విచారణకు సహకరిస్తున్నా ఎల్వోసీ

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో విచారణకు సహకరిస్తున్నప్పటికీ మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సీహెచ్‌.శైలజకు వ్యతిరేకంగా లుక్‌ ఔట్‌ నోటీసు జారీ చేశారని, దాన్ని సస్పెండ్‌ చేయాలని మార్గదర్శి తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

Updated : 02 Jun 2023 06:07 IST

ఆ నోటీసును సస్పెండ్‌ చేయండి
హైకోర్టులో మార్గదర్శి ఎండీ తరఫు న్యాయవాది

ఈనాడు, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం నమోదు చేసిన కేసుల్లో విచారణకు సహకరిస్తున్నప్పటికీ మార్గదర్శి చిట్‌ఫండ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఎండీ సీహెచ్‌.శైలజకు వ్యతిరేకంగా లుక్‌ ఔట్‌ నోటీసు జారీ చేశారని, దాన్ని సస్పెండ్‌ చేయాలని మార్గదర్శి తరఫు న్యాయవాది తెలంగాణ హైకోర్టు దృష్టికి తీసుకొచ్చారు. ఏపీ సీఐడీ జారీచేసిన లుక్‌ ఔట్‌ సర్క్యులర్‌ (ఎల్వోసీ)ని సవాలుచేస్తూ సీహెచ్‌.శైలజ వేసిన పిటిషన్‌పై జస్టిస్‌ కె.శరత్‌ గురువారం విచారణ చేపట్టారు. పిటిషనర్‌ తరఫున సీనియర్‌ న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్‌, న్యాయవాది విమల్‌వర్మ వాసిరెడ్డి వాదనలు వినిపిస్తూ.. కుటుంబ కార్యక్రమాలు ఉన్నందున ఏప్రిల్‌ 27 నుంచి రెండు, మూడు వారాలపాటు విచారణ వాయిదా వేయాలని పిటిషనర్‌ మెయిల్‌ పంపినట్లు చెప్పారు. మే 12న సీఐడీ నోటీసివ్వగా గడువు కోరామన్నారు. జూన్‌ 6న ఉదయం 10 గంటలకు అందుబాటులో ఉండాలని సీఐడీ మరోసారి నోటీసు ఇచ్చిందన్నారు. అందుబాటులో ఉంటానని పిటిషనర్‌ సమాచారం ఇచ్చారన్నారు. మార్గదర్శిపై ఇప్పటివరకు ఒక్క ఫిర్యాదూ లేకపోయినా ఏపీ ప్రభుత్వ న్యాయవాది రూ.7వేల కోట్ల కుంభకోణం అనడం అనుచితమని పిటిషనర్‌ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. పిటిషనర్‌పై కఠినచర్యలు వద్దని గతంలో ఇదే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చిందని, ఎల్వోసీ జారీ కఠినచర్యల కిందకే వస్తుందని గతంలో దిల్లీ హైకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు స్పష్టంగా చెబుతున్నాయని అన్నారు. 

సమాచారం ఇవ్వకుండా వెళ్లకూడదని మార్గదర్శకాలున్నాయా?

ఏపీ ప్రభుత్వ న్యాయవాది లలితా గాయత్రి వాదనలు వినిపిస్తూ.. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా, తాము అనుమతించకుండా పిటిషనర్‌ అమెరికా వెళ్లారన్నారు. మే 17న ఎల్వోసీ నిమిత్తం సీఐడీ కేంద్రానికి లేఖ రాసినట్లు తెలిపారు. న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ.. సీఐడీకి సమాచారం ఇవ్వకుండా విదేశాలకు వెళ్లకూడదని మార్గదర్శకాలు ఉన్నాయా అని ప్రశ్నించగా అలాంటివేమీ లేవని సమాధానమిచ్చారు. పిటిషనర్‌ గతంలో విచారణకు హాజరయ్యారు కదా అని ప్రశ్నించగా జవాబు దాటవేశారు. కేంద్రం తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ లుక్‌ ఔట్‌ నోటీసులు జారీచేసే పరిధి ఏపీ సీఐడీకి లేదని, తాము ఇప్పటివరకు జారీచేయలేదని తెలిపారు. వాదనలు విన్న న్యాయమూర్తి అన్ని అంశాలనూ పరిగణనలోకి తీసుకుని మధ్యంతర ఉత్తర్వులిస్తామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని