ఉష్ణోగ్రతలు, అధిక లోడు వల్లే సమస్యలు

ఉష్ణోగ్రతలు, అధిక లోడు వల్ల మాత్రమే విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని.. గాలివానల వల్ల అక్కడక్కడా సమస్యలు వస్తున్నాయని డిస్కంలు ఒక ప్రకటనలో తెలిపాయి.

Updated : 31 May 2023 04:57 IST

విద్యుత్‌ కోతలపై డిస్కంల వివరణ

ఈనాడు, అమరావతి: ఉష్ణోగ్రతలు, అధిక లోడు వల్ల మాత్రమే విద్యుత్‌ సరఫరాలో అంతరాయాలు ఏర్పడుతున్నాయని.. గాలివానల వల్ల అక్కడక్కడా సమస్యలు వస్తున్నాయని డిస్కంలు ఒక ప్రకటనలో తెలిపాయి. ‘కష్టాలు కనలేరా.. విద్యుత్‌ కొనలేరా’ శీర్షికన రాష్ట్రంలో విద్యుత్‌ కోతలపై ఈనాడులో మంగళవారం ప్రచురించిన కథనంపై డిస్కంలు వివరణ ఇచ్చాయి. ‘విద్యుత్‌ వినియోగదారులకు అసౌకర్యం కలగకూడదన్న ఉద్దేశంతో డిమాండ్‌ మేరకు సరఫరా చేసేలా బహిరంగ మార్కెట్‌ నుంచి యూనిట్‌ రూ.10 వంతున కొనుగోలు చేసి సరఫరా చేశాం. రాత్రి వేళల్లో విద్యుత్‌ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. దానివల్ల 11 కేవీ ఫీడర్లు, సబ్‌స్టేషన్లు, ట్రాన్స్‌ఫార్మర్లపై తీవ్ర ఒత్తిడి పడుతోంది. ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో అదనపు ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నాం. ఆదివారం 0.24 ఎంయూలు, శనివారం 0.19 ఎంయూల విద్యుత్‌ లోటు అనేది కేవలం గ్రిడ్‌ ఫ్రీక్వెన్సీ నిర్దిష్ట స్థాయిలో నిలిపి ఉంచడానికి చేసిన డిమాండ్‌ సర్దుబాటు మాత్రమే’ అని పేర్కొన్నాయి. గాలులకు ఏదో ఒక ప్రాంతంలో స్తంభాలు విరిగిపడి సరఫరాకు అంతరాయం కలగడం సహజం. కానీ, రాష్ట్రవ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విద్యుత్‌ నిలిచిపోతోంది. అయినా కోతలకు విద్యుత్‌ కొరత కారణం కాదని, ప్రతికూల వాతావరణం వల్ల తలెత్తే సాంకేతిక సమస్యలే కారణమని డిస్కంలు ప్రకటన జారీ చేయడం గమనార్హం.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని