దేవాదాయశాఖ బదిలీల్లో సిఫార్సుల జాతర

దేవాదాయశాఖలో బదిలీల కోసం అధికారులు, ఉద్యోగులు సిఫార్సు లేఖలతో ఆ శాఖ కమిషనరేట్‌లో పెద్దఎత్తున ఒత్తిళ్లు చేస్తున్నారు.

Updated : 01 Jun 2023 05:37 IST

అయిదేళ్లు దాటినా బదిలీ చేయొద్దని కొందరు
గత ఏడాదే మార్చినా, పాత పోస్టుకు పంపాలని మరికొందరు
అమాత్యులు, ఎమ్మెల్యేల లేఖలతో కమిషనరేట్‌పై ఒత్తిళ్లు

ఈనాడు, అమరావతి: దేవాదాయశాఖలో బదిలీల కోసం అధికారులు, ఉద్యోగులు సిఫార్సు లేఖలతో ఆ శాఖ కమిషనరేట్‌లో పెద్దఎత్తున ఒత్తిళ్లు చేస్తున్నారు. సుదీర్ఘకాలంగా పని చేస్తున్నవాళ్లు.. అక్కడే ఉంటామని, మరికొందరు బదిలీలకు అర్హులు కాకపోయినా మార్చాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రేడ్‌-1, 2, 3 ఆలయాల ఈవోలు, సహాయ కమిషనర్లు, ప్రధాన ఆలయాల్లో పనిచేసే ఉద్యోగుల బదిలీల ప్రక్రియ విజయవాడలోని ఆ శాఖ కమిషనరేట్‌లో జరుగుతోంది. ఒకేచోట అయిదేళ్లు దాటి పనిచేస్తున్న వారి వివరాలను సేకరించి, జాబితా సిద్ధం చేశారు. ఆ జాబితాలో ఉన్నవారిలో కొందరు తమ సొంత స్థానాల్లోనే కొనసాగేందుకు లాబీయింగ్‌ మొదలుపెట్టారు. సిఫార్సు లేఖలతో కమిషనరేట్‌కు క్యూ కట్టారు. కొందరు నాలుగైదు సిఫార్సు లేఖలు ఇచ్చి, ఆయా నేతలతో ఫోన్లు కూడా చేయిస్తున్నారు.

* పలు ఆలయాలు, చౌల్ట్రీల ఈవోలు అయిదేళ్లకు పైగా పనిచేస్తున్నారు. వారిలో కొందరు అక్కడి నుంచి కదలకుండా ఉండేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.
* భీమవరంలో ఓ చౌల్ట్రీ ఈవో 12 ఏళ్లుగా పనిచేస్తున్నారు. ఉమ్మడి కృష్ణా జిల్లాలో వివిధ ఆలయాల ఈవోలు సైతం అయిదేళ్లకు పైగా ఉన్నారు. వీరంతా అక్కడే కొనసాగాలని చూస్తున్నారు.

* సహాయ కమిషనర్లు పూర్తిస్థాయిలో లేకపోవడంతో కొందరు గ్రేడ్‌-1 ఈవోలు, వివిధ ముఖ్య ఆలయాల సహాయ కమిషనర్లుగా ఉండగా.. ఇప్పుడు కదలకుండా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు.

* ఓ పోస్టులో ఉండి.. రెండేళ్లూ పూర్తి కానివారిని బదిలీ చేయొద్దని మార్గదర్శకాలు ఉన్నాయి. అయినా గత ఏడాది బదిలీ అయినవారిలో పలువురు మళ్లీ తమ పాత స్థానాలకు వెళ్లేందుకు సిఫార్సు లేఖలు అందజేశారు.

* నిబంధనల ప్రకారం బదిలీ చేయాలా.. సిఫార్సులకు తలొగ్గాలా.. అనేది అర్థంకాక కమిషనరేట్‌ అధికారులు తలపట్టుకున్నారు. బుధవారం రాత్రి వరకూ ఈ తంతు జరుగుతూనే ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని