నేతల కబ్జాలో రేవెళ్ల చెరువు భూములు

విశాఖలో భూములను సొంతం చేసుకునేందుకు చెరువులు, గెడ్డలను వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నారు. జిల్లాలోని పెందుర్తి మండల పరిధిలోని సత్తివానిపాలెం వద్ద రేవెళ్ల చెరువుకు సంబంధించిన సుమారు రూ.50 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి.

Published : 01 Jun 2023 05:17 IST

రూ.50 కోట్ల భూమిపై ‘అధికార’ పంజా
హెచ్చరికల ఫ్లెక్సీల తొలగింపు

ఈనాడు, విశాఖపట్నం: విశాఖలో భూములను సొంతం చేసుకునేందుకు చెరువులు, గెడ్డలను వైకాపా నాయకులు కబ్జా చేస్తున్నారు. జిల్లాలోని పెందుర్తి మండల పరిధిలోని సత్తివానిపాలెం వద్ద రేవెళ్ల చెరువుకు సంబంధించిన సుమారు రూ.50 కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతమయ్యాయి. అయినా అధికారులు ఇటు వైపు కన్నెత్తి చూడటం లేదు. రేవెళ్ల చెరువు సర్వే నంబరు 355లో సుమారు 79.25 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వర్షపు నీరు చేరడానికి అనువుగా ఇరువైపులా గెడ్డలుండేవి. షీలానగర్‌ నుంచి నరవకు ప్రధాన రహదారి ఏర్పాటు చేసే సమయంలో చెరువుకు ఒకవైపు ఉన్న గెడ్డ మధ్య నుంచి రోడ్డు నిర్మించారు. విడిపోయిన గెడ్డ స్థలం సుమారు 10 ఎకరాల వరకు ఉందని గుర్తించి రెవెన్యూ అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేస్తున్నా..అవి మాయమవుతున్నాయి. ఈ క్రమంలో ప్రహరీ కూడా నిర్మించి గెడ్డ భూమిని కలిపేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అయిదు ఎకరాల మేర ఆక్రమణలకు గురైనట్లు సమాచారం. ఇక్కడ ప్రస్తుతం ఎకరం రూ.10 కోట్ల వరకూ ధర పలుకుతోంది. మిగిలిన భూమిలోనూ అధికారులు ఏర్పాటు చేసిన హద్దులను తొలగించి మట్టిని చదును చేస్తున్నారు.

అడ్డుకుంటే బదిలీ

రేవెళ్ల చెరువుకు సంబంధించిన గెడ్డ భూమిలో ఆక్రమణలపై ఫిర్యాదులు రావడంతో  పెందుర్తి తహసీల్దార్‌గా రామారావు ఉన్నప్పుడు.. ఆయన ఆదేశాలతో రెవెన్యూ సిబ్బంది సర్వే చేసి ఆక్రమణలు నిజమని తేల్చి నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆక్రమణలు తొలగించకపోవడంతో గెడ్డ భూమిలో ఉన్న ప్రహరీని తొలగించే ప్రయత్నం గత జనవరిలో చేశారు. ఆ సమయంలో వైకాపా నాయకుడిగా ఉన్న దొడ్డి కిరణ్‌ అనుచరులు దాడికి దిగారు. ఆ వెంటనే ఆర్‌ఐపై బదిలీ వేటు పడింది. తహసీల్దార్‌, సర్వేయర్లను బదిలీ చేశారు. మళ్లీ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గతంలో అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరికల బోర్డులు ప్రస్తుతం లేవు.

రాత్రికి రాత్రే దుకాణాలు

విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ నిర్మాణానికి 60 సెంట్లు, శ్మశాన వాటికకు రెండు ఎకరాల చెరువు భూములను ప్రభుత్వం కేటాయించింది.  అయితే ఆ తరువాత కొందరు చెరువు, వాగు స్థలాలను చదును చేసి రేకులతో దుకాణాలు నిర్మిస్తున్నారు. ఈ నిర్మాణాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో జరుగుతున్నాయి. ఈ విషయంపై సచివాలయ వీఆర్వో సంతోష్‌ను వివరణ కోరగా ‘చెరువు భూముల్లో ఆక్రమణల విషయం మా దృష్టికి వచ్చింది. సర్వే చేయించి చర్యలు తీసుకుంటాం’ అని సమాధానమిచ్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు