సాయం కోరి సీఎం సభ వద్దకు వస్తే తోసేశారు

ఎదిగిన కుమారుడు కదల్లేని స్థితిలో ఉన్నాడు. సీఎం సాయం కోరుతూ.. అతడిని భుజాన ఎత్తుకుని వచ్చారు. లోపలికి వెళ్తుంటే పోలీసులు తోసేశారు.

Published : 02 Jun 2023 04:28 IST

సీఎం సహాయ నిధి కోసం ఎదురుచూపులు

ఆలూరు గ్రామీణ, ఆస్పరి, పత్తికొండ గ్రామీణం, న్యూస్‌టుడే: ఎదిగిన కుమారుడు కదల్లేని స్థితిలో ఉన్నాడు. సీఎం సాయం కోరుతూ.. అతడిని భుజాన ఎత్తుకుని వచ్చారు. లోపలికి వెళ్తుంటే పోలీసులు తోసేశారు. కర్నూలు జిల్లా పత్తికొండలోని సీఎం సభ వద్ద చోటుచేసుకున్న ఘటన ఇది. ఆలూరుకు చెందిన చిదానంద, సిద్ధమ్మల రెండో కుమారుడు వీరన్నకు 24 సంవత్సరాలు. కడుపు నొప్పితో ఇబ్బంది పడుతున్న వీరన్నను ఆస్పత్రిలో చూపించగా, పేగులు దెబ్బతిన్నాయని.. వెంటనే శస్త్రచికిత్స చేయాలని వైద్యులు సూచించారు. ఆరోగ్యశ్రీ పనిచేయదని చెప్పారు. చికిత్స కోసం రూ. 5 లక్షలు ఖర్చవుతుందని తెలిపారు. దాతల సహకారంతో చికిత్స చేశారు. అయినా నయం కాలేదు. మరో శస్త్రచికిత్స చేయాలని, రూ. 15 లక్షల వరకు అవుతుందని చెప్పారు. దీంతో సీఎం సహాయ నిధి కింద సాయం చేయాలని పత్తికొండ ఎమ్మెల్యే శ్రీదేవిని కోరారు. సీఎం సభకు కుమారుడిని తీసుకురావాలని ఆమె సూచించారు. దీంతో కుమారుడిని భుజంపై వేసుకుని సీఎం సభకు వెళ్తుండగా.. పోలీసులు తోసేసినట్లు బాధితులు తెలిపారు. బాధను దిగమింగుతూ రోడ్డు పక్కన ఓ షెడ్డు కింద దీనంగా కూర్చుండిపోయారు. తమ కుమారుడికి ప్రాణభిక్ష పెట్టాలని వారు కోరుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని