సంక్షిప్త వార్తలు (10)
శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో సోమవారం రాత్రి గాలివానకు చెట్ల కొమ్మలు విరిగిపడటంతో సుమారు 100 సైబీరియా పక్షులు మృత్యువాత పడ్డాయి.
గాలివానకు నేలకొరిగిన సైబీరియా పక్షులు
న్యూస్‌టుడే, చిలమత్తూరు: శ్రీసత్యసాయి జిల్లా చిలమత్తూరు మండలం వీరాపురం, వెంకటాపురం గ్రామాల్లో సోమవారం రాత్రి గాలివానకు చెట్ల కొమ్మలు విరిగిపడటంతో సుమారు 100 సైబీరియా పక్షులు మృత్యువాత పడ్డాయి. మరో వంద దాకా గాయపడినట్లు సమాచారం. విద్యుత్తు సరఫరా ఆగిపోవడంతో ఆయా గ్రామాల్లో అంధకారం నెలకొంది. చెట్ల పైనుంచి కింద పడిన పక్షులకు ఎలాంటి సహాయం చేయలేకపోయామని గ్రామస్థులు నిస్సహాయత వ్యక్తం చేశారు. పక్షుల విడిదికి అధికారులు రక్షణ ఏర్పాట్లు చేయకపోవడం వల్లే అవి మృత్యువాత పడ్డాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
మానవ హక్కుల చట్టాన్ని బలోపేతం చేయాలి
లా కమిషన్ ఛైర్మన్‌కు హెచ్‌ఆర్సీ వినతి
ఈనాడు, దిల్లీ: మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని మరింత బలోపేతం చేసేందుకు సరైన సిఫార్సులతో సమగ్ర నివేదిక తయారు చేయాలని భారత లా కమిషన్ ఛైర్మన్ జస్టిస్ రీతూరాజ్ అవస్థికి మానవ హక్కుల మండలి (హెచ్‌ఆర్సీసీ) విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఛైర్మన్‌కు హెచ్‌ఆర్సీ అధ్యక్షుడు పి.జగన్‌మోహన్‌రావు, వ్యవస్థాపక కార్యదర్శి శ్యామ్‌ప్రసాద్ లేఖ రాశారు. ప్రాథమిక హక్కుల రక్షణకు శక్తిమంతంగా పని చేసే మానవ హక్కుల న్యాయస్థానాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని తెలిపారు. వాటికి ప్రత్యేక జడ్జిలు, పబ్లిక్ ప్రాసిక్యూటర్లను ఏర్పాటు చేస్తేనే అట్టడుగు వర్గాల వారి మానవ హక్కులను రక్షించగలమని అభిప్రాయపడ్డారు. 1993 నాటి మానవ హక్కుల పరిరక్షణ చట్టాన్ని 1997, 2006లో చేసిన సవరణలు బలహీనపరిచాయని లేఖలో పేర్కొన్నారు.
సీఎస్‌ను కలిసిన ఏపీజీఈఏ నేతలు
ఈనాడు, అమరావతి: ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకు దశల వారీగా ఉద్యమాన్ని కొనసాగిస్తూనే ఉంటామని ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సూర్యనారాయణ, అస్కార్‌రావు వెల్లడించారు. సచివాలయంలో సీఎస్ జవహర్‌రెడ్డిని సోమవారం కలిసి 160 డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించారు. ఏపీజీఈఏ క్షేత్రస్థాయిలో చేస్తున్న ఉద్యమాన్ని సీఎస్‌కు వారు వివరించారు. ప్రభుత్వం తమ డిమాండ్లపై సంయుక్త సమావేశం ఏర్పాటు చేసి, సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు దరఖాస్తుల ఆహ్వానం
ఈనాడు, అమరావతి: మోటూరు హనుమంతరావు (ఎంహెచ్) స్మారక ఉత్తమ జర్నలిస్టు అవార్డుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రజాశక్తి సాహితీ సంస్థ కార్యదర్శి ఎంవీఎస్ శర్మ సోమవారం వెల్లడించారు. 2022 మే ఒకటి నుంచి 2023 ఏప్రిల్ 30లోపు తెలుగు దినపత్రికలు, స్పెషల్స్‌లో ప్రచురితమైన వార్తా కథనాలు, ఫీచర్స్‌ను జూన్ 10 నాటికి తమకు అందేటట్లు పంపించాలని సూచించారు. తెలుగు రాష్ట్రాలకు చెందిన జర్నలిస్టులు దరఖాస్తులు పంపవచ్చని, దరఖాస్తుతోపాటు ఇది తన సొంత రచన, ఎవరినీ అనుకరించినది కాదని స్వీయ ధ్రువీకరణ పత్రం ఒకటి జత చేసి పంపాలని తెలిపారు. ఒకొక్కరు ఒకటి లేదా రెండు వార్తా కథనాలను పంపాలన్నారు. అవార్డు విజేతకు జూన్ మూడో వారంలో పుట్టపర్తిలో జరిగే స్మారకోపన్యాస సభలో జ్ఞాపిక, రూ.10 వేలు నగదు ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
2న గుంటూరుకు సీఎం జగన్
గుంటూరు (కలెక్టరేట్), న్యూస్‌టుడే: ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి జూన్ 2వ తేదీన గుంటూరుకు రానున్నారు. వైఎస్‌ఆర్ యంత్ర సేవా పథకం రెండో మెగా మేళా నిర్వహణలో భాగంగా 793 ట్రాక్టర్లు, 38 హార్వెస్టర్లను ఆ రోజు సీఎం జగన్ రైతులకు అందించనున్నారు. గుంటూరు, ఎన్టీఆర్, పల్నాడు, బాపట్ల, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల రైతులకు గుంటూరు వేదికగా ట్రాక్టర్లను పంపిణీ చేయనున్నారు.
7న రాష్ట్ర మంత్రిమండలి సమావేశం
ఈనాడు డిజిటల్, అమరావతి: ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జూన్ ఏడో తేదీన జరుగనుంది. సచివాలయంలోని ఒకటో బ్లాక్‌లో ఉదయం 11 గంటలకు సమావేశం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా చర్చించాల్సిన అంశాలపై జూన్ 5వ తేదీ మధ్యాహ్నం 2 గంటల లోపు నివేదిక పంపాలని ఆయా శాఖల ప్రత్యేక ప్రధానకార్యదర్శులు, ముఖ్యకార్యదర్శులు, కార్యదర్శులను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి కేఎస్ జవహర్‌రెడ్డి సోమవారం ఆదేశించారు.
చర్చి ఉన్న ప్రతి పాస్టర్‌కూ గౌరవ వేతనం ఇవ్వాలి
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రంలో చర్చి ఉన్న ప్రతి పాస్టర్‌కూ గౌరవ వేతనం ఇవ్వాలని, మూడు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతన బకాయిల్ని తక్షణం విడుదల చేయాలని తెదేపా క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఈటె స్వామిదాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు తాడేపల్లిలోని క్రైస్తవ ఆర్థిక సహకార సంస్థ కార్యాలయంలో క్రిస్టియన్ కార్పొరేషన్ ఎండీ మస్తాన్‌వలీకి సోమవారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... రెండో దఫాలో గౌరవ వేతనం కోసం దరఖాస్తు చేసుకొని 9 నెలలవుతున్నా లబ్ధిదారుల్ని ఎంపిక చేయలేదని వాపోయారు. ‘రాష్ట్రంలో 60 వేల మంది పాస్టర్లుంటే 5,196 మందికే గౌరవ వేతనం ఇస్తున్నారు. ఈ సమస్యపై ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా కలెక్టరేట్‌ల వద్ద ధర్నాలు చేస్తాం’ అని స్వామిదాస్ హెచ్చరించారు.
రేషన్‌కార్డులపై 3 జిల్లాల్లో రాగుల పంపిణీ
ఈనాడు, అమరావతి: కర్నూలు, శ్రీసత్యసాయి, అనంతపురం జిల్లాల్లోని రేషన్ కార్డుదారులకు జూన్ నుంచి రాగులను పంపిణీ చేయనున్నట్లు పౌరసరఫరాల శాఖ కమిషనర్ అరుణ్‌కుమార్ తెలిపారు. ఒక్కోకార్డుపై 3 కిలోల బియ్యానికి బదులు 3 కిలోల రాగులను ఎండీయూ వాహనాల ద్వారా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సోమవారం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. రాగులు వద్దనుకుంటే బియ్యమే తీసుకోవచ్చన్నారు. ఇప్పటికే నంద్యాల జిల్లాలో జొన్నలను పంపిణీ చేస్తున్నామని తెలిపారు. జులై నుంచి రాయలసీమ, ఇతర జిల్లాల్లోనూ రాగులు ఇస్తామని, ఏవైనా సమస్యలు ఉంటే 1967 టోల్‌ఫ్రీ నంబరుకు తెలపాలని కోరారు.
ఆస్తుల వివరాలు వెల్లడించిన ఎస్‌సీఐసీ
ఈనాడు, అమరావతి: రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్ (స.హ చట్టం-ఎస్‌సీఐసీ) ఆర్. మహబూబ్ బాషా సోమవారం స్వచ్ఛందంగా ఆస్తుల వివరాలను ప్రకటించారు. ప్రొద్దుటూరులో పూర్వీకుల నుంచి సంక్రమించిన 60 గజాల ఇల్లు (విలువ రూ.19.32 లక్షలు), వైయస్‌ఆర్ జిల్లా ముద్దనూరులో రూ.4.03 లక్షలు విలువ చేసే 351 చ.గజాల స్థలం, అదేఊరులో భార్య జరీనా బేగం పేరిట 175 చ.గజాల స్థలం ఉందన్నారు. 2 ద్విచక్ర వాహనాలు, వివిధ బ్యాంకు ఖాతాల్లో రూ.15.97 లక్షలు, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం కింద పోస్టాఫీసు ఖాతాలో రూ.1.56 లక్షలు, జాతీయ పింఛను పథకంలో రూ.19,170, కొటక్ అస్యూర్డ్ ఇన్‌కమ్ స్కీమ్‌లో రూ.2.19 లక్షలు ఉన్నాయని వెల్లడించారు. భార్య పేరిట ఓ బ్యాంక్‌లో రూ.3,024, రూ.2 లక్షల విలువైన బాండ్లతో ఆమె వద్ద 30 తులాల బంగారం, 4 తులాల వెండి ఉన్నాయని తెలిపారు. ఆదాయపు పన్ను మినహాయించగా నెలకు రూ.3.41 లక్షల జీతం వస్తున్నట్లు ప్రకటించారు. ఏపీ స.హ. కమిషన్లో పనిచేసే ఇతర కమిషనర్లు ఆస్తుల వివరాలను వెల్లడించి పారదర్శకతను నెలకొల్పాలని కోరారు.
ఇస్రోకు పవన్‌కల్యాణ్ అభినందనలు
ఈనాడు, అమరావతి: ‘భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) ఎన్‌వీఎస్-01 ఉపగ్రహాన్ని విజయవంతంగా కక్ష్యలో ప్రవేశపెట్టడం గర్వించదగ్గ విషయం. ఈ ప్రయోగంలో పాలు పంచుకున్న శాస్త్రవేత్తలందరికీ అభినందనలు’’ అని జనసేన అధినేత పవన్‌కల్యాణ్ సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
అవకాశం దొరికిన ప్రతిసారీ బ్రిజ్ భూషణ్ వేధింపులకు పాల్పడ్డాడు: దిల్లీ పోలీసులు
-
Vivek Agnihotri: నా సినిమాకు వ్యతిరేకంగా డబ్బులు పంచుతున్నారు: వివేక్ అగ్నిహోత్రి తీవ్ర ఆరోపణలు
-
Russia: పశ్చిమ దేశాలు నేరుగా రష్యాతో యుద్ధంలో ఉన్నాయి: సెర్గీ లవ్రోవ్
-
Motkupalli: జగన్.. నీ విధానాలు చూసి జనం నవ్వుకుంటున్నారు: మోత్కుపల్లి
-
Nara Lokesh: వచ్చేవారం నారా లోకేశ్ ‘యువగళం’ తిరిగి ప్రారంభం..!
-
Yanamala: ప్రభుత్వానివి చందమామ కథలు.. సీఐడీవి చిలకపలుకులు: యనమల