ఎస్సీలకు ఆఖరి మజిలీలోనూ కష్టాలేనా?

ఎస్సీ కాలనీల వాసులకు శ్మశాన వాటికల ఏర్పాటులోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. జనాభా సంఖ్య అనుసరించి.. కనీసం ఎకరా స్థలం చొప్పున కేటాయించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తోంది.

Published : 30 May 2023 05:49 IST

శ్మశానవాటికలకు స్థలాలు కేటాయించని ప్రభుత్వం
అరకొరగా ఉన్నవాటిలో వైకాపా నేతల అనుచరుల ఆక్రమణలు
‘గడప-గడప’లో ప్రజాప్రతినిధులను నిలదీస్తున్న ప్రజలు

నా ఎస్సీ..ఎస్టీ.. సోదరులని సభల్లో పదేపదే చెప్పే సీఎం జగన్‌కు వారి బాధలు మాత్రం పట్టడం లేదు. చనిపోయిన తమవారి అంత్యక్రియలు కూడా సజావుగా నిర్వహించలేని దుర్భర పరిస్థితుల్లో ఉన్న ఎస్సీ కాలనీ వాసుల కష్టాలను పట్టించుకొనే నాథుడే లేరు. శ్మశానవాటికలకు స్థానికంగా ఎకరా చొప్పున కేటాయించినా సమస్య పరిష్కారమయ్యే అవకాశం ఉంది. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు దాటినా ఈ దిశగా చర్యల్లేకపోవడంతో ప్రజాప్రతినిధులు ఎస్సీ కాలనీవాసుల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తోంది.

ఈనాడు, అమరావతి: ఎస్సీ కాలనీల వాసులకు శ్మశాన వాటికల ఏర్పాటులోనూ రాష్ట్ర ప్రభుత్వం తీవ్ర అలక్ష్యాన్ని ప్రదర్శిస్తోంది. జనాభా సంఖ్య అనుసరించి.. కనీసం ఎకరా స్థలం చొప్పున కేటాయించడానికి కూడా మీనమేషాలు లెక్కిస్తోంది. ప్రభుత్వ స్థలం అందుబాటులో లేకుంటే, ప్రైవేట్‌ భూమిని కొనుగోలు చేయాలి. ఈ విషయంలో జిల్లాల అధికారులు చర్చలు, ప్రతిపాదనలకే పరిమితమవుతున్నారు. ఈ నేపథ్యంలో అరకొర సౌకర్యాల మధ్య జీవనం సాగించే ఎస్సీ కాలనీల్లో ఎవరైనా మరణిస్తే.. వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు పడరాని పాట్లు పడుతున్నారు. కుటుంబ సభ్యులను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న వీరు భౌతిక కాయాలతో వెళ్లేందుకు సరైన మార్గం లేక.. నడవలేక.. వాహనాల్లో వెళ్లలేక వ్యయప్రయాసలకు గురవుతున్నారు. వర్షాకాలంలో పరిస్థితి మరీ ఘోరంగా ఉంటోంది. కొన్నిచోట్ల శ్మశానవాటికలకు అరకొరగా ఉన్న స్థలాలను వైకాపా నేతల అనుచరులు ఆక్రమిస్తుండడంతో ఎస్సీ కాలనీల వాసులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో మిన్నకుంటున్నారు. ఈ సమస్యలపై ఎస్సీ వాడల్లో నివసించే వారు ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారు. గడప-గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాల్లో ఇటువంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. అప్పటికప్పుడు హామీలు ఇచ్చేసి ఎస్సీ వాడల నుంచి వారు బయటపడుతున్నారు.

రెండు దశాబ్దాల కిందట కాలనీ ఏర్పడినా..

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలోని గణేష్‌నగర్‌ కాలనీ రెండు దశాబ్దాల కిందట ఏర్పాటైంది. ఇక్కడ 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఎవరైనా చనిపోతే అంత్యక్రియల కోసం దూరంగా తీసుకెళ్లడానికి వీరు సమస్యలు ఎదుర్కొంటున్నారు. తక్కువ దూరంలో ఉన్న శ్మశానవాటికలో స్థానికంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం సుద్దమళ్ల పంచాయతీలోని ఓబుల్‌రెడ్డిగారిపల్లె దిగువ దళితవాడ గ్రామస్థులకు శ్మశానవాటిక లేకపోవడంతో ఓ ప్రైవేట్‌ భూమిలో ఖననం చేస్తున్నారు. ఈ భూమినీ ఇతరులు ఆక్రమించుకున్నారు. పల్లె నుంచి మృతదేహాన్ని అర ఫర్లాంగు దూరం పంట పొలాల మధ్య తీసుకెళ్లాలి. ఆరు నెలల కిందట మృతదేహాన్ని తీసుకెళుతున్న సమయంలో తమ పొలాల నుంచి తీసుకెళ్లవద్దన్న అభ్యంతరాలు వచ్చాయి. దీంతో వారు నడిరోడ్డుపై బైఠాయించి తమకు శ్మశానవాటిక, అక్కడికి వెళ్లేందుకు మార్గం ఏర్పాటు చేయాలని ఆందోళన చేపట్టారు. ఈ గ్రామం రాయచోటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్‌రెడ్డి స్వగ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఉన్నా, సమస్య పరిష్కారం కాకపోవడం విశేషం. ‘ఊరిలో ఎవరు చనిపోయినా పూడ్చేందుకు తీసుకెళ్లాలంటే గొడవలు అవుతున్నాయి. ప్రస్తుతం అంత్యక్రియలు నిర్వహిస్తున్న స్థలంలో రాతి బండ ఉంది. రెండు సెంట్లు కూడా లేనందున ఇబ్బందులు పడుతున్నాం. అక్కడికి వెళ్లేందుకు దారి లేదు. ఎన్నోసార్లు విన్నవించుకున్నా.. ఆందోళనలు చేసినా అధికారుల నుంచి స్పందన లేదు’ అని ఓబుల్‌రెడ్డిగారిపల్లె దిగువ దళితవాడ వాసి వాపోయారు.

2,000 గ్రామాల్లో స్థలాలు అవసరం

ప్రాథమిక అంచనా ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2,000కు పైగా గ్రామాల్లో శ్మశానవాటికల అవసరం ఉన్నట్లు జిల్లా అధికారుల ద్వారా సాంఘిక సంక్షేమ శాఖకు వివరాలు అందాయి. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని ఎస్సీల కాలనీలకు దూరంగా శ్మశానవాటికలు ఉన్నాయి. పుట్లూరు మండలంలో సుమారు 15 గ్రామాల్లో ఎస్సీలు జీవిస్తున్నారు. వాటిలో చింతకుంట గ్రామానికి చెందిన వారు ఎవరైనా చనిపోతే వారి మృతదేహాన్ని అంత్యక్రియల కోసం రెండు కిలోమీటర్ల దూరం తీసుకువెళ్లాల్సి వస్తోంది. మరికొన్ని గ్రామాల్లో స్థలాలు సరిపోవడం లేదు. యల్లనూరు మండలంలోని కోడుమూర్తి, తిరుమలాపురం ఇతర గ్రామాల్లో ఎస్సీలకు కేటాయించిన శ్మశానవాటికల స్థలాన్ని వైకాపా నేతల అనుచరులు ఆక్రమించారు. వీటి గురించి స్థానిక ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. ఇటీవల ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమానికి వెళ్లిన ఎమ్మెల్యే పద్మావతిని ఎస్సీ వాడ మహిళలు అడ్డుకుని.. శ్మశానవాటిక సమస్యకు పరిష్కారం చూపరా అని నిలదీశారు. 50 ఏళ్లకు పైగా వినియోగిస్తున్న స్థలాన్ని ఆక్రమించారని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని