ఆ ఆర్డినెన్స్‌ చట్టబద్ధతను తేల్చండి

తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు (ఎటాచ్‌) అనుమతి కోరుతూ సీఐడీ దాఖలుచేసిన దరఖాస్తుపై న్యాయస్థానం ఓసారి విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసు జారీచేశాక వారికి వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ విజయవాడ అనిశా కోర్టులో వాదనలు వినిపించారు.

Published : 03 Jun 2023 02:55 IST

కేసు నమోదైన ఏడాది తర్వాత సీఐడీ హడావుడి చేస్తోంది
వ్యాపారవేత్త లింగమనేని తరఫు న్యాయవాది వాదన
చంద్రబాబు నివాసం జప్తు అభ్యర్థనపై వాదనలు పూర్తి
6న తగిన ఉత్తర్వులిస్తామన్న న్యాయాధికారి

ఈనాడు, అమరావతి: తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న ఇంటి జప్తునకు (ఎటాచ్‌) అనుమతి కోరుతూ సీఐడీ దాఖలుచేసిన దరఖాస్తుపై న్యాయస్థానం ఓసారి విచారణ జరిపి ప్రతివాదులకు నోటీసు జారీచేశాక వారికి వాదనలు చెప్పుకునే అవకాశం ఇవ్వాలని వ్యాపారవేత్త లింగమనేని రమేష్‌ తరఫు న్యాయవాది ఎన్‌.అశ్వనీకుమార్‌ విజయవాడ అనిశా కోర్టులో వాదనలు వినిపించారు. గత నెల 18న విచారణ జరిపిన న్యాయస్థానం తమకు నోటీసు జారీచేసి, దస్త్రాలను అందజేయాలని సీఐడీని ఆదేశించిందని గుర్తుచేశారు. అభ్యంతరాలు లేవనెత్తుతూ వాదనలు చెప్పుకొనే అవకాశం తమకు కల్పించాలని కోరారు. క్రిమినల్‌ లా సవరణ ఆర్డినెన్స్‌-1944 చట్టబద్ధతను తేల్చాలన్నారు. మరోవైపు సీఐడీ తరఫు ప్రత్యేక పీపీ వైఎన్‌ వివేకానంద వాదనలు వినిపిస్తూ.. ఎటాచ్‌మెంట్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి ముందే ప్రతివాదులకు నోటీసు ఇచ్చి వాదనలు వినాల్సిన అవసరం లేదన్నారు. ఎటాచ్‌మెంట్‌కు న్యాయస్థానం అనుమతి ఇవ్వచ్చన్నారు. శుక్రవారం జరిగిన విచారణలో ఇరువైపుల వాదనలు విన్న న్యాయాధికారి బి.హిమబిందు.. ఈ నెల 6న తగిన ఉత్తర్వులు జారీచేస్తామని స్పష్టంచేశారు.

* గుంటూరు జిల్లా ఉండవల్లిలోని కరకట్ట రోడ్డు సమీపంలో తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్‌కు చెందిన ఇంటి జప్తునకు అనుమతి ఇవ్వాలంటూ ఏపీ సీఐడీ విజయవాడ అనిశా కోర్టులో దరఖాస్తు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సీఐడీ అభ్యర్థనపై లింగమనేని తరఫు న్యాయవాది అశ్వనీకుమార్‌ తీవ్ర అభ్యంతరం తెలిపారు. ‘ఎటాచ్‌మెంట్‌ కోసం సీఐడీ వేసిన దరఖాస్తుపై న్యాయస్థానం మే 18న విచారణ జరిపింది. ఆ రోజు ఎటాచ్‌మెంట్‌కు అనుమతివ్వడం కానీ తిరస్కరించడం కానీ చేయాలి. అయితే నోటీసులే జారీచేసింది. కాబట్టి అభ్యంతరాలు లేవనెత్తే అవకాశం న్యాయస్థానం మాకు కల్పించింది. మే 18న న్యాయస్థానం ఇచ్చిన ఆదేశాలను ఇదే కోర్టు పునఃసమీక్ష చేయలేదు. ఎటాచ్‌మెంట్‌కు సీఐడీ అనుమతి కోరుతున్న ఆర్డినెన్స్‌-1944 ఉనికిలో లేదనేది మా అభ్యంతరం. దానిపై సీఐడీ స్పష్టత ఇవ్వాలి. రాజధాని నగర బృహత్తర ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ మార్పు చేయడంలో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలతో గతేడాది మేలో సీఐడీ కేసు నమోదు చేసింది. ఏడాది తర్వాత నిందితుల ఆస్తుల ఎటాచ్‌మెంట్‌కు అనుమతి ఇవ్వాలని ఇప్పుడు హడావుడి చేస్తోంది. వీటన్నింటికీ కారణాలు వేరే ఉన్నాయి. ఈ కేసులో వాదనలు చెప్పుకొనే అవకాశం ఇవ్వకపోవడం సహజ న్యాయసూత్రాలకు విరుద్ధం. మరోవైపు లింగమనేని రమేష్‌కు ముందస్తు బెయిలు మంజూరు చేసిన హైకోర్టు.. బృహత్తర ప్రణాళిక, రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌లో మార్పు ఆరోపణలను తోసిపుచ్చింది. ఎటాచ్‌మెంట్‌ కోసం సీఐడీ చూపుతున్న కారణాలు నిబంధనలకు అనుగుణంగా లేవు. ఈ నేపథ్యంలో ఆర్డినెన్స్‌లోని సెక్షన్‌ 4(1)(2) కింద ఎటాచ్‌మెంట్‌ ఉత్తర్వులు జారీచేసే విషయంలో ఈ న్యాయస్థానానికి విచారణాధికార పరిధి ఉండదు. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని సీఐడీ అభ్యర్థనను తిరస్కరించండి’ అని కోరారు.

ఇదీ కేసు నేపథ్యం

రాజధాని బృహత్‌ ప్రణాళిక, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు ఎలైన్‌మెంట్‌ మార్పులో అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణతో గతేడాది మేలో సీఐడీ పలువురిపై కేసు నమోదు చేసింది. తెదేపా అధినేత చంద్రబాబు నివసిస్తున్న లింగమనేని రమేష్‌కు చెందిన కరకట్ట రోడ్డులోని ఇంటిని, మాజీ మంత్రి నారాయణ సంబంధీకుల ఆస్తులను ఎటాచ్‌ చేసేందుకు సీఐడీకి అనుమతిస్తూ హోంశాఖ మే 12న ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో కోర్టు నుంచి అనుమతి పొందేందుకు సీఐడీ విజయవాడ అనిశా కోర్టులో రెండు వేర్వేరు దరఖాస్తులు దాఖలు చేసిన విషయం తెలిసిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని