అప్పుల పరంపర

దొరికినంత అప్పు తెచ్చుకోవడం.. రోజులు గడిపేయడం.. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం తీరు. లెక్కకు మించి అప్పులు చేస్తే సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు వరుసగా రాష్ట్రాన్ని తీవ్రంగా హెచ్చరించినా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు.

Updated : 31 May 2023 07:53 IST

కేంద్రం అనుమతించిన రుణాల్లో సగం తెచ్చేశాం
9 నెలలకు రూ. 30,275 కోట్లకు అనుమతి.. 2 నెలల్లోనే రూ. 15,500 కోట్ల రుణాలు
సెక్యూరిటీల వేలం ద్వారా రూ. 2,000 కోట్లు  
కేంద్రం రూ.పది వేల కోట్ల గ్రాంటు ఇచ్చినా అప్పుల్లో తగ్గేదేలే..!

ఈనాడు, అమరావతి: దొరికినంత అప్పు తెచ్చుకోవడం.. రోజులు గడిపేయడం.. ఇదీ రాష్ట్ర ప్రభుత్వం తీరు. లెక్కకు మించి అప్పులు చేస్తే సంక్షోభ పరిస్థితులు తలెత్తుతాయని కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదికలు వరుసగా రాష్ట్రాన్ని తీవ్రంగా హెచ్చరించినా ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. కొత్త అప్పులు తెచ్చి పాత అప్పులు తీర్చుకునేంతటి దుస్థితి ఏర్పడిందని ఈ నివేదికలు ఘోషిస్తున్నా తీరు మారలేదు. కొత్త ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే రాష్ట్రం ఏకంగా రూ. 15,500 కోట్ల రుణాన్ని ఒక్క బహిరంగ మార్కెట్‌ నుంచే సమీకరించింది. కేంద్రం 9 నెలల కాలానికి అనుమతించిన అప్పుల్లో సగం రుణాన్ని రెండు నెలల్లోనే తీసేసుకుంది. ఈ మంగళవారం రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో పాల్గొని రూ. 2,000 కోట్ల అప్పు తీసుకుంది. పదేళ్ల కాలపరిమితితో తీర్చేలా 7.37 శాతం వడ్డీకి రూ.వెయ్యి కోట్లు, 12 ఏళ్ల కాలపరిమితితో 7.36 శాతం వడ్డీకి మరో రూ.వేయి కోట్లు తీసుకుంది. దీంతో ఈ ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే ఏకంగా రూ. 15,500 కోట్ల అప్పు చేసినట్లయింది.

రూ.10,460 కోట్లు కేంద్రం ఇచ్చినా..

ఒకవైపు కేంద్రం మే నెలలో ఏకంగా రూ. 10,460 కోట్లను ప్రత్యేక గ్రాంటుగా మంజూరు చేసింది. 2014-15 ఆర్థిక సంవత్సరం రెవెన్యూ లోటు కింద నిధులివ్వాలని రాష్ట్రం ఎప్పటినుంచో కోరుతూ వస్తోంది. ఈ మే నెలలో రెవెన్యూ లోటు గ్రాంటు కింద రూ. 10,460 కోట్లను రాష్ట్ర ఖజానాకు జమ చేసింది. ఇంత పెద్దమొత్తంలో నిధులు ప్రతి నెలా వచ్చే అవకాశం లేదు. అదనపు నిధులు వచ్చిన నెలలోనూ ఏకంగా రూ. 9,500 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణం తీసుకోవడం గమనార్హం. దీనికితోడు ప్రతి నెలా ఖజానాకు వచ్చే రాబడి ఎలాగూ ఉంది. కేంద్రం ఏటా రాష్ట్ర ప్రభుత్వానికి బహిరంగ మార్కెట్‌ ద్వారా రుణాలు సమీకరించుకునేందుకు అనుమతిస్తుంది. ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర స్థూల ఉత్పత్తి విలువ అంచనా వేసి ఇందులో దాదాపు 3.5 శాతం మేర రుణాలు తీసుకునే వీలు కల్పిస్తుంది. ఇందులోనుంచి ఇతర రూపాల్లో తీసుకునే రుణాల మొత్తాన్ని మినహాయిస్తుంది. ఆ ఆర్థిక సంవత్సరంలో పాత రుణాలను ఎంత మేర తీరుస్తున్నారో ఆ మొత్తాలను కలుపుతుంది. వీటన్నింటినీ పరిగణనలోకి తీసుకుని అప్పులు మంజూరు చేస్తుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కేంద్రం రూ. 30,275 కోట్ల రుణం తొలి తొమ్మిది నెలల్లోనూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవచ్చని అనుమతించింది. అలాంటిది ఏకంగా తొలి రెండు నెలల్లోనే రూ.15,500 కోట్ల అప్పులు చేయడం గమనార్హం.


సగటున రూ. 3,400 కోట్లయితే.. రెట్టింపు రుణం

కేంద్రం 9 నెలలకు మంజూరు చేసిన అప్పుల మొత్తం ఆధారంగా సగటున నెలకు రూ. 3,400 కోట్ల రుణం సమీకరించేందుకే అవకాశముంది. అలాంటిది ఈ పరిమితిని మించి అప్పు చేస్తోంది. ఆర్థిక సంవత్సరం ప్రారంభ నెలలోనే రూ. 6,000 కోట్ల రుణం తీసుకుంది. మే నెలలో ఇంతకుమించింది. రెండో నెలలో ఏకంగా రూ.9,500 కోట్ల మేర బహిరంగ మార్కెట్‌ రుణం సమీకరించింది. అనుమతించిన సగటు అప్పుతో పోలిస్తే అది ఎంతో ఎక్కువ.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు