పోలవరం పూర్తికి 2025 వరకు గడువివ్వండి

పోలవరం ప్రాజెక్టుకు తొలిదశ కింద నిధులు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సమర్పించిన ప్రతిపాదనపై గురువారం నాటి దిల్లీ సమావేశంలోనూ స్పష్టత రాలేదు.

Updated : 02 Jun 2023 06:00 IST

కేంద్రాన్ని కోరిన రాష్ట్ర ప్రభుత్వం
ఏడాది ముందే పూర్తిచేయాలన్న కేంద్రం
ప్రాజెక్టు నిర్మాణంలో గడువులు మీరొద్దన్న కేంద్ర మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌
తొలిదశ నిధులపై రాని స్పష్టత

ఈనాడు, అమరావతి: పోలవరం ప్రాజెక్టుకు తొలిదశ కింద నిధులు ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్‌ సమర్పించిన ప్రతిపాదనపై గురువారం నాటి దిల్లీ సమావేశంలోనూ స్పష్టత రాలేదు. మే నెల ప్రారంభంలో పోలవరం ప్రాజెక్టు అథారిటీకి రూ.17,144 కోట్లతో తొలిదశ అంచనా వ్యయంగా పంపిన ప్రతిపాదనలపై ఇంకా అడుగు ముందుకుపడలేదు. కేంద్రమంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌ ఆధ్వర్యంలో దిల్లీలో గురువారం జరిగిన సమావేశంలో ఈ అంశంపై చర్చ జరిగినా పోలవరం ప్రాజెక్టు అథారిటీ, కేంద్ర జలసంఘం ఆ ప్రతిపాదనలు పరిశీలించి వాటిని కేంద్ర జల్‌శక్తి శాఖకు పంపాలని మంత్రి ఆదేశించారు. తర్వాత ఆ శాఖ పరిశీలించి ఆర్థికశాఖకు పంపాలి. నిధులు వచ్చేస్తున్నాయని రాష్ట్ర పెద్దలు చెబుతూ ఉన్నా, గురువారం నాటి సమావేశంలో తొలిదశ నిధులకు ఆమోదముద్ర వేయవచ్చని ప్రభుత్వం తరఫున ప్రచారం సాగినా అలాంటి అంశం ఏదీ సమావేశంలో చోటు చేసుకోలేదు. పోలవరంపై ఇప్పటికే రాష్ట్రం ఖర్చుచేసిన రూ.1800.39 కోట్లు రీయింబర్సు చేయాలని ఏపీ అధికారులు కోరగా, చర్యలు తీసుకుంటామని కేంద్రమంత్రి షెకావత్‌ హామీ ఇచ్చారు.

రూ.550 కోట్లు ఇచ్చేందుకు సిద్ధం చేసినట్లు కేంద్ర జల్‌శక్తి అధికారులు పేర్కొన్నట్లు తెలిసింది. ఈ సమావేశం ప్రధానంగా పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపైనే జరిగింది. ఏ పని ఎప్పటికి పూర్తి చేయాలని ప్రణాళిక రూపొందించారో ఆ ప్రణాళికలో ఒక్కరోజు కూడా గడువు మీరొద్దని కేంద్రమంత్రి ఏపీ అధికారులను హెచ్చరించారు. కేంద్ర మంత్రి అధ్యక్షతన, కేంద్ర జల్‌శక్తి కార్యదర్శి పంకజ్‌కుమార్‌, కేంద్రమంత్రి ప్రధాన సలహాదారు వెదిరె శ్రీరామ్‌ల ఆధ్వర్యంలో గురువారం దిల్లీలో ఈ సమావేశం జరిగింది. ఆంధ్రప్రదేశ్‌ నుంచి ముఖ్య కార్యదర్శి జె.శ్యామలరావు (జలవనరులశాఖ ముఖ్య కార్యదర్శి సెలవులో ఉండటంతో ఆయన స్థానంలో), ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి, చీఫ్‌ ఇంజినీరు సుధాకర్‌బాబు హాజరయ్యారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈవో శివానంద్‌కుమార్‌, సభ్య కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.

ఒక్క రోజూ గడువు మీరొద్దు

పోలవరం ప్రాజెక్టు పనులు ఇప్పటికే ఆలస్యం అయ్యాయని, ఇక ఒక్కరోజు కూడా గడువు మీరకుండా చూడాలని కేంద్రమంత్రి స్పష్టం చేశారు. ప్రణాళికలో పేర్కొన్నట్లుగా పనులు పూర్తిచేయాల్సిందేనని అన్నారు. 2025 జూన్‌ నాటికి ప్రధాన డ్యాం నిర్మాణం పూర్తికి గడువును ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపాదించగా దానిపై కేంద్రం అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలిసింది. పోలవరం గడువుల్లో జూన్‌ అని చెబుతున్నా.. సంవత్సరాలు మారిపోతున్నాయని, 2021 నుంచి ఎప్పుడూ ఇదే కనిపిస్తోందని వెదిరె శ్రీరామ్‌ వ్యాఖ్యానించినట్లు తెలిసింది. దీంతో కేంద్రమంత్రి షెకావత్‌ 2025 జూన్‌ వరకు గడువు పెంపు సరికాదని, 2024 జూన్‌ నాటికే పూర్తిచేయాలని ఆదేశించారు.

వర్షాకాలంలోపు పూర్తిచేయాలి

వర్షాలు ప్రారంభం అయ్యి, వరదలు వచ్చే లోపు ప్రధాన డ్యాంలో కోతపడ్డ ప్రాంతంలో పనులు పూర్తిచేయాలని కేంద్ర మంత్రి షెకావత్‌ ఆదేశించారు. ఎగువ కాఫర్‌ డ్యాంలో ఉన్న సీపేజీలను నిరోధించకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని, వరదల లోపు ఆ పని పూర్తిచేసుకుని ప్రధాన డ్యాం నిర్మాణంపై దృష్టి సారించాలని పేర్కొన్నారు. ఈలోపు డయాఫ్రం వాల్‌ డిజైన్లకు ఆమోదం పొంది, పనులు ప్రారంభించాలన్నారు. వీటిలో ఏది ఆలస్యమైనా మళ్లీ ఒక సీజన్‌ కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

పాలిగన్‌ మ్యాప్‌లు చూశారా?

పోలవరం ప్రాజెక్టు తొలిదశ అంచనాల్లో భూసేకరణ, పునరావాసానికి అదనంగా రూ.5,127 కోట్లు ప్రతిపాదించిన అంశం చర్చకు వచ్చింది. లైడార్‌ సర్వే ప్రకారం 41.15 మీటర్ల స్థాయిలో నీరు నిలబెడితే మరో 36 గ్రామాలు, 48 ఆవాసాలు ఆ పరిధిలోకే వస్తాయని తేలిందని ఏపీ అధికారులు తెలిపారు. దీనివల్ల తొలిదశలోనే మరో 16,642 కుటుంబాలను తరలించాలని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులూ అలాగే చెప్పడంతో వెదిరె శ్రీరామ్‌ ఈ అంశంపై సుదీర్ఘంగా చర్చించినట్లు సమాచారం. లైడార్‌ సర్వే ఫలితాలను సమగ్రంగా అధ్యయనం చేశారా? అని ప్రశ్నించారు. పోలవరం అథారిటీ అధికారులు సరైన సమాధానం చెప్పకపోవడంతో, పాలిగన్‌ మ్యాప్‌లు పరిశీలించారా అని కూడా ప్రశ్నించారు. దానికీ వారినుంచి సమాధానం రాలేదు. పాలిగన్‌ మ్యాప్‌లు ఇంపోజ్‌ చేసి.. ఏ మేరకు ముంపు ఏర్పడుతుందో గమనించకుండానే ఇన్ని గ్రామాలు తొలిదశలోకి వస్తాయని ఎలా నివేదిస్తారని పోలవరం అథారిటీని వెదిరె శ్రీరామ్‌ ప్రశ్నించినట్లు తెలిసింది. లైడార్‌ సర్వేకు 8-9 నెలల సమయం ఎందుకని ఏపీ అధికారులను నిలదీశారు. రెండు మూడు వారాల్లోనే ఈ సర్వే పూర్తి చేయవచ్చన్నారు.


రూ.17,144 కోట్లు అడిగాం

- నారాయణరెడ్డి

ఈనాడు, దిల్లీ: ‘‘పోలవరం ప్రాజెక్టు తొలిదశ నిర్మాణానికి కేంద్రాన్ని రూ.17,144 కోట్లు అడిగాం. అది పరిశీలనలో ఉంది. దాన్ని త్వరగా ప్రాసెస్‌ చేయాలని అధికారులకు కేంద్రమంత్రి చెప్పారు. ఏపీ ముఖ్యమంత్రి దీనిపై ప్రధానమంత్రి, కేంద్రమంత్రులకు చేసిన విజ్ఞప్తి మేరకు అడుగులు వేగంగా పడుతున్నాయి. తాజా సమావేశంలో పునరావాసం, సవరించిన అంచనాలు, ఛత్తీస్‌గఢ్‌, ఒడిశా, తెలంగాణ రాష్ట్రాల్లో ముంపుపైనా చర్చ జరిగింది’’ అని ఆంధ్రప్రదేశ్‌ జలవనరులశాఖ ఇంజినీర్‌ ఇన్‌ చీఫ్‌ సి.నారాయణరెడ్డి వెల్లడించారు. కేంద్రమంత్రితో సమావేశం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఇంకా సమావేశాలు ఉంటాయా? అన్న ప్రశ్నకు బదులిస్తూ ఇది నిరంతర ప్రక్రియ అని, చర్చలు ఇక్కడితో ముగియవని అన్నారు. కేంద్రం అడిగిన అన్ని అంశాలపై తాము వివరణ ఇస్తున్నామని, ఇందుకోసం దిల్లీలో, పోలవరం ప్రాజెక్టు అథారిటీ దగ్గర ప్రత్యేకంగా బృందాలు ఉన్నాయన్నారు. సవరించిన అంచనాల గురించి అడగ్గా... ఇప్పుడు మొత్తం ప్రాజెక్టు సవరించిన అంచనాలపై చర్చ జరగలేదని, 41.15 మీటర్ల తొలిదశ నిర్మాణం వరకూ రూ.17,144 కోట్ల తాత్కాలిక మొత్తం విడుదలపైనే మాట్లాడినట్లు చెప్పారు.

రెండో సవరించిన అంచనాల్లో మిగతా విషయాలను పరిగణనలోకి తీసుకుంటారని తెలిపారు. కేంద్రం నిధులు విడుదల చేస్తే ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 45.72 మీటర్ల వరకూ నిర్మాణం పూర్తవుతుందన్నారు. సహాయ, పునరావాస కార్యక్రమాలు తొలిదశలో నీరు నిల్వచేసే 41.15 మీటర్ల వరకూ పూర్తవుతాయన్నారు. ఎప్పటిలోపు ప్రాజెక్టు పూర్తవుతుందన్న ప్రశ్నకు బదులిస్తూ తాజా పరిస్థితుల ప్రకారం ప్రాజెక్టు పూర్తిచేయడానికి 2025 జూన్‌ వరకు సమయం పడుతుందని తాము కేంద్రానికి చెప్పినట్లు వెల్లడించారు. అయితే వీలుంటే ఈ గడువును సంవత్సరం ముందుకు జరిపేందుకు ప్రయత్నించాలని కేంద్రం సూచించినట్లు పేర్కొన్నారు. అది వీలవుతుందా.. లేదా అన్నదానిపై తాము అధ్యయనం చేస్తామన్నారు. తొలిదశ ఎప్పట్లోగా పూర్తవుతుందన్న గడువులపై కసరత్తు చేసి కేంద్రానికి సమర్పిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని