ఆర్బీకేల్లో రాయితీ పరికరాలు

రైతులు బాగుండాలన్న లక్ష్యంతో వారికి అవసరమైన ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లను అందజేస్తున్నామని, గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఇదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు.

Published : 03 Jun 2023 05:41 IST

వైఎస్సార్‌ యంత్రసేవా యాప్‌తో సేవలు
గ్రామ స్వరాజ్యానికి అర్థం చెప్పిన రోజు ఇది..
గుంటూరులో యంత్రసేవా పథకం ప్రారంభం సందర్భంగా సీఎం జగన్‌

ఈనాడు, అమరావతి: రైతులు బాగుండాలన్న లక్ష్యంతో వారికి అవసరమైన ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్లను అందజేస్తున్నామని, గ్రామ స్వరాజ్యానికి నిజమైన అర్థం చెప్పే రోజు ఇదని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. గుంటూరు చుట్టగుంట కూడలిలో శుక్రవారం వైఎస్సార్‌ యంత్ర సేవా పథకం ప్రారంభించిన సందర్భంగా అందించిన ట్రాక్టర్లు, కంబైన్డ్‌ హార్వెస్టర్ల ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడారు. ప్రతి ఆర్బీకే పరిధిలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్‌ కింద రైతులకు కావాల్సిన ట్రాక్టర్లు, వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు తీసుకున్నామన్నారు. రాష్ట్రంలోని 10,444 ఆర్బీకేల పరిధిలో వీటిని సమకూర్చామని వివరించారు. గతంలో 6,525 ఆర్బీకేల పరిధిలో 391 క్లస్టర్లలో కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్లు ప్రారంభించి యంత్రాలు అందజేశామని గుర్తుచేశారు. ప్రస్తుతం 3,919 ఆర్బీకేల పరిధిలో వంద క్లస్టర్ల స్థాయిలో 2,562 కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్ల ద్వారా యంత్ర సామగ్రిని సమకూర్చామని అన్నారు. రాష్ట్రంలో వరి ఎక్కువగా పండించే 491 క్లస్టర్లలో కంబైన్డ్‌ హార్వెస్టర్లు ఇచ్చామని తెలిపారు. ఇతర వ్యవసాయ పరికరాలు 13,573 అందుబాటులో ఉన్నాయని వివరించారు. ప్రతి ఆర్బీకేకు రూ.15 లక్షలు కేటాయించి రైతులకు అవసరమైన పరికరాలు సమకూర్చామన్నారు. పరికరాలు కొనుక్కోలేని రైతులు తక్కువ అద్దె చెల్లించి వాడుకునే వెసులుబాటు కల్పించామని వివరించారు. ఇందుకు వైఎస్సార్‌ యంత్ర సేవా యాప్‌ ద్వారా 15 రోజుల ముందు బుక్‌ చేసుకుంటే సేవలు లభిస్తాయన్నారు. మరో విడతలో అక్టోబరులో 7 లక్షల మందికి వ్యక్తిగత వ్యవసాయ పరికరాలు, టార్పాలిన్లు, స్ప్రేయర్లవంటివి అందజేస్తామని ప్రకటించారు. అనంతరం బటన్‌ నొక్కి రూ.125.48 కోట్ల రాయితీ సొమ్మును రైతుల ఖాతాలోకి సీఎం జమ చేశారు. ట్రాక్టర్లు ర్యాలీగా ముందుకు సాగుతుండగా సీఎం వారికి అభివాదం చేశారు. అంతకుముందు వేదిక వద్ద ఉన్న ట్రాక్టర్‌ను రైతుతో కలిసి ఎక్కి నడిపారు. కంబైన్డ్‌ హార్వెస్టర్‌ డ్రైవింగ్‌ సీట్‌లో కూర్చుని రైతులతో ఫొటో దిగారు.

సీఎంతోపాటు నేతలు, అధికారులు ఎండలోనే..

సీఎం వేదిక వెనుక వైపున్న అపార్టుమెంట్‌కు పైనుంచి కింది వరకు వైకాపా రంగు పరదాలు కప్పారు. కార్యక్రమం జరిగే ప్రాంతం చుట్టూ పరదాలు కట్టారు. ‘వైఎస్సార్‌ యంత్రసేవా పథకం’ ఎండలోనే నిర్వహించడంతో రైతులు, అధికారులు, కార్యక్రమానికి వచ్చినవారు ఇబ్బంది పడ్డారు. కొద్ది మంది మహిళలకు మాత్రమే టెంట్లు వేశారు. వేదికపైన సీఎంతోపాటు నేతలు, అధికారులు ఎండలోనే నిల్చోవాల్సి వచ్చింది. పది గంటలకు ఎండ తీవ్రత పెరగడంతో అల్లాడిపోయారు. ఉదయంనుంచి రైతులు ట్రాక్టర్లలోనే ఉండడం, ఎండలోనే తీసుకెళ్లాల్సి రావడంతో అవస్థలు పడ్డారు. కార్యక్రమంలో ఉపముఖ్యమంత్రి అంజాద్‌బాషా, మంత్రులు కాకాణి గోవర్ధన్‌రెడ్డి, అంబటి రాంబాబు, మేరుగు నాగార్జున, విడదల రజిని, ఎంపీలు శ్రీకృష్ణదేవరాయలు, నందిగం సురేష్‌, మోపిదేవి వెంకటరమణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.

ట్రాఫిక్‌ ఆంక్షలతో ఇక్కట్లు: సీఎం రాక సందర్భంగా చుట్టుగుంట కూడలికి నలువైపులా వాహనాల రాకపోకలను నిలిపేశారు. పలు రహదారుల వైపు ఎలాంటి వాహనాలనూ పోలీసులు అనుమతించలేదు. ఉదయం 9.30 నుంచి నగరంపాలెం, కలెక్టరేట్‌ వైపు, జడ్పీ వైపు వాహనాలను అనుమతించకపోవడంతో ఉద్యోగులు, సామాన్యులు అష్టకష్టాలు పడ్డారు.


ట్రాక్టర్లపై మూడు గంటలపాటు రైతుల అవస్థలు

ట్రాక్టర్లు, హార్వెస్టర్ల పంపిణీ కార్యక్రమంలో రైతులు ఎండలో తమ వాహనాలపై మూడు గంటల పాటు భారంగా గడిపారు. శుక్రవారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. పది నిమిషాల కార్యక్రమానికి వందల కిలోమీటర్ల నుంచి వచ్చామని వాపోయారు. మూడు రోజుల నుంచి ట్రాక్టర్లకు పని లేకుండా ఇక్కడ వదిలివెళ్లాల్సి వచ్చిందని వివిధ జిల్లాల రైతులు వాపోయారు. ట్రాక్టర్లకు బ్రాండింగ్‌ చేయడం, జెండాలు కట్టడానికి ముందే తీసుకురావాలని రైతులకు ముందే అధికారులు సూచించారు. కంబైన్డ్‌ హార్వెస్టర్లను ట్రాలీలలో తీసుకొచ్చారు. గురువారం రాత్రికి గుంటూరు చేరుకున్న రైతులు ఇక్కడి మార్కెట్‌యార్డులో ఉన్న తమ వాహనాలను రాత్రి 9 గంటల నుంచి 11 గంటల వరకు రోడ్డుపైకి తెచ్చి నిలిపారు. ఉదయాన్నే 8 గంటలకల్లా రైతులంతా ట్రాక్టర్లపైకి రావాలని అధికారులు సూచించడంతో వాటిని ఎక్కి కూర్చున్నారు. కొందరు ఎండకు తాళలేక డివైడర్ల సమీపంలోని చెట్ల కింద కూర్చున్నారు. ట్రాక్టర్లపైన టాప్‌ లేకపోవడంతో చాలామంది ఎండలోనే గడపాల్సి వచ్చింది. సభావేదిక వద్ద 10.30 గంటల తర్వాత సీఎం జెండా ఊపడంతో అప్పుడు ర్యాలీగా వెళ్లారు. ఆ ఎండలోనే సొంతూళ్లకు వెళ్లిపోయారు. ఏ జిల్లాకు సంబంధించి ఆ జిల్లాలో పెడితే కష్టం తప్పేదని కొందరు రైతులు పేర్కొన్నారు.


Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు