చంద్రబాబు నివాసం జప్తు అభ్యర్థనపై అనిశా కోర్టు విచారణ

గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ విజయవాడ అనిశా కోర్టులో వేసిన దరఖాస్తుపై బుధవారం వాదనలు జరిగాయి.

Updated : 01 Jun 2023 05:44 IST

తీర్పులను కోర్టు ముందుంచిన సీఐడీ
వాదనలు వినిపించేందుకు లింగమనేని తరఫు న్యాయవాది విజ్ఞప్తి

ఈనాడు, అమరావతి: గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ విజయవాడ అనిశా కోర్టులో వేసిన దరఖాస్తుపై బుధవారం వాదనలు జరిగాయి. సీఐడీ తరఫున ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపించారు. క్రిమినల్‌ లా సవరణ ఆర్డినెన్స్‌-1944 నిబంధన ప్రకారం ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. అనుమతించడం, లేదా తిరస్కరించడంపై ఏదో ఒక నిర్ణయం వెల్లడించాకే ప్రతివాదులకు నోటీసు ఇచ్చే ప్రశ్న వస్తుందన్నారు.వివిధ న్యాయస్థానాల తీర్పులను కోర్టుకు అందజేశారు. అనిశా కోర్టు ఇంఛార్జి ఆఫీసర్‌ ప్రతివాదులకు నోటీసు ఇస్తూ మే 17న జారీచేసిన ఆదేశాలను పరిగణనలోకి తీసుకోవద్దని అభ్యర్థించారు.

* వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ తరఫున వాదనలు వినిపించేందుకు అవకాశం ఇవ్వాలని న్యాయవాది సోము కృష్ణమూర్తి కోరారు. కోర్టులో దాఖలుచేసిన దస్త్రాలను ప్రతివాదులకు ఇవ్వాలని సీఐడీని ఆదేశిస్తూ మే 17న న్యాయస్థానం ఆదేశాలిచ్చిందని గుర్తుచేశారు. ఆ ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ ఇప్పటివరకూ దస్త్రాలను తమకు అందజేయలేదన్నారు. దస్త్రాలు ఇప్పించేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టులో మెమో దాఖలు చేశామన్నారు. వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వాల్సిన అవసరం లేదని సీఐడీ చెప్పడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం అన్నారు. వాదనలు వినిపించే అవకాశం ఇవ్వాలని కోరుతూ వకాలత్‌ దాఖలు చేశారు. సీఐడీ దాఖలుచేసిన తీర్పుల పరిశీలన కోసం విచారణను జూన్‌ 2వ తేదీకి వాయిదా వేస్తూ న్యాయాధికారి బి.హిమబిందు ఉత్తర్వులు జారీచేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని