అద్దెకూ దిక్కు లేని ఆర్బీకేలు

‘విత్తనం నుంచి పంట విక్రయ కేంద్రం వరకు.. అంతా రైతు భరోసా కేంద్రాలే చూసుకుంటాయి.. రైతుల్ని చేయి పట్టి నడిపిస్తాయి’ అని ముఖ్యమంత్రి జగన్‌ తరచూ చెబుతుంటారు.

Updated : 02 Jun 2023 05:05 IST

విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు ఏవీ దొరకని దుస్థితి
వచ్చిన కాసిన్ని.. వైకాపా వారికే సమర్పణ
అద్దె యంత్ర కేంద్రాలూ అధికార పార్టీ వారికే
వేల సంఖ్యలో సిబ్బంది కొరత
ఈనాడు, అమరావతి - ఈనాడు యంత్రాంగం

‘విత్తనం నుంచి పంట విక్రయ కేంద్రం వరకు.. అంతా రైతు భరోసా కేంద్రాలే చూసుకుంటాయి.. రైతుల్ని చేయి పట్టి నడిపిస్తాయి’ అని ముఖ్యమంత్రి జగన్‌ తరచూ చెబుతుంటారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు సాధించాయంటూ భుజాలు చరుచుకుంటున్నారు. అయితే ఆర్బీకేలు ఏర్పాటు చేసి రెండున్నరేళ్లవుతున్నా ఇప్పటికీ అధిక శాతం సేవలు మృగ్యమే. సౌకర్యాల కల్పనపై ఏ మాత్రం దృష్టి పెట్టడం లేదు. ప్రైవేటు భవనాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాలకు రెండేళ్లుగా అద్దె కూడా చెల్లించకపోవడంతో వాటి యజమానులు తాళాలేస్తున్నా.. కాసింతైనా చలనం లేదు. మొత్తం 10,778 రైతు భరోసా కేంద్రాల పరిధిలో వ్యవసాయ, అనుబంధ శాఖలకు సంబంధించి 6,854 పోస్టులు ఖాళీగా ఉన్నా.. భర్తీకి ఇదిగో, అదిగో అంటూ కాలయాపన చేస్తోంది. వేల పోస్టులు ఖాళీగా ఉంటే సేవలు ఎలా అందుతాయనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి కొరవడింది. ఈ-క్రాప్‌, ఈకేవైసీ నమోదుతోపాటు ఇతర సేవలు సరిగా అందడం లేదు. ఆర్బీకేల ఏర్పాటు ద్వారా 22 రకాల సేవలను గ్రామస్థాయిలో అందుబాటులోకి తెచ్చామని చెబుతున్న ప్రభుత్వం.. అందులో మూడింట ఒక వంతు కూడా సక్రమంగా అందించలేకపోతున్నామనే విషయాన్ని విస్మరిస్తోంది.

రైతులకు అవసరమైన విత్తనాలు, పురుగుమందులేవీ అక్కడ లభించవు. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణనే ప్రభుత్వం గాలికొదిలేసింది. ఆర్బీకేల్లో సిబ్బందికి యాప్‌ల్లో వివరాల నమోదు, ఇతర పనులను అప్పగిస్తోంది. దీంతో రైతులకు వ్యవసాయ సలహాలు, సూచనలు కూడా ఇవ్వలేకపోతున్నారు. రైతు భరోసా కేంద్రాల్లో అందుతున్న సేవలపై ‘ఈనాడు’ రాష్ట్రవ్యాప్తంగా పరిశీలించగా.. ఎక్కడా సరిగా సేవలు అందుతున్న దాఖలాలే లేవు. అన్నింటికీ ఆర్బీకే అని ఘనంగా చెప్పడమే కానీ.. అక్కడ ఏమీ దొరకవు, ఈ-క్రాప్‌ ఒక్కటే నమోదు చేస్తారని రైతులు పేర్కొంటున్నారు. ప్రస్తుతం బదిలీ హడావుడి మొదలు కావడంతో.. అధిక శాతం సిబ్బంది కార్యాలయాలు వదిలి, ఎమ్మెల్యేల చుట్టూ తిరుగుతున్నారని వివరిస్తున్నారు. రాష్ట్రంలో అద్దె భవనాల్లో నడుస్తున్న ఆర్బీకేల పరిస్థితి మరింత దారుణంగా ఉంది. రెండేళ్ల నుంచి రూ.30 కోట్లకు పైగా అద్దె బకాయిలు పేరుకుపోవడంతో భవన యజమానులు ఆర్బీకేలకు తాళాలు వేస్తున్నారు.  ఆర్బీకేలు అద్భుతమంటూ ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం.. పట్టుమని రూ.30 కోట్ల బకాయిలు కూడా చెల్లించలేకపోవడం గమనార్హం. ఎరువుల నిల్వకు తీసుకున్న గోదాములకూ అద్దెలు చెల్లించడం లేదు. దీంతో వాటి యజమానులు అద్దెకు సరిపడా ఎరువుల బస్తాలు తీసుకెళ్లిపోతున్నారని పలువురు వ్యవసాయ సహాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

సిబ్బంది లేకుండా సేవలు ఎలా?

రైతు భరోసా కేంద్రాల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. ఒక్కో వ్యవసాయ సహాయకుడు రెండు, మూడు ఆర్బీకేల్లో ఇన్‌ఛార్జి బాధ్యతలు చూడాల్సి వస్తోంది. పశుసంవర్థకశాఖ సహాయకులు సరిపడా లేక కొన్నిచోట్ల గోపాలమిత్రల సేవలను ఉపయోగించుకుంటున్నారు. అయినా పూర్తిస్థాయిలో సేవలందడం లేదు. ఉద్యానశాఖ సహాయక పోస్టులనూ భర్తీ చేయడం లేదు. దీంతో నామమాత్ర సేవలకే పరిమితమవుతున్నాయి.

ఎరువులు, విత్తనాలు.. సీఎం మాటల్లోనే

ఆర్బీకేల్లో ఎరువులు, విత్తనాలు, పురుగుమందులు, ఇతర ఉత్పత్తులన్నీ ఉంటాయని సీఎం చెప్పడమే తప్ప అవేవీ అందుబాటులో ఉండవు.

* ప్రతి గ్రామంలో ఎరువులు అందుబాటులో ఉంటే రైతులకు శ్రమ తగ్గుతుంది. అయితే అధిక శాతం కేంద్రాల్లో సరిపడా నిల్వలే ఉండటం లేదు. రాష్ట్రంలో గతేడాది 3.77 లక్షల టన్నుల ఎరువులు మాత్రమే ఆర్బీకేల ద్వారా విక్రయించారు. ఆర్బీకేలకు సరఫరా పేరుతో సహకార పరపతి సంఘాలకు కేటాయింపులో ప్రభుత్వం కోత పెడుతోంది. దీంతో రైతులకు సొసైటీల్లోనూ ఎరువులు దొరకని పరిస్థితి.

* రైతు భరోసా కేంద్రాల పేరు చెబితేనే వ్యాపారులు ఉలిక్కిపడుతున్నారు. వాటికి పురుగుమందులు సరఫరా చేస్తే ఎన్నేళ్లకు డబ్బులిస్తారో తెలియదని భయపడుతున్నారు. దీంతో వాటిలో పురుగుమందులు కూడా దొరకడం లేదు. రైతులు అధిక ధరలకు బహిరంగ మార్కెట్లో కొనుక్కుంటున్నారు. గతేడాది మిరపలో నల్లతామర నివారణకు వాడే కొత్తతరం మందులు మొదట్లో రూ.1,500కు అమ్మారు. తర్వాత ఆ ధర రెట్టింపయినా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఆర్బీకేల్లో ఇలాంటివి అసలే దొరకవు. 

* గ్రామాల వారీగా పంటల సాగు, అవసరమయ్యే విత్తన రకాలను గుర్తించి  ఆర్బీకేల ద్వారా సరఫరా చేయడంపై శ్రద్ధ లేదు. డిమాండును బట్టి వ్యాపారులు సీజన్‌లో మిరప విత్తనాల ధరలను కిలో రూ.1.50 లక్షల వరకు కూడా పెంచేస్తున్నారు. ఇలాంటి రకాలేవీ ఆర్బీకేల ద్వారా ఇవ్వడం లేదు. ఇచ్చిన కాసిన్ని కూడా అధికార పార్టీకి చెందిన వారికే అందుతున్నాయి. దీంతో రైతులు నల్లబజారులో అధిక ధరలకు కొనుక్కోవాల్సిన పరిస్థితి.

* ఆర్బీకేల్లో కనీసం స్టేషనరీ కూడా అందుబాటులో లేదు. అంతెందుకు? పశుసంవర్థక సహాయకులకు రెండేళ్లుగా మందుల సరఫరాయే లేదు. గతంలో సరఫరా చేసిన మందులు గడువు తీరిపోయాయి. కొత్తగా ఇవ్వాలనే ఆలోచనా చేయలేదు. పశుపోషకులు వచ్చి అడిగినా తమ దగ్గర మందుల్లేవని సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఇటీవల నిధులు విడుదల చేసినా.. మందులు ఎప్పటికి వస్తాయో తెలియడం లేదని సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

అధికార పార్టీ అయితేనే.. అద్దె యంత్ర కేంద్రాలు

రాయితీపై అద్దె యంత్ర కేంద్రాలను అధికార పార్టీకి చెందిన రైతు సంఘాలకే కట్టబెట్టారు. నలుగురు సభ్యుల పేర్లతో సంఘాన్ని ఏర్పాటు చేసి రాయితీపై పరికరాలు తీసుకున్నా.. వాటిని వైకాపా నేతలే సొంత అవసరాలకు ఉపయోగించుకుంటున్నారు. రాష్ట్రంలో 6,500 ఆర్బీకేల పరిధిలో అద్దె యంత్ర కేంద్రాలకు వ్యవసాయ ఉపకరణాలను అందించినట్లు అధికారులు పేర్కొంటున్నారు. అయితే 90% కేంద్రాల్లో అవి రైతులకు ఉపయోగపడటం లేదు.

* రాష్ట్రంలోని 9,277 రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకు మిత్ర, బిజినెస్‌ కరస్పాండెంట్ల ద్వారా బ్యాంకింగ్‌ సేవలు అందిస్తున్నామని ప్రభుత్వం గొప్పలు పోతోంది. క్షేత్రస్థాయిలో రెండు శాతం కేంద్రాల్లోనూ అలాంటి సేవలు అందవు. బ్యాంకులతో సమన్వయలోపాన్ని చక్కదిద్దే   పరిస్థితి లేదు.

* మార్కెట్‌ ధరలు, వాతావరణ సమాచారం తెలుసుకోవడంతోపాటు ఎరువులు, విత్తనాలు తదితర ఉత్పత్తులను బుక్‌ చేసుకునేందుకు కియోస్క్‌లు ఏర్పాటు చేశారు. వాటికి ఇంటర్నెట్‌ సౌకర్యం లేదు. సహాయకుల మొబైల్‌ ఫోన్ల నుంచే కనెక్ట్‌ చేసుకోవాలి. దీంతో రోజులో 10 నిమిషాలు ఆన్‌ చేసి తర్వాత ఆపేయండని కొందరు అధికారులే సూచిస్తున్నారు.


ఉమ్మడి జిల్లాల్లో ‘ఈనాడు’ పరిశీలనలో వెల్లడైన అంశాలు

* తూర్పుగోదావరి జిల్లాలో రైతులు ముందు డబ్బు చెల్లిస్తేనే పురుగుమందులు ఇస్తున్నారు. అవీ మార్కెట్‌ ధర కంటే ఎక్కువే ఉన్నాయి. విత్తనాలు, ఎరువులను వైకాపా నేతలు చెప్పిన వారికే ఇస్తున్నారు. ప్రశ్నిస్తే ఇతర రైతులకూ కొంత ఇచ్చాం కదా అంటున్నారు. అద్దె యంత్ర పరికరాలనూ అధికార పార్టీ వారికే ఇచ్చారు.

* గుంటూరు జిల్లా ఆర్బీకేల్లో రైతులకు అవసరమైన పురుగుమందులు లేవు. రాయితీ యంత్ర పరికరాలను వైకాపా నేతలకు చెందిన సంఘాలకే కట్టబెట్టారు. రైతులు సూక్ష్మపోషకాలు కోరుతున్నా ఇవ్వడం లేదు.

* పశ్చిమగోదావరి జిల్లాలో ఏ ఆర్బీకేలోనూ బ్యాంకింగ్‌ సేవలందడం లేదు. రైతు భరోసా కేంద్ర సిబ్బందే.. ధాన్యం కొనుగోలులో మిల్లర్లకు అనుకూలంగా వ్యవహరిస్తూ 40 కిలోల బస్తాకు 2 కిలోలు అదనంగా ఇవ్వాలని చెబుతున్నారు.

* నెల్లూరు జిల్లా కావలి ప్రాంతంలో పురుగుమందులు కావాలని ఆర్డర్‌ పెడితే.. నెల తర్వాత వస్తున్నాయి. ప్రముఖ కంపెనీల క్రిమిసంహారకాలు లభించడం లేదని వలేటివారిపాలెం మండల రైతులు చెప్పారు.

* కృష్ణా జిల్లా పామర్రులో అరకొరగానే భూసార పరీక్షలు చేస్తున్నారు. ధాన్యం రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

* శ్రీకాకుళం జిల్లాలో ఆర్బీకేల్లో సిబ్బంది కొరత తీవ్రంగా ఉంది. పాతపట్నంలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల అదనపు తరగతి గదుల్లో ఆర్బీకేలను నిర్వహిస్తున్నారు. ఎరువులు, విత్తనాలనూ వైకాపా నేతల సిఫార్సులతోనే ఇస్తున్నారు. ఆర్బీకేల ద్వారా ధాన్యం కొనుగోలుతో దోచుకుంటున్నారని, ముప్పుతిప్పలు పెడుతున్నారని పలువురు రైతులు వాపోయారు.

* కర్నూలు జిల్లాలో కౌలు రైతులకు సీసీఆర్‌సీ కార్డులు కూడా అందడం లేదు. పత్తికొండ రైతు భరోసా కేంద్రంలో కియోస్క్‌ యంత్రం కొన్నాళ్లుగా పనిచేయడం లేదు. ఆదోని మండలం ఇస్వీలో ఆర్బీకేకి అద్దె కట్టకపోవడంతో ఖాళీ చేయించారు. దీంతో సచివాలయంలో తాత్కాలికంగా నిర్వహిస్తున్నారు.

* కడప జిల్లాలో ఎరువులు, కూరగాయల విత్తనాలు లేవు. రైల్వేకోడూరు మండలం ఉర్లగట్టుపోడు ఆర్బీకేను 5 నెలల కిందట మూసివేశారు. రెండు రోజుల కిందటే తెరిచారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని