మంత్రి, ఎమ్మెల్యే అనుచరులమంటూ అర్ధరాత్రి బరితెగింపు

విశాఖలో ఓ వివాదాస్పద స్థలంలో రౌడీ మూకలు బరి తెగించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక యంత్రాలతో షెడ్డును నేలమట్టం చేశాయి.

Published : 01 Jun 2023 03:45 IST

విశాఖలో యంత్రాలతో వివాదాస్పద స్థలంలో షెడ్‌ తొలగింపు
మహిళా కాపలాదారు  ఫోన్‌ లాక్కొని 60 మంది హల్‌చల్‌

ఈనాడు-విశాఖపట్నం, వేపగుంట-న్యూస్‌టుడే: విశాఖలో ఓ వివాదాస్పద స్థలంలో రౌడీ మూకలు బరి తెగించాయి. మంగళవారం అర్ధరాత్రి దాటాక యంత్రాలతో షెడ్డును నేలమట్టం చేశాయి. 50మందికిపైగా యువకులు, పది మంది మహిళలు మంత్రి అమర్‌నాథ్‌, ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ పేర్లు చెప్పి హల్‌చల్‌ చేశారు. ఈ సంఘటన విశాఖలో సంచలనమైంది. బాధితుల వివరాల ప్రకారం.. వేపగుంటలోని సర్వేనంబరు 164/1లో 14.60 ఎకరాల వివాదాస్పద స్థలం ఉంది. ప్రస్తుతం మహేష్‌ అనే సివిల్‌ కాంట్రాక్టర్‌ ఆధీనంలో ఉన్న ఈ స్థలంలో షెడ్డు ఏర్పాటుచేసుకొని కాపలాదారు దేవి దంపతులు నివసిస్తున్నారు. మంగళవారం అర్ధరాత్రి 12.30కు దేవి భర్త లేని సమయంలో కొందరు మహిళలు తలుపు తట్టి మంచినీళ్లు కావాలని ఆమెను కోరారు. తలుపు తీసిన దేవిని ముఖాలకు చున్నీలు కట్టుకొని వచ్చిన మహిళలు చుట్టుముట్టారు. షెడ్డు నుంచి దూరంగా తీసుకెళ్లి ఒకచోట నిర్బంధించారు. అప్పటికే వెలుపల రెండు యంత్రాలతో వేచి ఉన్న యువకులు షెడ్డులోని సామగ్రిని బయటపడేశారు. షెడ్డును, ప్రహరీని కూల్చేశారు. బెదిరిస్తూ వీరంగం సృష్టించారు. బుధవారం ఉదయం 4గంటల వరకూ అక్కడే ఉన్నారు.

భర్తకు ఫోన్‌ చేయాలన్నా వినలేదు

కాంట్రాక్టర్‌ మహేష్‌కు సమాచారం ఇచ్చేందుకు దేవి ప్రయత్నించగా.. సెల్‌ఫోన్‌ లాక్కొని చంపేస్తామంటూ బెదిరించారు. కనీసం తన భర్తకైనా ఫోన్‌ చేస్తానని మొరపెట్టుకున్నా నిరాకరించారు. బుధవారం తెల్లవారుజామున సమీపంలోని ఓ వ్యక్తి ఫోన్‌నుంచి డయల్‌ 100కు దేవి ఫోన్‌ చేశారు. పెందుర్తి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకునేప్పటికి వచ్చిన వారంతా జారుకున్నారు. స్థానికులు ఒకరిద్దరిని పట్టుకుని పోలీసులకు అప్పగించినా.. సివిల్‌ పంచాయితీ అంటూ వదిలేశారన్న ఆరోపణలున్నాయి. ఈ స్థలం కొనుక్కున్న తన మిత్రుడు ఏఎస్‌ఆర్‌ శర్మ తనకు జీపీఏ ఇచ్చినట్లు కాంట్రాక్టర్‌ మహేష్‌ చెబుతున్నారు. అదే సమయంలో.. ఈ భూమిలో ‘షిప్‌యార్డు సొసైటీ’ పేరుతో వుడా అనుమతితో అధికారికంగా లేఅవుట్‌ వేసి ప్లాట్లు అమ్మగా కొన్నట్లు మరికొందరు ముందుకొస్తున్నారు. ఈ రెండు వర్గాల మధ్య స్థల వివాదం న్యాయస్థానంలో నడుస్తోంది. ప్లాట్లు కొనుక్కున్నామన్న వారిలో కొందరికి అడ్వాన్సు చెల్లించి డెవలప్‌ చేసేందుకు సిద్ధమవుతున్నామంటూ ఈ వ్యవహారంలో కొందరు రంగంలోకి దిగారు. ఈ స్థల విషయంలో డెవలపర్లు, మహేష్‌కు మధ్య వివాదం కొనసాగుతోంది.

కొట్టుకుంటే అప్పుడు చూద్దాం

భూవివాదంలో పోలీసుల జోక్యం ఎక్కువైందంటూ గతంలో మహేష్‌ ఆ శాఖ ఉన్నతాధికారులపై కోర్టును ఆశ్రయించారు. తమకు సంబంధం లేదని, జోక్యం చేసుకోబోమంటూ కోర్టుకు పోలీసులు అఫిడవిట్‌ ఇచ్చారు. దీనినే సాకుగా చూపి అర్ధరాత్రి పదుల సంఖ్యలో వచ్చి భయభ్రాంతులను చేసినా పట్టించుకోలేదు. శాంతిభద్రతల సమస్య తలెత్తలేదని, కొట్టుకుంటే అప్పుడు కేసులు పెడతామంటూ పెందుర్తి సీఐ అప్పారావు పేర్కొన్నారు.


ఎమ్మెల్యే, మంత్రి పేర్లు చెప్పే  బెదిరిస్తున్నారు: మహేష్‌

ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌, మంత్రి అమర్‌నాథ్‌ల పేర్లు చెప్పి సునీల్‌, వినోద్‌, వీఎల్‌కే ప్రసాద్‌, సదాశివరావు వంటి మధ్యవర్తులు భయపెడుతున్నారు. ఇంత జరిగినా ఎమ్మెల్యే, మంత్రి నుంచి స్పందన లేదంటే వారి ప్రమేయం ఉండే ఉంటుందని అనుమానం. ఇంతకుముందు దౌర్జన్యం చేయబోతే కేసు పెట్టగా ఛార్జిషీటులో ఎవరైతే ఉన్నారో వాళ్లే మళ్లీ షెడ్డు కూల్చడానికి తెగబడ్డారు. మా సిబ్బందిని, కాపలాదారులను బెదిరించడం, గోడలు, షెడ్డు పడగొట్టడంవంటివి చేస్తున్నారు. న్యాయస్థానంలో ఈ స్థలం మేమే గెలుచుకున్నాం. పొజిషన్‌లో మేమే ఉన్నామని సివిల్‌ కోర్టు నిర్ధారించింది.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని