనల పనులపైనా ప్రభుత్వం ఇదే విధమైన నిర్లక్ష్యం చూపిస్తోంది. శిథిలమైన వాటి స్థానంలో పునర్‌నిర్మాణం, అవసరమైనచోట్ల కొత్త వంతెనల నిర్మాణాలు జరుగుతుండగా.. వీటికి బిల్లులు సరిగా చెల్లించట్లేదు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా అనేక జిల్లాల్లో వంతెనల పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. ఒకటి, రెండు చోట్ల మాత్రమే ఏదో మొక్కుబడిగా.. అదీ నత్తనడకన సాగుతున్నాయి. చేసిన పనులకు బిల్లులు చెల్లించకపోతే పనులు ఎలా చేయాలని గుత్తేదారులు ప్రశ్నిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఇచ్ఛాపురం వద్ద బహుదానదిపై ఉన్న 94 ఏళ్లనాటి శిథిల వంతెన ఇటీవల ఆకస్మికంగా కుప్పకూలింది. దీంతో రాష్ట్రంలో వంతెనల పరిస్థితిపై మరోసారి చర్చ జరుగుతోంది.


విజయనగరం జిల్లా బొబ్బిలి మండలంలోని పారాది వద్ద వేగావతి నదిపై 1950లలో నిర్మించిన ఈ వంతెన శిథిలమైంది. దీని స్థానంలో రూ.10.90 కోట్లతో కొత్త వంతెన మంజూరుచేశారు. ఈ పని దక్కించుకున్న గుత్తేదారుకు మరో వంతెన టెండరు దక్కింది. అక్కడ బిల్లులు రాలేదని.. ఇక్కడా పనులు మొదలుపెట్టలేదు. వంతెన నిర్మాణ ప్రాంతంలో స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు మార్చే పనులు కూడా ఇంకా జరగలేదు.


అనంతపురం జిల్లా నార్పల వద్ద కూతలేరు వాగుపై పాత వంతెన స్థానంలో రూ.2.5 కోట్లతో నిర్మిస్తున్న నాలుగు వరుసల వంతెన ఇది. వంతెన వరకు మాత్రమే పనులు జరిగాయి. రెండువైపులా అప్రోచ్‌ పనులను గుత్తేదారు చేయట్లేదు. ప్రభుత్వం రూ.53 లక్షలే చెల్లించడంతో, గుత్తేదారులు పనులు ఆపేశారు. దీంతో పక్కన వేసిన రహదారిలో రాకపోకలు సాగుతున్నాయి.


ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి కొత్తపట్నం రోడ్డులో బకింగ్‌హామ్‌ కెనాల్‌పై రూ.20.57 కోట్లతో నిర్మిస్తున్న వంతెన ఇది. గుత్తేదారుకు రూ.9 కోట్ల వరకే బిల్లులు చెల్లించారు. దీంతో అప్రోచ్‌ల నిర్మాణానికి గుత్తేదారు ముందుకు రావట్లేదు.


శ్రీకాకుళం జిల్లా పోలాకి మండలం వనితమండలం సమీపంలో వంశధారపై రూ.72 కోట్లతో మంజూరైన వంతెన ఇది. 17 పిల్లర్లు వేశారు. గుత్తేదారుకు రూ.34 కోట్లే చెల్లించారు. బిల్లుల జాప్యంతో పనులు నెమ్మదిగా సాగుతున్నాయి.


ఉలుకూ పలుకూ లేని ప్రభుత్వం

ర్‌అండ్‌బీ పరిధిలోని రాష్ట్ర, జిల్లా, గ్రామీణ రోడ్లలో కలిపి 28 వంతెనల పనులు జరుగుతున్నాయి. వీటి విలువ రూ.295.67 కోట్లు. ఇందులో రూ.103.44 కోట్లే ఇప్పటివరకు చెల్లించారు. ఇంకా రూ.192.23 కోట్ల బకాయిలున్నాయి.


గ్రామీణ రహదారుల్లో నాబార్డ్‌ రోడ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ ఫండ్‌ (ఆర్‌ఐడీఎఫ్‌) రూ.46.69 కోట్లతో పనులు మంజూరవ్వగా, అందులో రూ.24.76 కోట్లే ఖర్చుచేశారు. ఇంకా రూ.21.93 కోట్లు మేర పనులు జరగాలి.


రాష్ట్ర రహదారుల్లో 12 వంతెనల కోసం రూ.56.76 కోట్లు మంజూరుచేయగా, ఇందులో రూ.7.76 కోట్లే వెచ్చించారు. మరో రూ.27.64 కోట్ల పనులు చేసిన గుత్తేదారులు బిల్లుల కోసం ఎదురుచూస్తున్నారు. చెల్లింపులు లేకపోవడంతో దాదాపు అన్నిచోట్లా పనులు ఆపేశారు.


జిల్లా రహదారుల్లోనూ రూ.192.22 కోట్లతో 9 వంతెనలు మంజూరయ్యాయి. ఇందులో రూ.70.91 కోట్లు వెచ్చించారు. మరో రూ.33.16 కోట్లు బిల్లులు చెల్లించాలి.


వంతెనలు పూర్తిచేసేందుకు రూ.192.23 కోట్లు అవసరమని ఇటీవల ఇంజినీర్లు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. వీటిపై సర్కారు నుంచి స్పందన లేదు. దీంతో ఇప్పట్లో ఈ వంతెనల పనులు కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించట్లేదు.


పైన పేర్కొన్న వంతెనలతో పాటు, మరికొన్నింటిని కలిపి నాబార్డ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ అసిస్టెన్స్‌ (నిడా) నుంచి రెండోవిడత కింద రూ.500 కోట్ల మేర రుణం తీసుకునేందుకు ప్రతిపాదించారు. కానీ ఈ రుణం మంజూరు కాలేదని తెలిసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని