Suneetha Narreddy: ‘అవినాష్‌ తల్లికి శస్త్రచికిత్స జరగలేదు.. చర్యలు తీసుకోండి’

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి.. తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు చెప్పారని, దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి బుధవారం తెలంగాణ హైకోర్టుకు మెమో సమర్పించారు.

Updated : 01 Jun 2023 07:26 IST

తెలంగాణ హైకోర్టులో మెమో దాఖలు చేసిన సునీతారెడ్డి

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్‌రెడ్డి.. తన తల్లికి శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని కోర్టుకు చెప్పారని, దాని ప్రకారం శస్త్రచికిత్స జరగలేదని సునీతారెడ్డి బుధవారం తెలంగాణ హైకోర్టుకు మెమో సమర్పించారు. తన తల్లికి గుండె కవాటాలు మూసుకుపోవడంతో శస్త్రచికిత్స ప్రక్రియ జరుగుతోందని అవినాష్‌రెడ్డి తరఫు న్యాయవాది ఇచ్చిన హామీతో తుది ఉత్తర్వులు జారీ చేసేదాకా అరెస్టు చేయరాదంటూ కోర్టు మే 27న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈ ప్రకటన తప్పయితే చర్యలు తప్పవని పేర్కొందన్నారు.

మీడియా కథనాల ప్రకారం ఆమెకు శస్త్రచికిత్స జరగలేదని తెలిసిందన్నారు. శస్త్రచికిత్స జరుగుతోందన్న న్యాయవాది ప్రకటన తప్పు అని, నిర్ధారించడానికి రికార్డులు లేనందున గత ఆదేశాల ప్రకారం అవినాష్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని సునీతారెడ్డి తరఫు న్యాయవాది స్వేచ్ఛ కోరారు. న్యాయమూర్తి స్పందిస్తూ సంబంధిత రికార్డులు సమర్పించారు కదా అని ప్రశ్నించగా, శస్త్రచికిత్స జరిగినట్లు రికార్డులు లేవని న్యాయవాది తెలిపారు. తమ మెమోను పరిశీలించి చర్యలు తీసుకోవాలని న్యాయవాది విజ్ఞప్తి చేయగా మెమోను న్యాయమూర్తి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని