వాణిజ్య పన్నుల శాఖలో నలుగురు ఉద్యోగులకు రిమాండ్‌

వాణిజ్య పన్నుల శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులకు విజయవాడ న్యాయస్థానం ఈ నెల 14 వరకు రిమాండ్‌ విధించింది.

Updated : 02 Jun 2023 05:26 IST

అయిదో నిందితుడిగా ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ
రిమాండ్‌ తిరస్కరించాలని కోరిన నిందితుల తరఫు న్యాయవాది

ఈనాడు, అమరావతి: వాణిజ్య పన్నుల శాఖకు చెందిన నలుగురు ఉద్యోగులకు విజయవాడ న్యాయస్థానం ఈ నెల 14 వరకు రిమాండ్‌ విధించింది. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారనే ఆరోపణలతో వాణిజ్య పన్నులశాఖ డిప్యూటీ కమిషనర్‌ మే 30న ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజయవాడ పటమట పోలీసులు అదే రోజు కేసు నమోదు చేశారు. జీఎస్టీ అధికారులు మెహర్‌కుమార్‌, కె.సంధ్య, సీనియర్‌ అసిస్టెంట్‌ కేవీ చలపతి, ఆఫీస్‌ సబార్డినేట్‌ ఎం.సత్యనారాయణ, సీనియర్‌ అసిస్టెంట్‌ కేఆర్‌ సూర్యనారాయణ, ఇతరులను ఈ కేసులో నిందితులుగా పేర్కొన్నారు. ఇందులో ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడు, వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ పేరు గురువారం వెలుగులోకి వచ్చింది. మిగిలిన నలుగురిని బుధవారం సాయంత్రమే పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే.

గురువారం సాయంత్రం విజయవాడలోని మూడో అదనపు మెట్రోపాలిటన్‌ మేజిస్ట్రేట్‌ కోర్టు న్యాయాధికారి రాజశేఖర్‌ (4వ ఏసీఎంఎం కోర్టు ఇంఛార్జి) వద్ద ఆ నలుగురిని రిమాండ్‌ నిమిత్తం హాజరుపరిచారు. నిందితుల తరఫున న్యాయవాది పీవీజీ ఉమేశ్‌ చంద్ర.. రిమాండ్‌ విధించడానికి వీల్లేదని వాదనలు వినిపించారు. ఉద్దేశపూర్వకంగానే పోలీసులు ఐపీసీ 409 (పబ్లిక్‌ సర్వెంట్‌ నేరపూర్వక విశ్వాస ఘాతుకానికి పాల్పడటం) సెక్షన్‌ నమోదు చేశారన్నారు. ఆ సెక్షన్‌ వీరికి వర్తించదన్నారు. పన్ను వసూలు చేసే బాధ్యతను నిందితులకు అప్పగించలేదన్నారు. అలాంటప్పుడు వారిపై 409 సెక్షన్‌ కింద కేసు నమోదు చెల్లదని చెప్పారు. ఇదే ఆరోపణలతో నిందితులపై ప్రభుత్వం శాఖాపరమైన చర్యలు తీసుకోవడాన్ని హైకోర్టు రద్దు చేసిందని గుర్తుచేశారు. సుప్రీంకోర్టు అర్నేష్‌కుమార్‌ కేసులో ఇచ్చిన మార్గదర్శకాలను దాటవేయాలన్న దురుద్దేశంతోనే పోలీసులు ఏడేళ్లకు పైబడే శిక్షకు వీలున్న సెక్షన్లు నమోదు చేస్తున్నారన్నారు. 409 సెక్షన్‌ మినహా మిగిలిన సెక్షన్లన్నీ ఏడేళ్లలోపు జైలు శిక్షకు వీలున్నవే కాబట్టి సీఆర్‌పీసీ సెక్షన్‌ 41ఏ కింద నిందితులకు నోటీసిచ్చి వివరణ తీసుకోవాలన్నారు. రిమాండ్‌ను తిరస్కరించాలని అభ్యర్థించారు.

పోలీసుల తరఫున పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ (పీపీ) వై.నాగిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. రిమాండ్‌ విధించడానికి ఇది అర్హమైన కేసు అన్నారు. రిమాండ్‌ దశలో సెక్షన్‌ 409 వర్తిస్తుందా లేదా అనే విషయంలో లోతుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదన్నారు. నిందితులందరూ పబ్లిక్‌ సర్వెంట్లన్నారు. వాణిజ్య పన్నుల శాఖ అధికారులు తీసుకున్న అంతర్గత నిర్ణయాల ప్రకారం నిందితులకు పన్ను వసూలు చేసే బాధ్యత అప్పగించారన్నారు. ప్రభుత్వ ఖజానాకు నష్టం జరిగిందన్న ఉన్నతాధికారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారన్నారు. నిందితులకు రిమాండ్‌ విధించాలని కోరారు. ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి.. నలుగురు నిందితులకు ఈ నెల 14 వరకు జ్యుడిషియల్‌ రిమాండ్‌ విధిస్తూ ఉత్తర్వులిచ్చారు. దీంతో పోలీసులు వారిని విజయవాడ జిల్లా జైలుకు తరలించారు.


వ్యక్తిగత లబ్ధి కోసం ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం

- రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న పోలీసులు

‘కేఆర్‌ సూర్యనారాయణతోపాటు ఈ నిందితులు 2019-21 మధ్య కాలంలో విజయవాడ ఒకటో డివిజన్‌ వాణిజ్య పన్నుల శాఖ నిఘా విభాగంలో పనిచేశారు. ఈఎస్‌ఐ ఆసుపత్రులకు ఔషధాలు, శస్త్రచికిత్స పరికరాలు సరఫరా చేసే వర్తకులు, సరఫరాదారులతో కుమ్మక్కై ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టారు. నీరు-చెట్టు పథకం కింద చేపట్టిన పనుల వ్యయాన్ని తగ్గించి చూపారు. ప్రభుత్వానికి జమ కావాల్సిన సొమ్ముకు గండి కొట్టడంలో వీరి ప్రమేయం ఉంది. విశ్రాంత అధికారి డి.వెంకటేశ్వరరావు గతేడాది డిసెంబర్‌ ఇచ్చిన నివేదిక ప్రకారం సూర్యనారాయణతోపాటు ఈ నలుగురు నిందితులు తనిఖీలు, దాడుల ముసుగులో డీలర్లు, కాంట్రాక్టర్ల నుంచి పెద్ద మొత్తంలో వసూలు చేశారని తేలింది. పంపిణీ రిజిస్ట్టర్లలో తప్పుడు ఎంట్రీలను నమోదు చేశారు. మందులు సరఫరా చేసిన ఏజెన్సీలతో కుమ్మక్కై వారి టర్నోవర్‌, పన్నులను తక్కువ చూపి.. తక్కువ పన్ను వసూలు చేశారు. అధికార దుర్వినియోగం చేసి, అక్రమాలకు పాల్పడ్డ నేపథ్యంలో వారిపై క్రమశిక్షణ చర్యలకు విచారణ అధికారి సైతం సిఫారసు చేశారు. వ్యక్తిగత లబ్ధి పొందడం కోసం చేసిన వీరి చర్యల వల్ల ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది. నిందితులు దర్యాప్తునకు సహకరించడం లేదు. కస్టోడియల్‌ విచారణ అవసరం ఉంది. ఈ అంశాల్ని పరిగణనలోకి తీసుకొని రిమాండ్‌ విధించండి’ అని పటమట సీఐ కాశీ విశ్వనాథ్‌ కోరారు.

ఈ కేసును ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. కేసు నమోదు దగ్గర నుంచి వాదనలు వినిపించే వరకు ఉన్నతస్థాయి నుంచి ఎప్పటికప్పుడు ఆదేశాలు అందాయి. నిందితుల అరెస్ట్‌ విషయంలోనూ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. రిమాండ్‌ విధించే సమయంలో సైతం రాష్ట్ర పీపీ నాగిరెడ్డిని రంగంలోకి దించారు. డీసీపీ విశాల్‌ గున్ని కోర్టుకు హాజరై విషయాలను ఎప్పటికప్పుడు పోలీసు కమిషనర్‌కు నివేదించారు. రిమాండ్‌ విధించాలంటూ వాదనలు ప్రారంభమైన సమయంలో ప్రభుత్వ న్యాయవాది.. సెక్షన్‌ 409 ఏ విధంగా వర్తిస్తుందో కోర్టుకు సరిగా వివరించలేకపోయారు. దీంతో రిమాండ్‌ తిరస్కరణకు గురయ్యే అవకాశం ఉందన్న తరుణంలో పోలీసులు బలమైన వాదనలు వినిపించేందుకు ఆగమేఘాల మీద పీపీ నాగిరెడ్డిని పిలిపించారు. రిమాండ్‌ విధించడంతో ఊపిరి పీల్చుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని