గుండె ఘోష వినరా?

ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్‌ తరచూ చేసే ఆర్భాట ప్రకటనలు పేద రోగులకు సాంత్వన చేకూర్చడం లేదు.

Updated : 30 May 2023 06:49 IST

కార్పొరేట్‌ వైద్యమంటారు.. బైపాస్‌ సర్జరీలు చేయలేరు
ప్రభుత్వ కార్డియో థొరాసిక్‌ సర్జన్లున్నా.. అందని సేవలు
మిషన్లు, వాల్వ్‌లు కొనుగోలు చేయక రోగులపై తీవ్ర ప్రభావం
6 బోధనాసుపత్రుల్లో అరకొరగా హృద్రోగ శస్త్రచికిత్సలు
ఈనాడు - అమరావతి  

ప్రభుత్వాసుపత్రుల అభివృద్ధిపై ముఖ్యమంత్రి జగన్‌ తరచూ చేసే ఆర్భాట ప్రకటనలు పేద రోగులకు సాంత్వన చేకూర్చడం లేదు. వైద్యులు, పారామెడికల్‌ ఉద్యోగాలను భర్తీ చేస్తున్నామని చెప్పే సీఎం.. ఆసుపత్రుల్లో సౌకర్యాలు సమకూర్చడంలో ఘోరంగా విఫలమవుతున్నారు. శస్త్రచికిత్సలు, వ్యాధి నిర్ధారణ పరీక్షలకు అవసరమైన పరికరాలు/యంత్రాల్లో ఒకటి ఉంటే మరొకటి ఉండవు. కన్జుమబుల్స్‌(వాడి పారవేసేవి) కొనుగోలుకు బడ్జెట్‌ ఉండడం లేదు. దీంతో ప్రభుత్వాసుపత్రుల్లో పేద రోగులకు కార్పొరేట్‌ వైద్యం కలగానే మిగులుతోంది.

విశాఖలోని కేజీహెచ్‌, కాకినాడ, గుంటూరు, విజయవాడ బోధనాసుపత్రుల్లో గుండె శస్త్ర చికిత్సలు స్తంభించాయి. వైద్యుల నియామకాలకు తగ్గట్లు యంత్రాలు, పరికరాలు, కన్జుమబుల్స్‌ లేకపోవడంతో గుండె శస్త్ర చికిత్సలు, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చేయాల్సిన కార్డియో థొరాసిక్‌ సర్జన్లు వాటి జోలికి వెళ్లడం లేదు. దీంతో రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు. ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందిస్తే ప్రభుత్వాసుపత్రులకు కూడా ఫీజుల రూపంలో నిధులు సమకూరతాయి. ఈ దిశగా పట్టించుకొనే వారు కరవయ్యారు. రాష్ట్రంలో పాత బోధనాసుపత్రులు 13 ఉండగా, వీటిలో బైపాస్‌ సర్జరీలు జరిగేందుకు వీలున్నవి 6 మాత్రమే. ప్రస్తుతం కర్నూలులో మాత్రమే బైపాస్‌ శస్త్రచికిత్సలు చేస్తుండగా.. విశాఖ, కాకినాడ, విజయవాడల్లో రోగులకు ఈ సేవలు అందడం లేదు. దీంతో ఆయా ఆసుపత్రుల్లో పనిచేసే వైద్యులు తమ వృత్తి నైపుణ్యాలను కాపాడుకునేందుకు, ఇతర కారణాలతో వ్రైవేట్‌ ఆసుపత్రుల్లో సేవలు కొనసాగిస్తున్నారు. తిరుపతి రుయాలో మరో రకమైన పరిస్థితి ఉంది. ఇక్కడ హృద్రోగ విభాగం, పోస్టులున్నా.. వైద్యులు మాత్రం లేరు. ఈ పరిస్థితుల మధ్య ఆయా బోధనాసుపత్రుల్లో వ్యాధి నిర్ధారణ పరీక్షల అనంతరం బైపాస్‌ సర్జరీ, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చేయించుకోవాలని వైద్యులు చెప్పిన తరువాత రోగులు ప్రైవేట్‌ ఆసుపత్రులను ఆశ్రయిస్తున్నారు.

కేజీహెచ్‌లో కొత్త మిషన్లకు పడిగాపులు

విశాఖలోని కేజీహెచ్‌లో ప్రొఫెసర్‌, అసోసియేట్‌, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ హోదాల్లో ముగ్గురు వైద్యులు పని చేస్తున్నారు. కేజీహెచ్‌లో గుండె, ఊపిరితిత్తుల శస్త్రచికిత్స విభాగం చాలాకాలంగా నడుస్తోంది. గుండె బైపాస్‌ సర్జరీ, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్స చేయాలంటే టెంపరేచర్‌ కంట్రోల్‌ మిషన్‌, హార్ట్‌ లంగ్‌ మిషన్‌ ఉండాలి. ఇవి రెండు, మూడు నెలలుగా పని చేయడం లేదు. కొత్తవి సమకూర్చేందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. సుమారు 30 మంది రోగులు బైపాస్‌ సర్జరీలు, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ కోసం ఎదురు చూస్తున్నారు. కేజీహెచ్‌లో రెండేళ్లుగా ఎమ్మారై పని చేయడం లేదు.  

విజయవాడలో వాల్వ్‌లు లేక..

విజయవాడ జీజీహెచ్‌లో కార్డియో థొరాసిస్‌ సర్జన్లు ముగ్గురున్నారు. విభాగానికి ఇంఛార్జి హెచ్‌వోడీగా అసోసియేట్‌ ప్రొఫెసర్‌ వ్యవహరిస్తున్నారు. మరో ఇద్దరు అసిస్టెంట్‌ ప్రొఫెసర్లున్నారు. ఏడాది నుంచి గుండె, ఊపిరితిత్తుల విభాగం పని చేస్తోంది. టెంపరేచర్‌ కంట్రోల్‌ మిషన్‌ (హీమోథర్మ్‌), హార్ట్‌లంగ్‌ మిషన్‌ రెండు సెట్లు ఉన్నాయి. శస్త్రచికిత్సల నిర్వహణకు అవసరమైన ఇంట్రా అరోటిక్‌ బెలూన్‌ పంప్‌, యాక్టివేటెడ్‌ క్లాటింగ్‌ మిషన్‌ ఉంది. ఇక్కడ ఓ ప్రైవేట్‌ ఆసుపత్రి యాజమాన్యం ఆధ్వర్యంలో జరిగిన ఒక్క శస్త్రచికిత్స తప్పితే ఇప్పటివరకు ఒక్క సర్జరీ కూడా జరగలేదు.

మరోవైపు వాల్వ్‌ల పంపిణీ సంస్థతో ఇప్పటివరకు ప్రభుత్వపరంగా ఒప్పందం చేసుకోలేదు. అందుకోసం నిధుల కేటాయింపు జరిగితేనే తదుపరి చర్యలు ఉండనున్నాయి. బైపాస్‌ సర్జరీ చేయాలంటే... వాడిపారేసే కన్జుమబుల్స్‌, ఇతర సామగ్రి అవసరం. వీటిని భారీగా కొనుగోలు చేస్తేనే శస్త్రచికిత్సలు ఎక్కువ సంఖ్యలో జరుగుతాయి. ఇప్పుడిప్పుడే వాటిని సమకూర్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఇక్కడి కార్డియో థొరాసిక్‌ సర్జన్లు ఊపిరితిత్తుల సర్జరీలకే పరిమితం అవుతున్నారు.


గోఖలే.. ముందుకొచ్చినా నాన్చుడే..

గుంటూరు జీజీహెచ్‌లో రోగులకు బైపాస్‌ సర్జరీలు, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చికిత్సలు అరుదుగా జరుగుతున్నాయి. అయిదుగురు కార్డియో థొరాసిక్‌ సర్జన్లు ఉన్నారు. ప్రముఖ కార్డియో థొరాసిస్‌ సర్జన్‌ డాక్టర్‌ ఆళ్ల గోపాలకృష్ణ గోఖలే జీజీహెచ్‌లో మళ్లీ గుండె శస్త్ర చికిత్సలు, గుండెమార్పిడి వైద్య సేవలు అందిచడానికి  ముందుకొచ్చినా, ప్రభుత్వ సహకారం కొరవడింది. ఈ కళాశాల పూర్వ విద్యార్థిగా ఆసుపత్రి రుణం తీర్చుకోవాలన్న ఉద్దేశంతో గత ప్రభుత్వ హయాంలో 500కు పైగా గుండె శస్త్రచికిత్సలు, 5 గుండె మార్పిడులు చేశారు. కొవిడ్‌ నేపథ్యంలో గతంలో గుండె శస్త్రచికిత్సలు నిర్వహించిన వార్డును ప్లాస్టిక్‌ సర్జరీ విభాగానికి అప్పగించారు. థియేటర్లలోని కొన్ని పరికరాలు దెబ్బతిన్నాయి. వాటిని బాగుచేసి గుండె శస్త్ర చికిత్సల విభాగంలో అమర్చాలని గత జనవరిలో జరిగిన ఉన్నత స్థాయి సమీక్షలో డాక్టర్‌ గోఖలే ఉన్నతాధికారులను కోరారు.

అన్ని సవ్యంగా జరిగి ఉంటే ఫిబ్రవరి రెండో తేదీ నుంచి జీజీహెచ్‌లో ఈ సేవలు పునఃప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఇప్పటికీ వార్డు సిద్ధం చేసి, శస్త్రచికిత్సల నిర్వహణకు అవసరమైన పరికరాలను అందుబాటులోకి తేలేదు. పరికరాల మరమ్మతులకు బడ్జెట్‌ లేదని కొంతకాలం ఆసుపత్రి అధికారులు పట్టించుకోలేదు. ఇటీవలే వార్డులో పనిచేయటానికి అవసరమైన సిబ్బందిని కేటాయించడానికి ముందుకొచ్చారు. వార్డు, థియేటర్లు సిద్ధం చేయగానే సర్జికల్స్‌, ఔషధాలు సమకూర్చుతామని ఆసుపత్రి వర్గాలు చెబుతున్నాయి. యంత్రాలకు మరమ్మతులు చేసి సిద్ధం చేశామని.. కొన్ని పరికరాలను రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్‌ఐడీసీ) ద్వారా సమకూరుస్తున్నట్లు చెబుతున్నారు.


కాకినాడ జీజీహెచ్‌లో..

కాకినాడ జీజీహెచ్‌లో ముగ్గురు కార్డియో థొరాసిక్‌ సర్జనులు ఉన్నారు. ఇక్కడ బైపాస్‌ సర్జరీ, వాల్వ్‌ రీప్లేస్‌మెంట్‌ చేయడానికి అవసరమైన మిషన్లు దశాబ్ద కాలం నాటివి అయినందున ప్రస్తుతం అవి పనిచేయడం లేదు. దీంతో వారు ఊపిరితిత్తుల శస్త్రచికిత్సలకు పరిమితమయ్యారు. పరికరాల కొనుగోలుకు ఇప్పుడు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు