దరఖాస్తుల్లోనే సంస్థలు.. కనిపించని బోర్డులు

తప్పుడు రిజిస్ట్రేషన్లతో జీఎస్టీ ఎగవేస్తున్న సంస్థల ఏరివేత కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు చేపట్టిన తనిఖీలలో పది వేలకుపైగా ఇలాంటి సంస్థలున్నట్లు దేశవ్యాప్తంగా గుర్తించారు.

Updated : 31 May 2023 05:11 IST

దేశవ్యాప్తంగా ఇప్పటివరకు పదివేల తప్పుడు సంస్థల గుర్తింపు
రాష్ట్రంలో ఉన్నవి 150.. అనుమానాస్పద జాబితాలో మరో 125

ఈనాడు, అమరావతి: తప్పుడు రిజిస్ట్రేషన్లతో జీఎస్టీ ఎగవేస్తున్న సంస్థల ఏరివేత కొనసాగుతోంది. ఈ నెల 16 నుంచి ఇప్పటివరకు చేపట్టిన తనిఖీలలో పది వేలకుపైగా ఇలాంటి సంస్థలున్నట్లు దేశవ్యాప్తంగా గుర్తించారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 530 సంస్థల వివరాలను ప్రత్యేక బృందాలు పరిశీలించాయి. వీటిల్లో 150 వరకు తప్పుడు రిజిస్ట్రేషన్లతో నడుస్తున్నట్లు గుర్తించారు. అనుమానాస్పదంగా ఉన్న మరో 125 సంస్థలపై విచారణ కొనసాగుతోంది. ఇందులో పాత ఇనుము, ఇనుపరాడ్ల క్రయవిక్రయాల దుకాణాలు, ఇతర వ్యాపార సంస్థలున్నాయి. విశాఖ, గుంటూరు, ఇతరచోట్ల తప్పుడు రిజిస్ట్రేషన్లతో నడుస్తున్నవి ఎక్కువగా ఉన్నట్లు తేలింది. శ్రీసిటీ సమీపంలోనూ ఇలాంటి సంస్థలు పది వరకు ఉన్నట్లు గుర్తించారు. సులభతర వాణిజ్య విధానంలో భాగంగా ఆన్‌లైన్‌ ద్వారా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి అధికారులు రిజిస్ట్రేషన్‌ చేస్తున్నారు. దరఖాస్తు స్వీకరించి మూడు రోజుల్లోగా అనుమతులు ఇవ్వకపోతే ఆటోమేటిక్‌ (డీమ్డ్‌)గా రిజిస్ట్రేషన్‌ అవుతాయి. ఈ క్రమంలో సమర్పించిన వివరాలను సమగ్రంగా పరిశీలించేందుకు అవకాశం ఉండడం లేదు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ముగిసి కొన్నాళ్లకు భారీగా ఇన్వాయిస్‌లు జారీ అయినట్లు గుర్తించాక కానీ అక్రమాలు బయటపడడం లేదు. గత ఫిబ్రవరిలో రాష్ట్రంలో పాత ఇనుము వ్యాపారులు 40 బోగస్‌ సంస్థల ఇన్వాయిస్‌ల ద్వారా రూ.100 కోట్ల మేర జీఎస్టీ ఎగ్గొట్టారని గుర్తించారు.

30వేల సంస్థల వివరాల పరిశీలనకు నిర్ణయం: జీఎస్టీ కౌన్సిల్‌ నిర్ణయించిన మేరకు అన్ని రాష్ట్రాలూ తనిఖీలు ప్రారంభించాయి. రాష్ట్రంలో లక్షన్నర మంది డీలర్లు కేంద్ర పరిధిలో, 3లక్షల మంది వాణిజ్య పన్నుల శాఖ పరిధిలో రిజిస్ట్రేషన్‌ పొందారు. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలోని కనీసం 30 వేల సంస్థల వివరాలను 32 ప్రత్యేక బృందాలతో పరిశీలించాలని వాణిజ్య పన్నుల శాఖ నిర్ణయించింది. ఈ తనిఖీలు జులై 15 వరకు కొనసాగనున్నాయి. విశాఖ పరిధిలో 21, నెల్లూరు, కడప పరిధిలో 15 చొప్పున తప్పుడు రిజిస్ట్రేషన్లతో సంస్థలు నడుపుతున్నట్లు ఇప్పటికే తేలింది. వ్యాపార బోర్డులుగానీ, తదనుగుణ వాతావరణంగానీ ఆ ప్రాంతాల్లో కనిపించలేదు. వీటిలో అత్యధికం గతేడాదిలోనే రిజిస్ట్రేషన్‌ పొందినవిగా గుర్తించారు. రిజిస్ట్రేషన్‌కు తగ్గట్టు మరో 125 సంస్థల చిరునామాలను పరిశీలించినప్పుడు అరకొర సమాచారమే లభించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని