అంకెల రంకెలు!

పోలవరం ప్రాజెక్టులో తొలిదశ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2022 జనవరిలో రూ.10,911 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంచనాలు సమర్పించినా అవి కొలిక్కి రాలేదు.

Published : 01 Jun 2023 05:18 IST

పోలవరం తొలిదశ అంచనాలు భారీగా పెంపు
ఏడాదిన్నర కిందట రూ.10,911 కోట్లు
ఇప్పుడు రూ.16,952 కోట్లు
ప్రాజెక్టు పురోగతిపై నేడు దిల్లీలో సమీక్ష
ఈనాడు - అమరావతి

పోలవరం ప్రాజెక్టులో తొలిదశ అంచనాలు భారీగా పెరిగిపోయాయి. 2022 జనవరిలో రూ.10,911 కోట్లతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి అంచనాలు సమర్పించినా అవి కొలిక్కి రాలేదు. మళ్లీ తొలిదశ అంచనాలు లెక్కకట్టి సమర్పించాలని కేంద్ర జల్‌శక్తి శాఖ కోరిన మేరకు మే ప్రారంభంలో కేంద్రానికి నివేదిక పంపారు. తాజాగా తొలిదశ అంచనాలే రూ.16,952 కోట్లకు చేరిపోయాయి. ఏడాదిన్నరలో కొన్ని అదనపు పనులు, అదనపు భూసేకరణ, పునరావాసంతో అంచనాలు భారీగా పెరిగిపోయాయి. ఒకవైపు పోలవరానికి నిధులపరంగా జగన్‌ సర్కార్‌ సాధించింది ఏమీ లేకపోగా, మరోవైపు ఎప్పటికప్పుడు కొత్త అంచనాలు అంటూ సాగుతున్న ప్రహసనంలో అంకెలు మారిపోతూ వస్తున్నాయి. కేంద్రజల్‌ శక్తిశాఖ మంత్రి షెకావత్‌ ఆధ్వర్యంలో గురువారం దిల్లీలో పోలవరం పురోగతిపై సమీక్ష నిర్వహించనున్నారు. తొలిదశ అంచనాలపైనా కేంద్రమంత్రి చర్చించనున్నారని సమాచారం. నిధుల విషయంలో నాలుగేళ్లుగా జగన్‌ సర్కార్‌లో సాగుతున్న ప్రహసనం కొలిక్కి వచ్చేనా? లేక మళ్లీ పెండింగులో పడేనా అన్నది తేలనుంది.

తొలిదశపైనే పెద్ద సందిగ్ధం

పోలవరం ప్రాజెక్టులో తొలిదశ నిధులు ఇవ్వడంపైనే పెద్దఎత్తున సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పోలవరం అధికారులు, జలవనరుల శాఖ అధికారుల్లోనే ఈ తొలిదశ ప్రహసనంపై సందేహాలు ఉన్నాయి. తెదేపా ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టుకు 2017-18 ధరలతో సుమారు రూ.55 వేల కోట్లతో సవరించిన అంచనాలను రెండో డీపీఆర్‌గా సమర్పించారు. అప్పట్లోనే కేంద్రం అనేక సందేహాలు లేవనెత్తితే నెలల తరబడి అధికారులు దిల్లీలో మోహరించి వాటిని నివృత్తి చేశారు. ఆ అంచనాల్ని పరిశీలించి కేంద్ర జల్‌శక్తి ఆధ్వర్యంలోని సాంకేతిక సలహా కమిటీ(టీఏసీ) 2019 ఫిబ్రవరిలో వాటికి ఆమోదం తెలిపింది. టీఏసీ ఆమోదం పొందితే దాదాపు డీపీఆర్‌ 2 కొలిక్కి వచ్చినట్లుగా భావించాలి. అలాంటిది జగన్‌ సర్కార్‌ ఏర్పడ్డాక టీఏసీ ఆమోదం పొందిన అంచనాలపై రివైజ్డు కాస్ట్‌ కమిటీని ఏర్పాటు చేశారు. వారు అధ్యయనం చేసి రూ.47,725 కోట్లకు ఆమోదం తెలిపారు. ఆ ప్రతిపాదనను కేంద్రజల్‌ శక్తి శాఖ ఆమోదించి ఆర్థికశాఖకు పంపాక, కేంద్ర మంత్రిమండలి ఆమోదం పొందితే డీపీఆర్‌ 2 కింద నిధులు ఇచ్చే ఆస్కారం ఉంది. జగన్‌ సర్కార్‌ ఆ డీపీఆర్‌పై పోరాడి నిధులు సాధించుకోలేక పోయింది. డీపీఆర్‌ను ఆమోదించి తొలిదశగా కొన్ని నిధులు ఇవ్వవచ్చు. ఆ తర్వాత రెండోదశ కింద అదే డీపీఆర్‌ 2 నుంచి నిధులిచ్చే వీలుంది. అలాంటిది మళ్లీ 41.15 మీటర్ల ఎత్తు వరకు నీరు నిల్వ చేస్తే ఎంత ఖర్చవుతుందో ఆ మొత్తం తొలిదశగా అంచనాల్ని తయారు చేసి పంపాలని కేంద్రజల్‌ శక్తి శాఖ కోరడం, జగన్‌ సర్కార్‌ ఆ కోణంలో ముందుకు సాగడం అనేక అనుమానాలకు తావిస్తోంది. అనేక ఏళ్ల పాటు పోలవరం డీపీఆర్‌ 2పై కసరత్తు చేసి రెండు కీలక కమిటీలు ఆమోదం తెలిపాక అది పక్కన పెట్టి మళ్లీ రెండేళ్లుగా తొలిదశ నిధులంటూ ప్రహసనం సాగడం సందేహాలకు తావిస్తోంది. పోలవరంలో 45.72 మీటర్ల స్థాయి వరకు పునరావాసం, భూసేకరణకు కేంద్రం నిధులు ఇచ్చేందుకు వెనకడుగు వేస్తున్న ప్రస్తుత తరుణంలో అందుకోసం పోరాడకుండా తొలిదశ నిధుల అంచనాలు సమర్పించడం వల్ల రాబోయే రోజుల్లో ఇబ్బందులు సృష్టించే ఆస్కారం ఉందనే భయం సర్వత్రా వ్యక్తమవుతోంది. నిజానికి పోలవరంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేశాకే కేంద్రం నిధులు ఇస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో అనేక ఏళ్ల పాటు డీపీఆర్‌ 2 కసరత్తు పూర్తిచేసి కేంద్రం తొలిదశ అంచనాలు కోరడం, రాష్ట్రం సమర్పించడం అనేక అనుమానాలు కలిగిస్తోంది. దిల్లీలో ఇటీవల పోలవరంపై ఉన్నతస్థాయిలో జరిగిన సమావేశంలో ఒక పోలవరం అధికారి ఈ అంశంపైనా ప్రశ్నించినట్లు సమాచారం. అధికారులే ఈ సందేహాలు వ్యక్తం చేస్తున్నా జగన్‌ సర్కార్‌ పోలవరం నిధుల విషయంలో రాజకీయంగా గట్టిగా వ్యవహరించలేకపోతోందనే అనుమానాలు సర్వత్రా ఉన్నాయి.

పాక్షిక డయాఫ్రం వాల్‌కు రూ.300 కోట్ల పైనే

ప్రాజెక్టులో గతంలో ఎంతో కీలకమైన డయాఫ్రం వాల్‌ నిర్మాణాన్ని రూ.467.72 కోట్లతో పూర్తిచేశారు. కొన్నిచోట్ల 300 అడుగుల లోతు నుంచి నిర్మించారు. అలాంటిది ప్రస్తుతం పాక్షికంగానే నిర్మాణం చేపడుతున్నారు. లోతూ అంతగా అవసరం లేదు. ప్రస్తుత డయాఫ్రం వాల్‌ను అక్కడక్కడా కొంతమేర సరిదిద్దాల్సి ఉంది. ఈ పాక్షిక పనికి రూ.331 కోట్లు అంచనాగా లెక్కించారు. నాడు కొత్త డయాఫ్రం వాల్‌ నిర్మించిన మొత్తంలో 70 శాతం నిధుల్ని మళ్లీ ఖర్చు చేసి పాక్షికంగా నిర్మించేలా అంచనాలు రూపొందించారు.


తొలిదశలో పెంపు ఇలా...

* ప్రధాన డ్యాం సివిల్‌ పనులు, కాలువల పనుల్లో మిగిలి ఉన్న వాటికి రూ.6,593.02 కోట్లు.

* ప్రధాన డ్యాంలో కోత, పాక్షిక డయాఫ్రం వాల్‌ పనులకు రూ.2,020 కోట్లు.

* ఇతర పనులు, నిర్వహణ ఖర్చులకు రూ.945 కోట్లు కావాలని, భూసేకరణ, పునరావాసం కోసం తొలిదశలో రూ.7,394 కోట్లు.


ఎత్తిపోసే అవసరమే లేకున్నా...

నీటిని ఎత్తిపోసే ప్రాజెక్టుల్లో ఎంతో అనుభవం ఉన్న మేఘ ఇంజినీరింగు సంస్థ పోలవరం డ్యాం ప్రాజెక్టు పనులు చేపట్టింది. నిజానికి తొలి అంచనాల్లో పోలవరంలో నీటిని ఎత్తిపోసే అవసరమే లేదు. అలాంటిది ప్రస్తుతం ఇక్కడ రూ.వందల కోట్లు వెచ్చించి నీటిని ఎత్తిపోసే పరిస్థితులు ఏర్పడటం చర్చనీయాంశమవుతోంది. ఎగువ కాఫర్‌ డ్యాం సకాలంలో పూర్తి చేసుకోలేకపోవడం ఒక సమస్యగా మారి పోలవరంలో ఇబ్బందులు సృష్టించింది. మరోవైపు ఎగువ కాఫర్‌ డ్యాంను నిర్మించి, దిగువ కాఫర్‌ డ్యాంను సకాలంలో పూర్తి చేయకపోవడంతో మరో సమస్య తలెత్తింది. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఈ అంశాన్ని తప్పుపట్టింది. దిగువ కాఫర్‌ డ్యాంను వరదల లోపు పూర్తి చేయకపోవడం వల్ల నీరు మళ్లీ వెనక నుంచి ప్రధాన డ్యాం ప్రాంతాన్ని ముంచెత్తింది. దీంతో ఇక్కడ నీటి ఎత్తిపోతకు అవసరమైన పంపులు, ఇతర పరికరాలకు రూ.149 కోట్లు,  వాటిని ఉపయోగిస్తూ నీటిని ఎత్తిపోసినందుకు రూ.127.91 కోట్లు ఖర్చయింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు