పుస్తకాలు లేకుండా ఇంటర్‌ విద్య

విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే గొప్పలు చెబుతోంది. అయితే పేద విద్యార్థులకు మాత్రం ఉచిత పాఠ్య పుస్తకాలను అందచేయలేకపోతోంది.

Published : 01 Jun 2023 03:40 IST

చదువులు సాగేదేలా!

నేటి నుంచి ఇంటర్‌ తరగతులు  పునఃప్రారంభం

ఈనాడు, అమరావతి: విద్యా రంగంలో విప్లవాత్మక సంస్కరణలు తెస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం పదేపదే గొప్పలు చెబుతోంది. అయితే పేద విద్యార్థులకు మాత్రం ఉచిత పాఠ్య పుస్తకాలను అందచేయలేకపోతోంది. పుస్తకాలు లేకుండా విద్యార్థుల చదువులు ఎలా సాగుతాయి? అధ్యాపకులు చెప్పే పాఠాలు వారికి ఎలా అర్థమవుతాయన్న ఆలోచన ప్రభుత్వం ఎందుకు చేయడంలేదని విద్యావేత్తలు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదివే సుమారు 1.5 లక్షల మంది విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలు అందజేయాలంటే అవసరమయ్యే రూ.18 కోట్లను సర్దుబాటు చేయలేకపోతోంది. అసలే ప్రభుత్వ కళాశాలల్లో చేరే విద్యార్థులు తక్కువగా ఉంటున్నారు. కార్పొరేట్‌, ప్రైవేట్‌ కళాశాలల్లో చదివే వారే ఎక్కువగా ఉంటారు. పాఠ్య పుస్తకాలను ఇవ్వకుంటే...విద్యార్థులు ప్రభుత్వ కళాశాలల్లో చేరేందుకు ఆసక్తిగా ముందుకు ఎలా వస్తారన్న ప్రశ్న వినిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో ఇంటర్‌ విద్యా సంవత్సరం గురువారం నుంచి పునఃప్రారంభం కానుంది. పుస్తకాల సమస్య కిందటేడాది మాదిరిగానే కొత్త విద్యా సంవత్సరంలోనూ ఎదురుకానుంది.

కిందటేడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా..!

రాష్ట్రంలో 472 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలు ఉన్నాయి. ప్రతి ఏటా ప్రథమ, ద్వితీయ సంవత్సరంలో కలిపి 1.5 లక్షల మంది చదువుతున్నారు. కిందటి విద్యా సంవత్సరం 2022-23లో విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వలేదు. పుస్తకాల ముద్రణకు నిధుల సమస్య వచ్చినందున ఈ దుస్థితి తలెత్తింది. పుస్తకాల ముద్రణకు ఆర్థిక సాయం చేయాలని తితిదేను ఇంటర్‌ విద్యా శాఖ కోరగా తిరస్కరణ ఎదురైంది. దీంతో ప్రభుత్వానికి నిధుల కేటాయింపు గురించి లేఖ రాసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో ప్రభుత్వ కళాశాలల్లో చేరే వారికి పుస్తకాలు అందని పరిస్థితి నెలకొంది. వాస్తవానికి..ఇంటర్‌ విద్యా మండలి వద్ద నిధులు పుష్కలంగా ఉంటాయి. ఇంటర్‌ కళాశాలల గుర్తింపు, పరీక్షల నిర్వహణ, ఇతర సేవల వల్ల ఫీజుల రూపంలో మండలి ఖజానాకు చేరుతున్నాయి. ఈ నిధుల్లో రూ.8 కోట్లను ప్రతిభ కలిగిన విద్యార్థులకు అందచేసేందుకు, నాడు-నేడు పనులకు రూ.100 కోట్లు కేటాయించారు. ఇవికాకుండా రూ.90 కోట్లను ప్రభుత్వం వద్ద  ఇంటర్‌ విద్యా మండలి డిపాజిట్‌ చేసింది.

వీరికి ఇస్తారు కానీ..ఎప్పుడో..!

హైస్కూలు ఫ్లస్‌, ఆదర్శ పాఠశాలలు, కొన్ని కేజీబీవీల్లో చదివే విద్యార్థినీ విద్యార్థులకు రెండో సంవత్సరం పుస్తకాలు ఇప్పట్లో అందచేసే పరిస్థితులు కనిపించడంలేదు. పుస్తకాల కొనుగోలుకు ప్రత్యేకంగా నిధులు సమకూరుస్తున్నా..ఇందుకు సంబంధించిన చర్యలు ప్రస్తుతం కనిపించడంలేదు. ప్రతి మండలంలో ఎంపిక చేసిన ‘హైస్కూలు+ప్లస్‌’లో బాలికలకు ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులు 2022-23 నుంచి ప్రారంభమయ్యాయి. బాలికలకు విద్యా సంవత్సరం ముగింపు (మార్చి)లో పుస్తకాలు వచ్చాయి. దీంతో బాలికలకు వీటిని పంపిణీ చేయలేదు. ఈ సంవత్సరంలో జూనియర్‌ ఇంటర్‌లో చేరే వారికి వీటిని ఇవ్వనున్నారు. రెండో సంవత్సరానికి ప్రమోట్‌ అయిన వారికి పుస్తకాలు లేవు. ఈ తరహా పాఠశాలలు 294 ఉన్నాయి. కనీసం కొత్త విద్యా సంవత్సరంలో కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకోలేదు. రెండో సంవత్సరం విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చేందుకు ఎంత సమయం పడుతుందో చెప్పలేని పరిస్థితి.

* కేజీబీవీలు 252 ఉంటే కొన్ని చోట్ల ఇంటర్‌ ప్రథమ సంవత్సరం తరగతులను కిందటి విద్యా సంవత్సరం నుంచి ప్రారంభించారు. వీరికి కూడా మార్చి ముగింపులో పుస్తకాలు వచ్చాయి. ఈ విద్యా సంవత్సరంలో కొత్తగా చేరే వారికి ఈ పుస్తకాలు ఇస్తారు. రెండో సంవత్సరంలోకి వచ్చే వారికి పుస్తకాలు లేవు. వీరికి పంపిణీ చేసేందుకు మరింత సమయం పడుతుంది.

* ఆదర్శ పాఠశాలల్లో చదివే ఇంటర్‌ విద్యార్థులకు కూడా కిందటేడాది పుస్తకాల పంపిణీ జరగలేదు. విద్యా సంవత్సరం ముగింపులో వచ్చిన పుస్తకాలను ఈ   విద్యా సంవత్సరంలో చేరే వారికి అందజేయనున్నారు. రెండో సంవత్సరం విద్యార్థులకు ఆలస్యంగా పుస్తకాలు ఇచ్చే అవకాశం ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని