ఎస్‌ఈ పోస్టుకు రూ.50 లక్షలు..! ఈఈ పోస్టుకు రూ.30-40 లక్షలు!

కీలక జిల్లా ఎస్‌ఈగా బదిలీ కావాలా? అయితే రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే. ఓ సర్కిల్‌లో ఈఈగా అయితే రూ.30-40 లక్షలు. డీఈకి రూ.20-30 లక్షలు, ఏఈకి రూ.5-10 లక్షలు..

Updated : 30 May 2023 06:51 IST

ఆర్‌అండ్‌బీలో అడిగినంత ఇస్తే నచ్చినచోటికి బదిలీ?

ఈనాడు, అమరావతి: కీలక జిల్లా ఎస్‌ఈగా బదిలీ కావాలా? అయితే రూ.50 లక్షలు ఇవ్వాల్సిందే. ఓ సర్కిల్‌లో ఈఈగా అయితే రూ.30-40 లక్షలు. డీఈకి రూ.20-30 లక్షలు, ఏఈకి రూ.5-10 లక్షలు.. ఇవీ రహదారులు, భవనాల శాఖలో బదిలీలకు ఖరారైన రేట్లు అంటూ ఆ శాఖ వర్గాల్లో విస్తృత ప్రచారం జరుగుతోంది. అలా ఇవ్వడానికి సిద్ధమైనవారికి రెండు రోజుల్లోనే బదిలీ ఉత్తర్వులు ఇచ్చేలా రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. పోటీ ఎక్కువగా ఉన్నచోట.. ఎక్కువ మొత్తం ఇచ్చేందుకు సంసిద్ధమైనవారికే అవకాశం ఇవ్వనున్నారని సమాచారం. రహదారులు, భవనాల శాఖలో గత ఏడాది మాదిరిగానే ఈసారి కూడా బదిలీలకు వసూళ్ల దందా భారీగానే జరుగుతోందని ఆ శాఖ వర్గాల్లో ముమ్మర ప్రచారం జరుగుతోంది. పోస్టును, అక్కడ జరిగే పనుల విలువను బట్టి రేట్లు ఖరారు చేసి.. వాటిని ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి.

నిరుడు ఆర్‌అండ్‌బీలో ఇంజినీర్లు, ఇతర ఉద్యోగుల బదిలీ వ్యవహారంలో అమాత్యుని పేషీ చక్రం తిప్పిందని, అమాత్యుని కుటుంబీకుడొకరు అంతా తానై చూశారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఈ నేపథ్యంలో ఈసారి తమపై ఆరోపణలు రాకుండా చూసుకునేందుకు, ఆ బాధ్యతంతా ఆర్‌అండ్‌బీలో కీలక ఇంజినీర్లకు అప్పగించినట్లు విశ్వసనీయంగా తెలిసింది. అమాత్యుని పేషీలో కీలక వ్యక్తులతో సంప్రదింపులు చేసుకున్నవారికి క్లియరెన్స్‌ ఇవ్వనున్నట్లు చెబుతున్నారు. ఇప్పటికే చాలావరకు బేరసారాలు పూర్తయినట్లు తెలిసింది. బదిలీల్లో ఏం జరిగినా అంతా ఇంజినీర్లే చేశారని, తమకేం సంబంధం లేదని చెప్పేందుకు ప్రయత్నాలు చేసినట్లు సమాచారం. ఇదే అదునుగా కొందరు ఇంజినీర్లు.. అమాత్యుని పేషీకి ఇవ్వాల్సిన దానితోపాటు, అదనంగా మరికొంత మొత్తాన్ని కలిపి డిమాండ్‌ చేస్తున్నట్లు తెలిసింది.

పెద్ద ఎత్తున వసూళ్ల పర్వం?

ప్రస్తుతం వివిధ జిల్లాల్లో ఎస్‌ఈ, ఈఈ పోస్టులతోపాటు, వేర్వేరు సర్కిళ్ల పరిధిలో 30 వరకు డీఈలు, 200 వరకు ఏఈ, ఏఈఈల పోస్టులు ఖాళీగా ఉన్నాయి.  

చిత్తూరు, ఒంగోలు, ఏలూరు జిల్లా ఎస్‌ఈ పోస్టులకు మంచి డిమాండ్‌ ఉందని.. ఇద్దరు ఎస్‌ఈలు ఇప్పటికే తమకు పోస్టింగ్‌ కావాల్సిన స్థానాలపై మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది.

ఓ జిల్లా ఎస్‌ఈ వద్ద డిప్యూటీ ఎస్‌ఈగా పనిచేస్తున్న డీఈ.. ఏదైనా సర్కిల్‌లో పోస్టింగ్‌ కావాలని రూ.10 లక్షలు ఖర్చు పెట్టుకుంటానని ముందుకొచ్చారు. రూ.20 లక్షలతో వస్తేనే మాట్లాడదామని పేషీ నుంచి అతనికి చెప్పినట్లు సమాచారం.

అయిదేళ్లు ఒకేచోట పనిచేస్తున్నవారిని తప్పనిసరిగా బదిలీ చేయాలని, రెండేళ్లు దాటినవారు అభ్యర్థన పెట్టుకుంటే బదిలీ చేయాలని, రెండేళ్లలోపు వారిని బదిలీ చేయకూడదని మార్గదర్శకాలు ఉన్నాయి. కానీ ఉమ్మడి ప్రకాశం, నెల్లూరు జిల్లాల పరిధిలో అయిదేళ్లు దాటిన ఇద్దరు సీనియర్‌ సూపరింటెండెంట్లను కదపకుండా కొనసాగిస్తున్నారని, రెండేళ్లు కూడా దాటని ఇద్దరు సూపరింటెండెంట్లు ఒంగోలు వెళ్లేందుకు లాబీయింగ్‌ చేస్తున్నట్లు తెలిసింది.


బుధవారం ఉత్తర్వులు

నెల 27న అన్ని జిల్లాల్లోని మినిస్టీరియల్‌, సాంకేతిక, ఎస్టాబ్లిష్‌మెంట్‌ సిబ్బందికి బదిలీల కౌన్సెలింగ్‌ పూర్తయింది. సోమవారం విజయవాడలోని ఆర్‌అండ్‌బీ ఈఎన్‌సీ కార్యాలయంలో ఏఈ, డీఈలకు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. మంగళవారం సచివాలయంలో ఎస్‌ఈలు, ఈఈలకు కౌన్సెలింగ్‌ జరగనుంది. వీరందరికీ బుధవారం బదిలీ ఉత్తర్వులు ఇవ్వనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని