సీఎం సారూ.. ఈ హామీల మాటేంటి?

‘చెప్పాడంటే చేస్తాడంతే’ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గొప్పగా చెబుతున్న మాట.. కానీ, సీఎంగా ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలకే దిక్కులేదన్నది వాస్తవం.

Updated : 01 Jun 2023 07:31 IST

అమలు ఎప్పుడని నిలదీస్తున్న జనం
ఈనాడు - అమరావతి

‘చెప్పాడంటే చేస్తాడంతే’ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి గురించి ఆయన పార్టీ నేతలు గొప్పగా చెబుతున్న మాట.. కానీ, సీఎంగా ఆయన చెప్పిన మాటలు, ఇచ్చిన హామీలకే దిక్కులేదన్నది వాస్తవం. స్వయంగా ముఖ్యమంత్రే హామీ ఇచ్చారు కాబట్టి ఆ పని పూర్తయిపోతుందనుకున్న జనం ఆశలు అడియాసలే అవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో చేపట్టే పనులే అయినా.. సాక్షాత్తు ముఖ్యమంత్రే ఎప్పుడో మాటిచ్చినా.. ఆ మాటలు ఇప్పటికీ చెల్లుబాటు కాలేదు. నాలుగేళ్లలో సీఎం వివిధ నియోజకవర్గాల్లో పర్యటించినప్పుడు ఇచ్చిన హామీల్లో చాలా వరకు అమలుకు నోచుకోలేదు. తన పాలనలో 98% పైగా హామీలు అమలు చేశానని స్వయంగా జగన్‌ అనేక వేదికల మీద ప్రకటించుకుంటున్నారు. అందులో మద్యనిషేధం వంటి హామీలు పక్కన పెట్టినా.. స్వయంగా ఆయనే చేసిన ఈ హామీల సంగతేంటి? విజయవాడ నుంచి విజయనగరం వరకు.. వెంకటగిరి నుంచి వెలిగొండ వరకు అమలుకాని సీఎం హమీల చిట్టాలో మచ్చుకు కొన్ని..

తాడి తలరాత మారేదెప్పటికో?

విశాఖ జిల్లా పెందుర్తి నియోజకవర్గ పరిధిలోని తాడి గ్రామంలో దాదాపు 2 వేల మంది నివాసం ఉంటున్నారు. ఈ గ్రామాన్ని ఆనుకుని 15 ఏళ్ల కింద ఏర్పాటైన ఫార్మాసిటీ నుంచి విడుదలయ్యే రసాయనాలతో భూగర్భ జలాలు, గాలి కలుషితమవుతున్నాయి. దీనికితోడు బాయిలర్లు, రియాక్టర్ల లాంటివి పేలినప్పుడు, అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు, గ్యాస్‌ లీకేజీలు చోటు చేసుకున్నప్పుడు తాడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. శ్వాసకోశ, క్యాన్సర్‌, చర్మవ్యాధుల్లాంటి వాటి బారిన పడుతున్నామని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆదుకునేవారు లేక ఇప్పటికే దాదాపు 40 కుటుంబాలు ఇక్కడ నుంచి వలస వెళ్లిపోయాయి. గత తెదేపా ప్రభుత్వం తాడి గ్రామాన్ని పెదముషిడివాడ ప్రాంతానికి తరలించేందుకు 15 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. పరిహారం, పునరావాసం, వసతుల కల్పనకు రూ.58 కోట్లను కేటాయిస్తూ జీఓ జారీ చేసింది. ఇంతలో ఎన్నికలొచ్చాయి. తర్వాత మూడేళ్లకు 2022 ఏప్రిల్‌ 28న పైడివాడ అగ్రహారంలో ఇళ్ల పట్టాల పంపిణీకి వచ్చిన సీఎం జగన్‌  ‘తాడి ప్రజల తలరాతలు మారుస్తాం.. వారం పది రోజుల్లోనే తాడి తరలింపునకు అవసరమైన రూ.58 కోట్లు విడుదల చేస్తాం’ అని ప్రకటించారు. ఏడాది గడిచినా నిధులు రాలేదు, తరలింపు జరగనూ లేదు.


కుప్పంలో శిలాఫలకాలే!

‘వై నాట్‌ 175, కుప్పంలో కూడా గెలవబోతున్నాం’ అంటూ ముఖ్యమంత్రి పదేపదే ఆయన పార్టీ నేతలతో చెబుతున్నారు. 2022 సెప్టెంబరు 23న అక్కడ పర్యటించినప్పుడు ‘కుప్పంను నా నియోజకవర్గం పులివెందుల లానే భావిస్తా. కుప్పం మున్సిపాలిటీలో పనుల కోసం రూ.66 కోట్లు మంజూరు చేశాం. ఈ నియోజకవర్గ పరిధిలోని గ్రామీణ ప్రాంతాలకు రూ.100 కోట్లు ఇస్తా’ అని ప్రకటించారు. కుప్పంలో రూ.66 కోట్లతో అభివృద్ధి పనులను ప్రారంభిస్తూ శిలాఫలకాలనూ ఆవిష్కరించారు.

కానీ ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా విడుదల కాలేదు. ముఖ్యమంత్రే పనులు ప్రారంభించడంతో నిధులు వచ్చేస్తాయిలే అని వైకాపా నేతలు, కొందరు గుత్తేదారులు సుమారు రూ.18 కోట్ల పనులను అప్పులు తెచ్చి మరీ చేసేశారు. 16 వార్డుల్లో మురుగునీటి కాలువల నిర్మాణాలను ప్రారంభించారు. ఈ పనులకు బిల్లులు రాకపోవడంతో మధ్యలోనే నిలిపేశారు.

రెండున్నరేళ్లలో ఏం చేశారు?

2020 డిసెంబరు 30న విజయనగరం గ్రామీణ మండలం గుంకలాంలో ‘పేదలందరికీ ఇళ్లు’లో భాగంగా లేఅవుట్‌కు సీఎం జగన్‌ శంకుస్థాపన చేశారు. ‘ఈ లేఅవుట్‌ను రెండేళ్లలో పూర్తి చేస్తాం. మెగా టౌన్‌షిప్‌గా మారుస్తాం. తాగునీరు, విద్యుత్‌, ఉద్యానాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, సామాజిక భవనాలు, హెల్త్‌ క్లినిక్‌ల వంటి సౌకర్యాలన్నీ కల్పిస్తాం’ అని ప్రకటించారు. దాదాపు రూ.200 కోట్ల అంచనాతో చేపట్టిన ఈ కాలనీలో 10,475 ఇళ్లకుగాను ఇప్పటికి 245 పూర్తి చేశారు. దీని గుత్తేదారయిన రాప్తాడు వైకాపా ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్‌రెడ్డి సోదరుడు మరో 1,800 ఇళ్లకు పునాదులు వేసి వదిలేశారు. ఈ మధ్యనే మళ్లీ పనులు ప్రారంభించారు. మట్టి రోడ్లు, బోర్లు మాత్రం పడ్డాయి. మిగిలిన పనులు ఎక్కడివి అక్కడే.

వెంకటగిరి వెతలు

వెంకటగిరి నియోజకవర్గంలో పలు పనుల కోసం స్థానిక ఎమ్మెల్యే ఆనం రాంనారాయణరెడ్డి ముఖ్యమంత్రి జగన్‌కు వైకాపా ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో, తిరుపతి లోక్‌సభ స్థానం ఉప ఎన్నిక వేళ ప్రతిపాదనలు సమర్పించారు. వాటి పరిష్కారానికి సీఎం అంగీకరించారు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ, నెల్లూరు జిల్లాకు చెందిన కాకాణి గోవర్ధన్‌రెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్న సమయంలో మీకు ఏం పనులు కావాలని సీఎం కోరగా.. ముందు ఇచ్చిన ప్రతిపాదనలనే ఎమ్మెల్యే ఆనం మళ్లీ అందజేశారు. ఎమ్మెల్యే వినతిపత్రాలు ఇచ్చినప్పుడల్లా ముఖ్యమంత్రి తన కార్యదర్శిని పిలిచి ఈ పనులన్నీ అయిపోవాలని చెప్పడమే తప్ప.. అవి ముందుకు వెళ్లింది లేదు. సోమశిల- స్వర్ణముఖి లింక్‌ కెనాల్‌ (ఎస్‌ఎస్‌ఎల్‌సీ), వెంకటగిరి పట్టణానికి తాగునీటి పథకం, 100 పడకల ఆసుపత్రి, ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాల, రహదారుల నిర్మాణం, మరమ్మతులు చేస్తామన్న సీఎం హామీలు నెరవేరలేదు. వైకాపా ద్వితీయ శ్రేణి నాయకులు అప్పులు చేసి కట్టించిన గ్రామ సచివాలయాలు, ఆర్బీకే భవనాలకూ బిల్లులు మంజూరు కాలేదు. వీటిలో ఎస్‌ఎస్‌ఎల్‌సీని రూ.528 కోట్లకు రివైజ్‌ చేశారు తప్ప పురోగతి శూన్యం. ఉద్యాన పాలిటెక్నిక్‌ కళాశాలకు ఉద్యాన, ఆర్థిక శాఖల క్లియరెన్స్‌ వచ్చినా సీఎం సంతకం కోసం ఆగింది.

ముఖ్యమంత్రి మూడు సంతకాలు చేసినా!

* నెల్లూరు గ్రామీణ నియోజకవర్గంలో క్రైస్తవ సామాజికభవనం నిర్మించాలని స్థానిక ఎమ్మెల్యే కోరగా 2019 జూన్‌ 10న సీఎం అంగీకరిస్తూ ప్రతిపాదనను ఎండార్స్‌ చేశారు. 2021 ఫిబ్రవరి 3న, 2022 జులై 27న రెండుసార్లు సీఎం అదే ప్రతిపాదనపై మళ్లీ సంతకాలు పెట్టి, ఎండార్స్‌ చేశారు. ఈ భవనానికి కావాల్సింది రూ.6 కోట్లు. ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు, అనుమతీ ఇవ్వలేదు.

* నెల్లూరులో వరదలు వచ్చినప్పుడు పరిశీలనకు వెళ్లిన ముఖ్యమంత్రి జగన్‌కు స్థానిక ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి.. పొట్టేపాలెం కలుజు దుస్థితిని ప్రత్యక్షంగా చూపించారు. వెంటనే సీఎం కలుజుతోపాటు ముళ్లమూడి కందమూరు రోడ్ల కోసం రూ.28 కోట్లు ఇస్తామని హామీ ఇచ్చారు. కోవూరు, ఆత్మకూరు, ఉదయగిరి నియోజకవర్గాలకు వెళ్లే ప్రధాన మార్గంలో ఈ కలుజు ప్రమాదకరంగా మారినా సీఎం ఇచ్చిన హామీ నెరవేరనేలేదు. వీటితోపాటు సీఎం ఇచ్చిన ఇతర హామీల సాధన కోసం పోరాడుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిని నియంత్రించేందుకు ప్రయత్నాలే తప్ప హామీల పరిష్కారానికి మాత్రం చర్యలు తీసుకోవడం లేదు.

గుంటూరు వాహిని పారేనా?

2022 జనవరి 1న గుంటూరు జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో పర్యటించిన సీఎం జగన్‌ ప్రత్తిపాడులో రామవాగు నుంచి ఎంపీˆడీవో కార్యాలయం వరకు ప్రధాన రహదారి వెడల్పు, సెంట్రల్‌ లైటింగ్‌ ఏర్పాటుకు రూ.7 కోట్లు, ప్రత్తిపాడులో తాగునీటి పథకానికి రూ.13 కోట్లు, పెదనందిపాడులో క్రీడా వికాస కేంద్రం నిర్మాణానికి రూ.2 కోట్లు, సీˆసీˆ రోడ్లు, మురుగు కాలువల నిర్మాణానికి రూ.7 కోట్లు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవనం నిర్మాణానికి రూ.2.8 కోట్లు ఇస్తామని, గుంటూరు వాహిని పొడిగింపు పనులను రెండేళ్లలో పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. ప్రత్తిపాడులో ప్రధాన రహదారి విస్తరణకు నిధులు మంజూరు చేయలేదు. 18 వేల మంది జనాభా ఉన్న ప్రత్తిపాడులో మూడురోజులకోసారి మంచినీరు ఇస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి తాగునీటి పథకానికి రూ.13 కోట్లు ఇస్తామని సీఎం జనవరిలో చెప్పారు. డిసెంబరులో జలజీవన్‌ మిషన్‌ కింద రూ.11.60 కోట్లు మంజూరైనా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు.

పెదనందిపాడులో క్రీడా వికాస కేంద్రం కోసం 2022 జనవరిలో సీఎం ఇస్తామన్న రూ.2 కోట్లు 2023 మార్చిలో మంజూరు చేశారు. నిర్మాణ బాధ్యతను రహదారులు - భవనాల శాఖకు అప్పగించారు. బిల్లులను ఏ ఖాతా నుంచి చెల్లించాలనేదానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో నిర్మాణ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం భవన నిర్మాణ విషయంలోనూ ఇదే సందిగ్ధంతో పనులు ప్రారంభం కాలేదు. సీసీ రోడ్లు, మురుగుకాలువల నిర్మాణాలకు సీఎం ఇస్తామన్న రూ.7 కోట్లు మంజూరు కాలేదు. గుంటూరు వాహినిని బాపట్ల జిల్లా పర్చూరు వరకు పొడిగిస్తే ప్రత్తిపాడు, పెదనందిపాడు, పర్చూరు మండలాల పరిధిలోని 50 గ్రామాలకు తాగు, సాగు నీటి అవసరాలు తీరతాయి. వాహిని పొడిగింపు కోసం 420 ఎకరాల భూసేకరణకు ప్రకటన ఇచ్చినా రైతులకు పరిహారం చెల్లించేందుకు నిధులు మంజూరు చేయలేదు.

విజయవాడకు రూ.150 కోట్లు ఎప్పుడొచ్చేనో?

వైకాపా ప్రభుత్వం వచ్చిన తొలినాళ్లలో విజయవాడకు చెందిన ప్రజాప్రతినిధులు ముఖ్యమంత్రిని కలిసి నగరంలో అభివృద్ధి పనుల కోసం అభ్యర్థించగా.. రూ.50 కోట్లు కేటాయిస్తానని సీఎం హామీ ఇచ్చారు. దీంతో 88 పనులను చేపట్టేందుకు మున్సిపల్‌ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. తర్వాత మంత్రి వెలంపల్లి శ్రీనివాస్‌ సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్లడంతో విజయవాడ నగరాభివృద్ధికి మరో రూ.100 కోట్లు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ నిధులతో మరో 99 పనులు చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఇందులో సీసీ రోడ్లు, తాగునీటి పైపుల మార్పు, భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన పనులున్నాయి. మొత్తం రూ.150 కోట్లు ఇస్తామని చెప్పి మూడేళ్లయినా ఇప్పటి వరకూ రూ.30 కోట్లు కూడా రాలేదు. దీంతో చాలావరకు పనులు టెండర్ల దశలోనే ఆగిపోయాయి. ప్రారంభించినవీ మధ్యలోనే నిలిచిపోయాయి.

శ్రీకాళహస్తి, చంద్రగిరిలో వంతెనలన్నారు..

2021 డిసెంబరు 2న శ్రీకాళహస్తి నియోజకవర్గం పాపానాయుడుపేటలో పర్యటించిన ముఖ్యమంత్రి.. పాపానాయుడుపేట- గుడిమల్లం మార్గంలో కూలిపోయిన వంతెన నిర్మాణం చేపడతామని చెప్పారు. ప్రస్తుతం అక్కడ తాత్కాలికంగా సిమెంటు పైపులు, ఇసుక బస్తాలు పరిచి, బీటీ రోడ్డు మాత్రమే వేశారు. శాశ్వత ప్రాతిపదికన వంతెన నిర్మాణానికి ఆర్‌అండ్‌బీ అధికారులు ప్రతిపాదనలు పంపినా ఆమోదముద్ర పడలేదు.

* చంద్రగిరి నియోజకవర్గ పరిధిలోని పాడిపేట మార్గంలో ధ్వంసమైన వంతెనను డిసెంబరు 3న పరిశీలించిన సీఎం వంతెన నిర్మాణం పూర్తి చేస్తామన్నారు. ఇప్పటి వరకూ పురోగతి లేదు.

వెలిగొండకు నీళ్లిస్తామన్నారు..

2020 ఫిబ్రవరిలో ప్రకాశం జిల్లాలో పర్యటించిన సీఎం జగన్‌ వెలిగొండ ప్రాజెక్టును పరిశీలించారు. ఆరు నెలల్లో పనులు పూర్తి చేయాలని  అధికారులను ఆదేశించారు. 2021 అక్టోబరులో ఒంగోలులో ఆసరా కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు 2022 ఆగస్టు నాటికి వెలిగొండ మొదటి సొరంగం పూర్తి చేసి నీళ్లిస్తామని, 2023 ఫిబ్రవరికి రెండో సొరంగం పనులు పూర్తి చేస్తామని ప్రకటించారు. మొదటి సొరంగం పూర్తయినా ఇప్పటి వరకు నీళ్లివ్వలేదు. నిర్వాసితులకు పరిహారం, పునరావాసం పూర్తి కాలేదు. రెండో సొరంగం పనులు కొనసాగుతున్నాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాల పరిధిలోని 15 లక్షల మంది ప్రజలకు తాగునీరు, 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.


2 నెలల్లో అన్నారు.. 22 నెలలైనా?

2021 జులై 8న రాయదుర్గం నియోజకవర్గంలో రైతు దినోత్సవ సభలో జగన్‌ పాల్గొన్నారు. రాయదుర్గం, కళ్యాణదుర్గం నియోజకవర్గాలకు సాగునీరందించే జీడిపల్లి- భైరవానితిప్ప ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న 900 ఎకరాల భూమిని రెండు నెలల్లో సేకరించాలని అధికారులను ఆదేశించారు. వీలైనంత వేగంగా ప్రాజెక్టును పూర్తి చేసి, ఈ ప్రాంతానికి నీరందిస్తామని హామీ ఇచ్చారు. 22 నెలలవుతున్నా ఇప్పటికీ అడుగు ముందుకు పడలేదు.


ముమ్మిడివరంలో గో‘దారి’ ఎలా?

2019 నవంబరు 21న ముమ్మిడివరం నియోజకవర్గంలో సీఎం పర్యటించినప్పుడు ఐ.పోలవరం మండలంలోని ఎదుర్లంక వద్ద గోదావరి నది కోత నివారణకు రూ.79.76 కోట్లతో రివిట్‌మెంట్‌ తదితర పనులు చేపడతామంటూ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. మూడున్నరేళ్లకు అది చచ్చీచెడీ టెండరు దశకు చేరింది.

* ఇదే నియోజకవర్గంలో గతేడాది మే 13న సీఎం మళ్లీ పర్యటించారు. ఐ.పోలవరం మండలం జి.మూలపొలంలో అసంపూర్తిగా నిలిచిపోయిన వంతెనకు రూ.76.90 లక్షలు, గోగుల్లంక వద్ద రూ.44.50 లక్షలతో వంతెన నిర్మాణానికి శిలాఫలకాలను ఆవిష్కరించారు. ఇప్పటి వరకూ పనుల్లో కదలికే లేదు.

* ఐ.పోలవరం మండలంలో చుట్టూ వృద్ధ గౌతమి- గోదావరి మధ్యలో 12 గ్రామాలున్నాయి. వేల మంది ప్రజలు వరి, కొబ్బరి, కూరగాయలు, ఆక్వా సాగుతో జీవిస్తున్నారు. ఏటా వానాకాలంలో వీరంతా బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన పరిస్థితి. ఈ దీవికి రక్షణ కవచంగా ఉన్న ఏటిగట్టు (పీఐపీ బ్యాంకు)ను ఆధునికీకరించాలని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్‌కుమార్‌ అభ్యర్థించారు. నిధులు మంజూరు చేస్తామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు. ఇప్పటి వరకూ దాని ఊసే లేదు.


దుర్గ గుడికి మూడేళ్లలో ఇచ్చింది రూ.3 కోట్లే..

2020 అక్టోబరులో దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపైనున్న దుర్గామల్లేశ్వర స్వామి ఆలయానికి ముఖ్యమంత్రి జగన్‌ వచ్చారు. అదే రోజు అక్కడ కొండపై నుంచి రాళ్లు జారిపడ్డాయి. కొండరాళ్లు జారిపడకుండా శాశ్వత పరిష్కారంతోపాటు ఆలయ అభివృద్ధికి రూ.70 కోట్లు మంజూరు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి అక్కడే ప్రకటించారు. మూడు నెలలకే వచ్చి శంకుస్థాపనా చేశారు. ఈ నిధులతో శివాలయ ఆధునికీకరణ, అన్నదాన భవన నిర్మాణం, టోల్‌ప్లాజా, ప్రసాదాల తయారీ భవనం, కల్యాణ మండపం, కేశఖండనశాల, కొండరాళ్లు జారిపడకుండా శాశ్వతంగా రాక్‌ మిటిగేషన్‌, ఇనుప వల వేయడం తదితర పనులను ప్రతిపాదించారు. కానీ మూడేళ్లలో ఇచ్చింది రూ.3 కోట్లే. వీటితో కొండరాళ్లు జారిపడకుండా రాక్‌ మిటిగేషన్‌, ఇనుప వల వేసి చేతులు దులిపేసుకున్నారు. ఇదిలా ఉంటే పాత ప్రణాళికలోని పనులకే కొత్తగా బృహత్తర ప్రణాళిక అని పేరు పెట్టి రూ.225 కోట్లతో చేపట్టబోతున్నామని ప్రస్తుత దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ ఇటీవల ప్రకటించడం గమనార్హం.


 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని