3 నుంచి గ్రూపు-1 ప్రధాన పరీక్షలు

రాష్ట్రంలో ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో గ్రూపు-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు.

Published : 01 Jun 2023 05:17 IST

ట్యాబ్‌ల ద్వారా కాకుండా అభ్యర్థులకు ప్రశ్నపత్రం ఇస్తాం
ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ఎంపిక చేసిన పది జిల్లాల్లోని 11 కేంద్రాల్లో గ్రూపు-1 ప్రధాన పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఏపీపీఎస్సీ ఛైర్మన్‌ గౌతమ్‌ సవాంగ్‌ వెల్లడించారు. జూన్‌ 3 నుంచి ప్రారంభమయ్యే పరీక్షలు పదో తేదీ (4వ తేదీ మినహా) వరకు జరుగుతాయని తెలిపారు. ప్రిలిమ్స్‌ ద్వారా ఈ పరీక్షలు రాసేందుకు 6,455 మంది అర్హత సాధించారన్నారు. పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై ఏపీపీఎస్సీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ‘‘పరీక్షలు రాయబోయే అభ్యర్థులకు ప్రశ్నపత్రం అందిస్తాం. సాంకేతిక సమస్యలు ఉన్నందున గతంలోలా ట్యాబ్‌లలో ప్రశ్నపత్రాలు ఇవ్వట్లేదు. పరీక్షలు జరిగే తీరును ఏపీపీఎస్సీ కార్యాలయం నుంచి చూసేందుకు వీలుగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశాం. ఉదయం 10 నుంచి ఒంటిగంట వరకు పరీక్ష ఉంటుంది. తొమ్మిదిన్నరలోగా అభ్యర్థులు తమ తమ గదులకు వెళ్లాలి. ఆ తర్వాత 15 నిమిషాల వరకు వెసులుబాటు ఉంటుంది. 9.45 నిమిషాలు దాటితే అభ్యర్థులను కేంద్రాల్లోకి అనుమతించరు. ఫలితాలను జులై నెలాఖరుకు ప్రకటించి ఆగస్టులోగా మౌఖిక పరీక్షలు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం’’ అని తెలిపారు. రాష్ట్రప్రభుత్వం నుంచి గ్రూపు-1 (100), గ్రూపు-2 (900) ఖాళీల వివరాలు అందగానే నోటిఫికేషన్లు జారీ చేసేందుకు సిద్ధంగా ఉన్నామని గౌతమ్‌ సవాంగ్‌ తెలిపారు. ‘‘ఇవి కాకుండా ఇప్పటికే సిద్ధంగా ఉన్న 1,967 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్సీ నుంచి నోటిఫికేషన్లు జారీ కావాలి. 9 నోటిఫికేషన్ల ఫలితాలు విడుదలవ్వాలి. మరో 7 నోటిఫికేషన్లకు పరీక్షల తేదీలు ప్రకటించాలి. కోర్టులో కేసులు ఉన్నందున అధ్యాపకులు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి సమయం పడుతుంది. ఏపీపీఎస్సీ ద్వారా జరిగే నియామకాల పరీక్షల్లో జనరల్‌ స్టడీస్‌, మెంటల్‌ ఎబిలిటీ ప్రశ్నలను ఆంగ్లంలోనే కాకుండా తెలుగులోనూ ఇస్తాం’ అని వివరించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు