సమ్మె బాటలో విద్యుత్తు ఉద్యోగులు

విద్యుత్తు ఉద్యోగులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. యాజమాన్యంతో మంగళవారం చర్చలు విఫలం కాగా.. వెంటనే విద్యుత్తు ఉద్యోగుల ఐకాస నేతలు సమావేశమయ్యారు.

Updated : 31 May 2023 04:25 IST

14 రోజుల సమ్మె నోటీసు ఇవ్వాలని నిర్ణయం

ఈనాడు, అమరావతి: విద్యుత్తు ఉద్యోగులు సమ్మెబాట పట్టాలని నిర్ణయించారు. యాజమాన్యంతో మంగళవారం చర్చలు విఫలం కాగా.. వెంటనే విద్యుత్తు ఉద్యోగుల ఐకాస నేతలు సమావేశమయ్యారు. దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని డిమాండ్ల సాధనకు సమ్మె ఒక్కటే మార్గమని మెజారిటీ సభ్యులు అభిప్రాయపడ్డారు. యాజమాన్యానికి 14 రోజుల సమ్మె నోటీసు ఇవ్వాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఉద్యోగుల వేతన సవరణ (పీఆర్‌సీ), అలవెన్సుల చెల్లింపు, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ డిమాండ్లను పరిష్కరించడంపై యాజమాన్యం చాలాకాలంగా నిర్ణయం తీసుకోకపోవడంతో నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం విద్యుత్‌సౌధలో అధికారికంగా జరిగిన చర్చల్లో.. వేతన సవరణ ఒప్పందం ప్రకారం 2022 ఏప్రిల్‌ నుంచి సింగిల్‌ మాస్టర్‌ స్కేల్‌ అమలు చేస్తామని, ఒప్పందం 4 ఏళ్లు అమల్లో ఉంటుందని యాజమాన్యం ప్రతిపాదించింది. గరిష్ఠ మాస్టర్‌ స్కేలు దాటిన మూలవేతనాన్ని స్పెషల్‌ పేగా, గరిష్ఠ కేడర్‌ స్కేల్‌ దాటిన మూల వేతనాన్ని పర్సనల్‌ పేగా పరిగణిస్తామని పేర్కొంది. గరిష్ఠ మాస్టర్‌ స్కేల్‌/కేడర్‌ స్కేల్‌ను పొడిగించడానికి అంగీకరిస్తామని తెలిపింది. పింఛను ప్రయోజనాలకు రక్షణ కల్పిస్తామని పేర్కొంది. గరిష్ఠ మాస్టర్‌ స్కేల్‌, గరిష్ఠ కేడర్‌ స్కేల్‌లపై వచ్చిన ప్రతిపాదనలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకించాయి. సింగిల్‌ మాస్టర్‌ స్కేల్‌ రూపొందించి, పాత విధానంలోనే పే ఫిక్సేషన్‌ చేయాలని కోరాయి.


ప్రధాన డిమాండ్లు

* విద్యుత్తు సిబ్బందికి 2022 ఏప్రిల్‌ నుంచి పీఆర్‌సీ అమలు కావాలి. 

* పీఆర్‌సీపై విశ్రాంత ఐఏఎస్‌ అధికారి మన్మోహన్‌సింగ్‌ నేతృత్వంలో ఏర్పాటు చేసిన కమిషన్‌ నివేదిక అమలు చేస్తే.. ఉద్యోగుల జీతాలు పెరగాల్సింది పోయి.. తగ్గే అవకాశం ఉంది.     

* ఒప్పంద ఉద్యోగులకు సంస్థ నుంచి నేరుగా జీతాలు చెల్లించాలి.     

* 1999-2004 మధ్య విధుల్లో చేరిన సిబ్బందికి పాత పింఛను విధానాన్ని వర్తింపజేయాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని