పసుపు రైతుల గోడు పట్టదా?

మీ బిడ్డ పాలనలో ఉద్యాన పంటల సాగు పెరిగిందని, మీ బిడ్డ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క కరవు మండలమూ ప్రకటించాల్సిన అవసరం రాలేదని సీఎం జగన్‌ బహిరంగ సభల్లో భుజాలు చరచుకుంటున్నారు.

Published : 01 Jun 2023 05:18 IST

పంట చేతికొచ్చి నెలలు గడుస్తున్నా.. ప్రారంభం కాని సేకరణ
ధరలు లేక.. కొనే దిక్కులేక.. రైతుల అగచాట్లు

మీ బిడ్డ పాలనలో ఉద్యాన పంటల సాగు పెరిగిందని, మీ బిడ్డ అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క కరవు మండలమూ ప్రకటించాల్సిన అవసరం రాలేదని సీఎం జగన్‌ బహిరంగ సభల్లో భుజాలు చరచుకుంటున్నారు. అయితే మూడు నెలలుగా ధరలు దక్కక.. కొనేవారు లేక పసుపు రైతులు అల్లాడుతున్నా ఈ బిడ్డ పట్టించుకోలేదు. రబీ ముగిసి ఖరీఫ్‌ మొదలవుతున్నా సేకరణ ప్రారంభించలేదు. ఏటా పంట వేయడానికి ముందే మద్దతు ధరలు  ప్రకటిస్తామన్న ఈ బిడ్డ.. నాలుగేళ్లుగా పసుపు పంటకు మద్దతు ధర విషయాన్ని మరచిపోయారు.

ఈనాడు, అమరావతి

పసుపు పంటకు ధర లేదని.. అమ్ముకోవడానికి మూడు నెలలుగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ ప్రభుత్వానికి తెలుసు. అయినా సేకరణకు పచ్చజెండా ఊపడం లేదు. అకాల వర్షాలతో పసుపు రైతులు కన్నీరు మున్నీరవుతున్నా కిమ్మనడం లేదు. క్వింటాలు ధర రూ.5 వేలకు పడిపోవడంతో కొనేవారు లేక, తక్కువ ధరకే అమ్ముకోలేక సతమతమవుతున్నా నీళ్లు నములుతోంది. ఏటా మద్దతు ధరల సంగతి దేవుడెరుగు, నాలుగేళ్ల క్రితం ప్రకటించిన ధరకైనా కొనాలని వేడుకుంటున్నా.. ముఖ్యమంత్రి మనసు కరగడం లేదు. గతేడాది కూడా ఇలాగే పంట కాలం పూర్తయ్యాక జూన్‌లో కొనుగోలు ప్రారంభించి.. మొక్కుబడిగా 6వేల టన్నులు సేకరించి ముగించారు. ఈ ఏడాది ఇప్పటివరకు ఉలుకు పలుకు లేకపోవడంపై రైతుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది.

మార్చి నుంచి ఎదురుచూపులే

రాష్ట్రంలో 2022-23 ఖరీఫ్‌లో 43,683 ఎకరాల్లో పసుపు సాగుచేశారు. సాధారణంగా మార్చిలో చేతికి పసుపు వస్తుంది. పంట తీసి.. ఉడికించి ఆరబెడతారు. అప్పటికే సేకరణకు ఏర్పాట్లు చేస్తే.. వెంటనే అమ్ముకోవచ్చు. మే నెల ముగుస్తున్నా.. ఇప్పటివరకూ ప్రభుత్వం ఎలాంటి ఏర్పాట్లూ చేయలేదు. ఈ ఏడాది మార్చిలోనే పంట తీసినా.. అప్పటి నుంచి రైతులు అమ్మకానికి ఎదురుచూస్తున్నారు. ఈలోగా వర్షాలు మొదలుకావడంతో అక్కడక్కడ పసుపు తడిసింది. అయినా కనీసం పంట నష్టపోయిన రైతులకు పరామర్శలూ లేవు. మద్దతు ధరకు పసుపు కొంటామనే ఒక్క మాట కూడా ప్రభుత్వం నుంచి రాలేదని రైతులు వాపోతున్నారు. గతంలో క్వింటాలు రూ.6వేల వరకు పలికిన ధర.. ఇప్పుడు రూ.5వేల స్థాయికి చేరింది.  ఎకరానికి రూ.1.50 లక్షల వరకు పెట్టుబడి పెట్టిన రైతులు.. పంట అమ్మితే సగమూ వచ్చే పరిస్థితి లేదని కన్నీటి పర్యంతమవుతున్నారు.

మద్దతుపై మౌనమే

పసుపు పంటకు నాలుగేళ్ల కిందట క్వింటాలుకు రూ.6,850 చొప్పున మద్దతు ధర ప్రకటించారు. తర్వాత దాన్ని పెంచలేదు. 2020-21లో క్వింటాలు పసుపు ఉత్పత్తికి రూ.7,260 అవుతుందని ఆచార్య ఎన్జీరంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం అంచనా వేసింది. 2021-22కి అది రూ.8,373 అయింది. దీనిపై రైతు కుటుంబ శ్రమను కలిపి 50% అదనంగా లెక్కిస్తే క్వింటాలుకు రూ.12,500 పైగా ధర ప్రకటించాలి. అయితే ప్రభుత్వం నాలుగేళ్ల క్రితం ప్రకటించిన రూ.6,850 ధరనే ఇప్పటికీ వల్లె వేస్తోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని