‘అక్రమం’ అన్న కలెక్టర్‌తోనే గ్రీన్‌సిగ్నల్‌!

ఒక జిల్లా కలెక్టర్‌ అన్ని కోణాల్లో పరిశీలించి, అనేక లోపాలున్నాయని నిర్ధారించి, భూకేటాయింపు రద్దు చేయాలని సిఫార్సు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోగా... చివరకు ఆ కలెక్టర్‌తోనే ఆ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వులు ఇప్పించారంటే ఆ ప్రాజెక్టులో అధికార పార్టీ పెద్దల ప్రయోజనాలు ఏ స్థాయిలో ముడిపడి ఉన్నాయో అర్థమవుతోంది.

Updated : 02 Jun 2023 12:50 IST

విశాఖలో హయగ్రీవ ప్రాజెక్టుకు ఆగమేఘాలపై జీవీఎంసీ తుది అనుమతులు
భూ కేటాయింపు రద్దు చేయాలని ఏడాది క్రితం కలెక్టర్‌ సిఫార్సు
‘తాడేపల్లి’ ఒత్తిడితో అదే కలెక్టర్‌ తాజాగా పచ్చజెండా!
ప్రస్తుత జీపీఏ హోల్డర్‌.. సీఎం జగన్‌కు అత్యంత సన్నిహితుడు
ఈనాడు-విశాఖపట్నం, అమరావతి

క జిల్లా కలెక్టర్‌ అన్ని కోణాల్లో పరిశీలించి, అనేక లోపాలున్నాయని నిర్ధారించి, భూకేటాయింపు రద్దు చేయాలని సిఫార్సు చేసినా ప్రభుత్వం పట్టించుకోకపోగా... చివరకు ఆ కలెక్టర్‌తోనే ఆ సంస్థకు మార్గం సుగమం చేస్తూ ఉత్తర్వులు ఇప్పించారంటే ఆ ప్రాజెక్టులో అధికార పార్టీ పెద్దల ప్రయోజనాలు ఏ స్థాయిలో ముడిపడి ఉన్నాయో అర్థమవుతోంది. 2008లో వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా... చిలుకూరి జగదీశ్వరుడికి చెందిన హయగ్రీవ సంస్థకు ఎకరం రూ.45 లక్షలు చొప్పున... నిర్దిష్ట ప్రయోజనం కోసం, కొన్ని షరతులతో విశాఖలోని ఎండాడలో కేటాయించిన ఆ 12.51 ఎకరాల భూమి విలువ... ఇప్పుడు కనీసం రూ.250 కోట్లు...! ఇప్పుడా భూమి ముఖ్యమంత్రి జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా చెప్పుకొనే వైకాపా నేత, ఆడిటర్‌, విశాఖ స్మార్ట్‌సిటీ కార్పొరేషన్‌ మాజీ ఛైర్మన్‌ గన్నమనేని వెంకటేశ్వరరావు (జీవీ) చేతుల్లోకి వెళ్లిపోయింది. ఆ భూమికి ఇప్పుడు ఆయనే జీపీఏ హోల్డర్‌. అధికార పార్టీకి చెందిన ఒక ఎంపీకి దానిలో భాగస్వామ్యం ఉన్నట్లు సమాచారం. విశాఖలో వైకాపా నాయకుల భూదందాలు ఏ స్థాయిలో జరుగుతున్నాయో చెప్పడానికి ఇదే నిదర్శనం.

మొదటి నుంచీ ఉల్లంఘనే..!

వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాన్ని ఉచితంగా నిర్మించడంతో పాటు, వృద్ధులు సౌకర్యంగా నివసించేందుకు వీలుగా కాటేజీలు నిర్మిస్తామంటూ 2006లో ఆ స్థలం కోసం హయగ్రీవ సంస్థ దరఖాస్తు చేసుకుంది. ఆ సంస్థకు ఎకరం రూ.1.50 కోట్ల చొప్పున కేటాయించవచ్చని జిల్లా కలెక్టర్‌ సిఫార్సు చేశారు. వృద్ధులు, అనాథలకు కాటేజీలు కడతామనే కారణం చూపించి... ఎకరం రూ.45 లక్షలు చొప్పున వై.ఎస్‌. ప్రభుత్వంలో హయగ్రీవ సంస్థ భూములు పొందింది. ఆ 12.51 ఎకరాల్లో 10 శాతం భూమిలో ఆ సంస్థ ఉచితంగా వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించి నిర్వహించాలన్నది షరతు. 60 శాతం భూమిలో వృద్ధులు సౌకర్యవంతంగా నివసించేందుకు వీలుగా కాటేజీలు నిర్మించి 60 ఏళ్లపైబడినవారికి విక్రయించాలి. 30 శాతం భూమిని మౌలిక వసతుల కల్పనకు వినియోగించాలి. ఈ ప్రకారం హయగ్రీవ సంస్థకు కేటాయించిన 60,548.40 చదరపు గజాల్లో (12.51ఎకరాలు)... 6,054.80 చదరపు గజాల్లో వృద్ధాశ్రమం, అనాథ శరణాలయాలు నిర్మించాలి. 18,164.50 చదరపు గజాలు మౌలిక వసతుల కల్పనకు పోతుంది. ఇంకా కాటేజీల నిర్మాణానికి 36,329.10 చదరపు గజాలు ఉంటుంది. హయగ్రీవ సంస్థ అక్కడ వృద్ధాశ్రమం, అనాథాశ్రమం నిర్మించకపోగా... వృద్ధులకు కాటేజీలు నిర్మించాల్సిన 36,329.10 చదరపు గజాల్లో 32,857 చదరపు గజాల్ని అప్పటికే అమ్మేసిందని, అది ఫక్తు స్థిరాస్తి వ్యాపారం తప్ప, మరొకటి కాదని ఏడాది క్రితం ప్రభుత్వానికి రాసిన లేఖలో కలెక్టర్‌ పేర్కొన్నారు.

వాళ్లూ వాళ్లూ పంచేసుకున్నారు

హయగ్రీవ సంస్థ 2008లోనే భూకేటాయింపులు పొందినప్పటికీ నిర్మాణాలు చేపట్టలేదు. ప్రభుత్వం నుంచి చర్యలేమైనా చేపడదామనుకునేసరికి ఆ సంస్థ యాజమాన్యం కోర్టుకి వెళ్లింది. ఈ క్రమంలో కోర్టు ఆదేశాల ద్వారా ప్రాజెక్టును కొనసాగించేందుకు హయగ్రీవ సంస్థకు అవకాశాలు వచ్చినా...  ఎలాంటి పనులూ చేపట్టలేదు. హయగ్రీవ సంస్థ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా ఉన్న చిలుకూరి జగదీశ్వరుడు... ఆ తర్వాతి కాలంలో గద్దె బ్రహ్మాజీకి 75 శాతం వాటా ఇస్తూ భాగస్వామిగా చేర్చుకున్నారు. అనంతరం ఆ భూమికి సంబంధించి జీవీకి.. జీపీఏ చేశారు. తన నుంచి ఆ భూమిని జీవీ, విశాఖ ఎంపీ ఎంవీవీ చేజిక్కించుకున్నారని, బ్రహ్మాజీని కూడా వారే మేనేజింగ్‌ పార్ట్‌నర్‌గా చేర్చి... తనకు తెలియకుండా కొన్ని స్థలాలు అమ్మేశారని 2021 డిసెంబరులో జగదీశ్వరుడు ఒక సెల్ఫీ వీడియో విడుదల చేయడం సంచలనం సృష్టించింది.

* వీఎంఆర్‌డీఏ, జీవీఎంసీల నుంచి అనుమతులు లేకుండానే ఆ ప్రాజెక్టులో మిగిలిన భూమిని 30 మందికి వెయ్యి గజాల చొప్పున అమ్మేశారు. ఇందులో అనకాపల్లి జిల్లాకు చెందిన ఓ వైకాపా ఎమ్మెల్యేకు రెండు ప్లాట్లు, ఓ రాజ్యసభ సభ్యుడికి ఒక ప్లాటు కేటాయించినట్లు సమాచారం.

కలెక్టర్‌ లేఖను ఆధారంగా చేసుకుని... జీవీఎంసీ మే నెల 3న ఆగమేఘాల మీద హయగీవ్ర  సంస్థ ప్రాజెక్టుకి తుది అనుమతులన్నీ ఇచ్చేసింది. హయగ్రీవ ఫార్మ్స్‌ అండ్‌ డెవలపర్స్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌  గద్దె బ్రహ్మాజీ... గత నెల 3వ తేదీ ఉదయం జీవీఎంసీ కమిషనర్‌ పేరుతో గిఫ్ట్‌ డీడ్‌ రిజిస్టర్‌ చేయడం. టౌన్‌ప్లానింగ్‌ అసిస్టెంట్‌ (టీపీఏ) నుంచి... ఏసీపీ, డీసీపీ, సీసీపీ వరకు అన్ని అంచెల్నీ దాటుకుంటూ ఫైల్‌ కదలడం, కమిషనర్‌ సాయికాంత్‌ వర్మ కూడా అదే రోజు సంతకం పెట్టేయడం మెరుపు వేగంతో జరిగిపోయాయి. ఈ స్థలాన్ని జీపీఏ చేసుకున్న వ్యక్తి.. సీఎం జగన్‌కు అత్యంత  సన్నిహితుడు కావడమే దీనంతటికీ ప్రధాన కారణం. హయగ్రీవ సంస్థ నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించింది కాబట్టి... భూకేటాయింపులు రద్దు చేయాలంటూ విశాఖకు చెందిన జనసేన కార్పొరేటర్‌ పీతల మూర్తియాదవ్‌, తెదేపా మాజీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావులు దాఖలు చేసిన ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు హైకోర్టులో పెండింగ్‌లో ఉండగానే... ఆ ప్రాజెక్టుకి జీవీఎంసీ అనుమతులిచ్చింది. జిల్లా కలెక్టర్‌, జీవీఎంసీ కమిషనర్‌ ఆ సంస్థకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవడానికి ‘తాడేపల్లి’ నుంచి గట్టి ఒత్తిళ్లు రావడమే కారణమని తెలుస్తోంది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని