స.హ. దరఖాస్తులకు స్పందన కరవు

సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల (పౌర సమాచార అధికారుల-పీఐవో) స్పందన కరవైంది. సమాచారం ఇవ్వకపోతే ఏమవుతుందన్న నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది.

Published : 02 Jun 2023 04:43 IST

పీఐవోలలో పెరిగిన నిర్లక్ష్య ధోరణి
కమిషన్‌ కొరడా ఝళిపించాలని కోరుకుంటున్న ఉద్యమకారులు
చట్ట ఉద్దేశం నెరవేరడం లేదని ఆవేదన

ఈనాడు, అమరావతి: సమాచార హక్కు చట్టం దరఖాస్తులకు రాష్ట్రంలో ప్రభుత్వ అధికారుల (పౌర సమాచార అధికారుల-పీఐవో) స్పందన కరవైంది. సమాచారం ఇవ్వకపోతే ఏమవుతుందన్న నిర్లక్ష్య ధోరణి కనిపిస్తోంది. పీఐవోలు సకాలంలో స్పందించకుండా మొదటి అప్పీలు దాఖలు చేసుకునే పరిస్థితులు కల్పిస్తున్నారు. స.హ. చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ స్ఫూర్తిని నీరుగారుస్తున్నారు. దరఖాస్తు అందాక గరిష్ఠంగా 30 రోజుల్లోపు సమాచారం ఇవ్వాలన్న సమాచార హక్కు (స.హ.) చట్టంలోని సెక్షన్‌ 7(1)ను అధికారులు తుంగలో తొక్కుతున్నారు. నిర్లక్ష్యంగా ఉన్నవారికి జరిమానాలు విధించాల్సిన రాష్ట్ర స.హ. కమిషన్‌ నిర్లిప్తతతో పీఐవో/మొదటి అప్పీలు అధికారులలో భయం లేకుండా పోతోంది. మరోవైపు శాఖలవారీగా అధికారులకు ప్రభుత్వం స.హ. చట్టంపై శిక్షణ తరగతులు లేకపోవడంతో చట్ట తీవ్రత ఏంటో, నిబంధనలు ఏం చెబుతున్నాయో పీఐవోలకు తెలియట్లేదు. దీంతో దరఖాస్తులు చెత్తబుట్టల పాలవుతున్నాయి. 

కమిషన్‌ కన్నెర్ర చేసిన సందర్భాలే లేవు

పీఐవో స్పందించలేదని మొదటి అప్పీలు చేసి, అక్కడా స్పందన లేదని ఏపీ సమాచార కమిషన్‌ వద్ద రెండో అప్పీలు దాఖలు చేస్తే ‘దరఖాస్తుదారుడికి సమాచారం ఇవ్వండి’ అని మాత్రమే పరిష్కరిస్తున్నారు. పీఐవోల కారణంగా సమయం, సొమ్ము వృథా అయినందుకు కమిషన్‌ వద్ద పరిష్కారం దొరకట్లేదని స.హ. ఉద్యమకారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సకాలంలో స్పందించనందుకు అధికారులపై కన్నెర్ర చేసిన సందర్భాలే లేవని పెదవి విరుస్తున్నారు. నిర్దేశిత వ్యవధిలో సమాచారం ఇవ్వకపోయినా, దురుద్దేశంతో దరఖాస్తును తిరస్కరించినా, అసంపూర్తి, తప్పుదారి పట్టించే సమాచారం ఇచ్చినా అలాంటి పీఐవో, మొదటి అప్పీలు అధికారులకు జరిమానా విధించే అధికారం రాష్ట్ర సమాచార కమిషన్‌కు ఉంది. మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తుంటే సర్వీసు నిబంధనల ప్రకారం క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి సిఫారసు చేయవచ్చు. ఈ ఏడాదిలో (జనవరి నుంచి ఏప్రిల్‌) ఒక్క ఘటనలోనూ క్రమశిక్షణ చర్యలకు రాష్ట్ర సమాచార కమిషన్‌ సిఫారసు చేయలేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వ నిర్ణయాలు, పాలనా వ్యవహారాల గురించి తెలుసుకునే హక్కు పౌరులకు ఉంది. రాష్ట్ర ప్రభుత్వం జీవోలనూ బయటపెట్టకుండా గోప్యత పాటిస్తూ పారదర్శక పాలనకు పాతరేస్తోంది. దీంతో స.హ. చట్టాన్ని వినియోగించుకోవాల్సిన దుస్థితి రాష్ట్రంలో కనిపిస్తోంది.

* ముఖ్యమైన కేసుల్లో రాష్ట్రప్రభుత్వం తరఫున న్యాయస్థానాల్లో వాదనలు వినిపించిన న్యాయవాదులెవరు? వారికి చెల్లించిన ఫీజుల వివరాలు ఇవ్వాలని కేఎస్‌ కోటేశ్వరరావు రాష్ట్ర న్యాయశాఖ, ఆర్థికశాఖకు దరఖాస్తు చేశారు. పీఐవోల నుంచి కనీస స్పందన లేదు.

*  ఆలయాలకు చెందిన సర్వశ్రేయోనిధి (సీజీఎఫ్‌) సొమ్మును ఏ అవసరాలకు వెచ్చించారు? ఆలయాల పేర్లు ఇవ్వాలని విజయవాడ యనమలకుదురుకు చెందిన ఓ మహిళ దేవాదాయశాఖకు స.హ. దరఖాస్తు చేశారు. ఇప్పటివరకు ఆ దరఖాస్తుకు దిక్కే లేదు.

*  అనర్హులకు పింఛన్లు ఇస్తున్న వైనంపై స.హ. దరఖాస్తు చేస్తే స్పందించలేదని ఎల్‌ఎస్‌ నారాయణ అంటున్నారు. సమాచారం కోరిన వారిపై దాడులు చేస్తున్నారని, తప్పుడు కేసులు పెడుతున్నారని ఆయన చెప్పారు. కమిషన్‌ ఇచ్చిన ఆదేశాలూ కొన్నిసార్లు అమలు కావట్లేదని తెలిపారు.

*  స.హ. చట్టం గతంలో అమలైనట్లు ప్రస్తుతం కావట్లేదని సమాచార హక్కు చట్టం ఉద్యమకారుడు పూర్ణచంద్రారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. ‘దరఖాస్తుకు సమాధానం ఇవ్వాలనే ఆలోచనే ఉండట్లేదు. దీంతో దరఖాస్తు చేసేవారి సంఖ్య తగ్గిపోతోంది. విషయం కమిషన్‌ దగ్గరకు వెళితే అప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకోవచ్చులే అనే భావన అధికారుల్లో ఉంది. స.హ కమిషన్‌ కఠినంగా వ్యవహరించాలి’ అన్నారు.


శిక్షణ కార్యక్రమాలకు ఖర్చుచేయడం లేదు: ముప్పాళ్ల సుబ్బారావు

స.హ. చట్టం అమలు తీరు రాష్ట్రంలో పతనావస్థకు చేరిందని స.హ.చట్ట రక్షణ వేదిక వ్యవస్థాపకుడు ముప్పాళ్ల సుబ్బారావు విమర్శించారు. ‘ఆ చట్టాన్ని ఎలా అమలు చేయాలో చాలామంది పీఐవోలకు తెలియట్లేదు. శాఖలవారీగా అధికారులకు (పీఐవో) ప్రభుత్వం శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలి. అందుకోసం ప్రభుత్వం సొమ్ము ఖర్చుచేయట్లేదు. మరోవైపు స.హ. కమిషన్‌ పునరావాస కేంద్రంగా మారింది. ధిక్కరించిన అధికారులపైనా నామమాత్రపు చర్యలే ఉంటున్నాయి. దరఖాస్తుదారులు సొంత సొమ్ము ఖర్చుచేయాల్సి వస్తోంది. ధిక్కరించిన అధికారులు సొంత సొమ్ము ఖర్చుచేస్తే దరఖాస్తుదారుల బాధ తెలుస్తుంది. పీఐవోలు సమాచారం ఇవ్వకుండా రాష్ట్ర ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. ఇలాంటివారిని కమిషన్‌ కఠినంగా శిక్షించాలి’ అని డిమాండు చేశారు.


అధికారులకు శిక్షణ తరగతులు వసరం: ఆర్‌ఎం బాషా

స.హ. దరఖాస్తులకు పీఐవోలు సకాలంలో స్పందించాల్సిందేనని రాష్ట్ర ప్రధాన సమాచార కమిషనర్‌ ఆర్‌.మహబూబ్‌ బాషా స్పష్టంచేశారు. జాప్యం చేయడానికి వీల్లేదన్నారు. విఫలమైతే చట్ట నిబంధనల ప్రకారం శిక్షలు తప్పవన్నారు. ప్రభుత్వ అధికారులకు (పీఐవో, మొదటి అప్పీలు అధికారులకు) స.హ. చట్టంపై శిక్షణ తరగతులు అవసరం అన్నారు. ఆగస్టు-సెప్టెంబరులో శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నం చేస్తున్నామన్నారు. స.హ. ఉద్యమకారులు చురుకైన పాత్ర పోషించాలని తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని