అవినాష్‌రెడ్డికి ముందస్తు బెయిలు

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు బుధవారం షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసింది.

Updated : 01 Jun 2023 06:45 IST

ప్రతి శనివారం సీబీఐ ముందు హాజరవ్వాలి
దర్యాప్తునకు అవసరమైనప్పుడు కూడా..
సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లకూడదు.. సాక్ష్యాలు ధ్వంసం చేయకూడదు
షరతులు విధించిన తెలంగాణ హైకోర్టు
ఉల్లంఘిస్తే ముందస్తు బెయిలు రద్దును సీబీఐ కోరవచ్చన్న న్యాయమూర్తి
ఈనాడు - హైదరాబాద్‌

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ వై.ఎస్‌.అవినాష్‌రెడ్డికి తెలంగాణ హైకోర్టు బుధవారం షరతులతో ముందస్తు బెయిలు మంజూరు చేసింది. ఈ మేరకు అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను అనుమతించింది. సీబీఐకి రూ.5 లక్షలకు వ్యక్తిగత పూచీకత్తు సమర్పించాలని, దర్యాప్తు పూర్తయ్యేవరకూ సీబీఐ అనుమతి లేకుండా దేశం విడిచి వెళ్లరాదని, సాక్షులను ప్రభావితం చేయకూడదని, సాక్ష్యాలను తారుమారు చేయరాదని ఆదేశించింది. సీబీఐ దర్యాప్తునకు సహకరించాలని, జూన్‌ నెలాఖరు వరకు ప్రతి శనివారం ఉదయం 10 నుంచి 5 గంటల వరకు, దర్యాప్తు నిమిత్తం అవసరమైనపుడల్లా సీబీఐ ముందు హాజరుకావాలని ఆదేశించింది.

నిష్పాక్షిక, సత్వర దర్యాప్తునకు అడ్డంకులు కలిగించేలా ఎలాంటి చర్యలూ చేపట్టరాదంది. వీటికి భిన్నంగా అవినాష్‌రెడ్డి వ్యవహరిస్తే ముందస్తు బెయిలును రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చంది. అవినాష్‌రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిలు పిటిషన్‌పై సుప్రీంకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఇటీవల ప్రత్యేకంగా విచారణ చేపట్టిన జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ బుధవారం 30 పేజీల తీర్పును వెలువరించారు. అందులోని వివరాలు ఇలా.. ‘‘దర్యాప్తు ప్రకారం హత్యలో పాల్గొన్న నిందితులకు వివేకాపై ఒక్కో కారణంతో విభేదాలున్నాయి. సంఘటనా స్థలంలో సాక్ష్యాలను తారుమారు చేయడంతో పాటు ధ్వంసం చేశారు.

దురదృష్టవశాత్తు ఇందులో నర్రెడ్డి రాజశేఖరరెడ్డి పాత్ర కూడా ఉంది. వివేకా రాసిన లేఖను మీ దగ్గర ఉంచాలని కృష్ణారెడ్డికి నర్రెడ్డి రాజశేఖరరెడ్డే చెప్పారు. భిన్న వాదనలున్నా.. సాక్ష్యాలను ధ్వంసం చేయాలని అవినాష్‌రెడ్డి సూచించినట్లు చెప్పే ప్రత్యక్షసాక్షి ఎవరూ లేరు. అయితే ఆయన అక్కడ ఉన్నట్లు కొందరు చెప్పారు. ఆధారాలు ధ్వంసం చేయడం అన్నది హత్యలో పాల్గొన్న నలుగురు నిందితులకు లబ్ధి చేకూరుస్తుంది. హత్య తర్వాత కూడా.. వివేకా వద్ద ఉన్నాయని చెబుతున్న బెంగళూరు లావాదేవీకి సంబంధించిన పత్రాలను తీసుకునేందుకు గంగిరెడ్డి, సునీల్‌యాదవ్‌ ప్రయత్నించినట్లు దస్తగిరి వాంగ్మూలం ద్వారా తెలుస్తోంది. అయితే నేరానికి ప్రధాన కారణంగా భావిస్తున్న ఆ పత్రాలను సీబీఐ స్వాధీనం చేసుకోలేకపోయింది. హత్య కుట్ర విషయంలో.. 2019 ఫిబ్రవరి 10న గంగిరెడ్డి ఇంటికి నిందితులు వెళ్లారంటున్న బొలెరో వాహనం గురించి, ఇంటి నుంచి వెళ్లిన ముగ్గురు వ్యక్తుల వివరాల గురించి తెలుసుకోవడంలో సీబీఐ విఫలమైంది.

రాజకీయ శత్రుత్వానికి సాక్ష్యాల్లేవు

వివేకా ఓటమిలో అవినాష్‌రెడ్డి పాత్ర ఉన్నట్లు ఊహాగానాలు తప్ప ప్రత్యక్ష సాక్ష్యాలు ఏవీ లేవు. టికెట్ మాత్రం అవినాష్‌రెడ్డికే ఇవ్వాలని జగన్‌ నిర్ణయించుకున్నారని వివేకా తన సన్నిహిత కుటుంబసభ్యులతో పంచుకున్నట్లు సీల్డ్‌కవర్‌లో సీబీఐ అందజేసిన వాంగ్మూలం ద్వారా వెల్లడైంది. ఎంపీ టికెట్‌ తనకు దక్కకుండా వివేకా ప్రయత్నించారని, అందుకే ఆయనపై రాజకీయ కక్ష పెంచుకున్నారన్నది అవినాష్‌రెడ్డిపై ఉన్న ప్రధాన ఆరోపణ. అవినాష్‌రెడ్డి విజయానికి తన తండ్రి తీవ్ర ప్రయత్నాలు చేశారని వివేకా కుమార్తె ప్రకటించినట్లు రికార్డుల్లో ఆధారాలున్నాయి. సునీతారెడ్డి తెదేపాకు చెందిన మాజీ ముఖ్యమంత్రిపై ఫిర్యాదు చేయడానికి దిల్లీ వెళ్లినపుడు ఆమె.. దిల్లీలో అవినాష్‌ అధికారిక నివాసంలోనే ఉన్నారు. వివేకాకు, అవినాష్‌కు మధ్య శత్రుత్వం ఉన్నట్లు సునీతారెడ్డి గానీ, ఆమె కుటుంబసభ్యులు గానీ ఎప్పుడూ వెల్లడించలేదు. ఈ విషయాలన్నీ నేరాన్ని ఆపాదించే ముందు పరిశీలించాలి.

దస్తగిరిని అరెస్టు చేయకపోవడానికి కారణాలు చెప్పలేదు

2020 సెప్టెంబరులో సీబీఐ రూ.46 లక్షలను సీజ్‌ చేసింది. ఈ డబ్బు మున్నా అనే వ్యక్తి దగ్గర ఉన్నట్లు తమకు సమాచారం ఎవరిచ్చారో సీబీఐ చెప్పలేదు. ఏడాది తర్వాత 2021 ఆగస్టులో దస్తగిరి వాంగ్మూలం ఇస్తూ నేరం ఎలా చేశారో, డబ్బు ఎక్కడ దాచారో అన్ని వివరాలనూ వెల్లడించారు. ఇన్ని స్పష్టమైన ఆధారాలున్నా.. దస్తగిరిని ఎందుకు అరెస్టు చేయలేదో సీబీఐ వివరించలేదు. హత్య జరిగిన రోజు తెల్లవారుజామున 1.58 గంటలకు అవినాష్‌రెడ్డి ఇంట్లో సునీల్‌యాదవ్‌ ఉన్నారని సీబీఐ చెబుతోంది. కానీ సీబీఐ చూపిన సాక్షి మాత్రం.. దీనికి విరుద్ధంగా 2.42కు ఉన్నట్లు చెబుతున్నారు.

ఇంతకాలం ఎందుకు అరెస్టు చేయలేదు?

అవినాష్‌రెడ్డిని అరెస్టు చేయాలనుకుంటే ఎప్పుడో చేసి ఉండొచ్చు. అయితే ఇప్పుడే అరెస్టు ఎందుకనడానికి సీబీఐ కారణాలు చెప్పలేదు. సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి ఏడుసార్లు హాజరయ్యారు. మొదటి అభియోగపత్రం దాఖలు చేసేసరికే కుట్రకు సంబంధించి ఆయన పాత్రపై అనుమానం కలిగించడానికి కారణాలున్నాయి. కర్నూలు ఆస్పత్రిలో తల్లితో ఉన్నపుడు అనుచరులు అడ్డుకోవడాన్ని... ఆయన సాక్షులను ప్రభావితం చేస్తారనడానికి నిదర్శనంగా సీబీఐ చెప్పింది. నాథుసింగ్‌ వర్సెస్‌ యూపీ కేసు తీర్పును ప్రస్తావించింది. అయితే అది ఈ కేసుకు వర్తించదు. రెండున్నరేళ్లయినా కుట్రలో అవినాష్‌రెడ్డి పాత్ర గురించి సరైన ఆధారాలు సేకరించలేదు. గొడ్డలి గురించి తెలుసుకోవాలని సీబీఐ అంటున్నా, దాన్ని కాలువలో పడేసినట్లు సునీల్‌ యాదవ్‌ చెప్పారు. దాని ఆధారంగా వెతికినా, స్వాధీనం చేసుకోవడంలో విఫలమయ్యారు. నిందితుల మధ్య పంపిణీ జరిగిన రూ.4 కోట్ల వివరాలు తెలుసుకోవాలని అవినాష్‌ కస్టడీని సీబీఐ కోరుతోంది. ఆ మొత్తాన్ని వారినుంచి రికవరీ చేయకపోవడం దురదృష్టకరం. మృతదేహంపై గాయాలు ఉన్నప్పుడు ఐపీసీ 302 కింద కేసు నమోదు చేయాల్సిన బాధ్యత దర్యాప్తు అధికారిపై ఉంది. దీన్ని ప్రభావితం చేశారని చెప్పడానికి వీల్లేదు. అవినాష్‌రెడ్డిని గతంలో విచారించినప్పుడు, అలాగే.. భాస్కరరెడ్డి, ఉదయ్‌కుమార్‌రెడ్డిల విచారణలోను తమకు కావాల్సిన సమాచారాన్ని సీబీఐ రాబట్టింది. కేవలం సంఘటనా స్థలంలో ఆధారాలను చెరిపేయడం అన్న ఆరోపణ తప్ప ఇప్పటివరకు సాక్ష్యాలను తారుమారు చేసినట్లు, సాక్షులను బెదిరించినట్లు అవినాష్‌రెడ్డిపై ఎప్పుడూ ఆరోపణలు చేయలేదు. అవినాష్‌రెడ్డిపై నేర తీవ్రతను ఇప్పటివరకు చెప్పలేదు. ఎవరో చెప్పిన, ఊహాజనిత ఆధారాలు తప్ప కుట్రలో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్ష్యం ఏదీ లేదు. కేవలం దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంపైనే సీబీఐ ఆధారపడింది. ఈ నేపథ్యంలో అవినాష్‌రెడ్డి కస్టడీ విచారణకు ఎలాంటి సహేతుకత లేదు. అందువల్ల ముందస్తు బెయిలు ఇవ్వడానికి మొగ్గుచూపుతున్నాం’’ అని న్యాయమూర్తి పేర్కొన్నారు.


రెండు ఛానళ్లపై చర్యకు ప్రతిపాదన

అవినాష్‌రెడ్డి బెయిలు పిటిషన్‌ విచారణ సందర్భంగా తనపై ఆరోపణలు చేస్తూ జరిగిన చర్చా కార్యక్రమాలను నిర్వహించిన ఏబీఎన్‌, మహాన్యూస్‌ ఛానళ్లపై తగిన చర్య తీసుకోవడానికి వీడియో క్లిప్పింగ్‌లు, తీర్పు ప్రతిని ప్రధాన న్యాయమూర్తి ముందుంచాలని రిజిస్ట్రీని జస్టిస్‌ ఎం.లక్ష్మణ్‌ ఆదేశించారు. తీర్పును ప్రారంభిస్తూ ‘‘కేసు పూర్వాపరాల్లోకి వెళ్లేముందు కొన్ని మీడియా సంస్థలు నా ప్రతిష్ఠను దెబ్బతీయడం, బెదిరించే ప్రయత్నాల ద్వారా న్యాయప్రక్రియను అడ్డుకోవడం, కేసులో ఒక నిర్ణయం తీసుకోవడంలో స్వతంత్ర ఆలోచనా విధానాన్ని పక్కదారి పట్టించడానికి చేసిన ప్రయత్నాలను రికార్డు చేయాలనుకుంటున్నాను. వారు ఎంపిక చేసుకున్న కొందరు వ్యక్తుల అభిప్రాయాలను ప్రసారం చేస్తూ నాపై వ్యక్తిగత దాడితో ప్రతిష్ఠ దెబ్బతీసేందుకు, బెదిరించేందుకు ప్రయత్నాలు జరిగాయి. నిర్బంధానికి గురై సస్పెన్షన్‌లో ఉన్న ఓ జడ్జి ‘న్యాయమూర్తి ఇంటికి డబ్బు సంచులు వెళ్లాయి’ అని ప్రత్యక్ష దాడికి దిగగా, మరోవ్యక్తి అదే రకమైన భాషను వినియోగించారు. కోర్టు విచారణను తప్పుగా అర్థం చేసుకుని నా సమర్థతను దెబ్బతీసే ప్రయత్నాలు చేశారు. ఒకరు దెబ్బతీస్తే పోయే ప్రతిష్ఠ కాదు నాది. దాన్ని నేను పట్టించుకోవడంలేదు. కానీ న్యాయవ్యవస్థను దెబ్బతీసే ఇలాంటి ప్రయత్నాలను అడ్డుకుని, వ్యవస్థ ప్రతిష్ఠను కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చర్యలు కోర్టు ధిక్కరణ పరిధిలోకి వస్తాయి. అయితే చర్య తీసుకోవడమా.. లేదా అన్నది ప్రధాన న్యాయమూర్తికే వదిలిపెడుతున్నాను. ఒకానొక దశలో కేసు విచారణ నుంచి తప్పుకోవాలని భావించాను. అయితే నిర్భయంగా విధులు నిర్వహిస్తానన్న ప్రమాణంతో పాటు సుప్రీంకోర్టు ఉత్తర్వులను దృష్టిలో ఉంచుకుని ఆలోచనను మార్చుకున్నాను’ అని పేర్కొన్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని