ఆలస్యమైతే బయట అమ్ముకోండి

ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి తయారుచేసిన బెల్లం కొంటామని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పడంతో భారీగా నిల్వ చేశామని, తీరా ఇప్పుడు జాప్యం చేస్తున్నారని విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన రైతులు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు.

Updated : 02 Jun 2023 11:02 IST

బెల్లం సమస్య వివరించిన రైతులతో మంత్రి బొత్స

బొబ్బిలి గ్రామీణం, న్యూస్‌టుడే: ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన చెరకు నుంచి తయారుచేసిన బెల్లం కొంటామని తిరుమల తిరుపతి దేవస్థానం చెప్పడంతో భారీగా నిల్వ చేశామని, తీరా ఇప్పుడు జాప్యం చేస్తున్నారని విజయనగరం జిల్లా బొబ్బిలి ప్రాంతానికి చెందిన రైతులు విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. బొబ్బిలి మండల పరిషత్‌ కార్యాలయం వద్ద గురువారం నిర్వహించిన రైతు భరోసా చెక్కుల పంపిణీ కార్యక్రమంలో రైతులు అట్లాడ మాధవరావు, తిరుపతిరావు, వేణు, మజ్జి శ్రీనివాసరావు తదితరులు మంత్రిని కలిసి సమస్య వివరించారు. తితిదే, జిల్లా అధికారులు ఇచ్చిన హామీ మేరకు జనవరి, ఫిబ్రవరి నెలల్లో బెల్లం తయారుచేసి నిల్వ ఉంచామని, ఇప్పటికీ సేకరించలేదని అన్నారు. దీంతో వర్షాలకు పాడై నష్టపోతున్నామంటూ పలువురు రైతులు బెల్లం దిమ్మలను చూపించారు. దీనిపై మంత్రి బొత్స స్పందిస్తూ.. ఆలస్యమవుతుందని భావిస్తే బయట మార్కెట్లో అమ్ముకోవాలని సూచించారు. ఇన్నాళ్లూ భద్రపరిచామని, ఇప్పుడు బయట అమ్ముకోమంటే ఎలా అని ఆయనను రైతులు నిలదీయడంతో మంత్రి వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో రైతులు వెనుదిరిగి కార్యాలయం ఆవరణలోని స్టాల్‌లో ఉన్న ప్రకృతి వ్యవసాయ సిబ్బంది వద్దకు వెళ్లారు. ప్రకృతి వ్యవసాయమంటూ గ్రామాలకు రావద్దని వారిపై మండిపడ్డారు. మీ మాటలు నమ్ముకుని చెమటోడ్చి చెరకు సాగు చేశామని, ఇప్పుడు కొనాలని అడిగితే అధికారులు ముఖం చాటేస్తున్నారని రైతులు వాపోయారు.

మేనిఫెస్టో బాగున్నవారికే ప్రజల ఓట్లు: వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీ మేనిఫెస్టో బాగుంటే వారికే ప్రజలు ఓట్లు వేసి గెలిపిస్తారని మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. బొబ్బిలిలో రైతు భరోసా చెక్కు పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం తెదేపా ప్రకటించిన మేనిఫెస్టోపై అభిప్రాయం చెప్పాలని పలువురు విలేకరులు ఆయన్ను అడగ్గా స్పందించారు. ఇతర రాష్ట్రాల మేనిఫేస్టోను తెలుగుదేశం పార్టీ వారు ఇక్కడ ప్రకటించారని, ప్రజలు ఏది బాగుంటే దానికే ఓట్లు వేస్తారని బొత్స పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని