Odisha Train Accident: ఏపీ ప్రయాణికులు ఎందరో?

ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం.

Updated : 03 Jun 2023 07:17 IST

కోరమండల్‌లో మన రాష్ట్రానికి వస్తున్న ప్రయాణికులు
ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు రిజర్వేషన్‌ సమాచారం

ఈనాడు, అమరావతి: ఒడిశాలోని బాలేశ్వర్‌ సమీపంలోని బహనాగ్‌బజార్‌ రైల్వేస్టేషన్‌ వద్ద జరిగిన ఘోర రైలు ప్రమాదంలో ఏపీకి చెందిన ప్రయాణికులు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నట్లు సమాచారం. షాలిమార్‌ నుంచి చెన్నై వస్తున్న కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌ నుంచి హావ్‌డా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ ప్రమాదానికి గురయ్యాయి. ఈ రెండింటిలోనూ తెలుగువాళ్లు ఉన్నారు. ముఖ్యంగా కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎక్కువ మంది ప్రయాణికులు ఏపీకి వస్తున్నట్లు రైల్వే అధికారుల వద్ద ఉన్న జాబితా బట్టి తెలుస్తోంది.

* కోరమండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో.. షాలిమార్‌, సంత్రగచ్చి, ఖరగ్‌పూర్‌, బాలేశ్వర్‌ స్టేషన్లలో ఎక్కిన ప్రయాణికుల్లో విజయవాడలో 47 మంది, రాజమహేంద్రవరంలో 22 మంది, ఏలూరుకు ఒకరు కలిపి మొత్తంగా 70 మంది వరకు దిగాల్సి ఉంది.  

* ఇదే రైలులో రాజమహేంద్రవరం స్టేషన్‌ నుంచి 56 మంది, తాడేపల్లిగూడెంలో 10మంది, ఏలూరులో 44 మంది, విజయవాడలో 120 మంది ప్రయాణికులు ఎక్కి.. చెన్నై సెంట్రల్‌ స్టేషన్‌కు వెళ్లేలా రిజర్వేషన్లు చేసుకున్నారు.

యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఎందరో?

కర్ణాటకలోని యశ్వంత్‌పూర్‌ నుంచి హావ్‌డా వెళ్తున్న ఎక్స్‌ప్రెస్‌ మన రాష్ట్రంలోని తిరుపతి, రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, బాపట్ల, తెనాలి, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమహేంద్రవరం, సామర్లకోట, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం రోడ్‌, పలాస స్టేషన్లు మీదుగా వెళ్లింది. వీటిలో ఎక్కువ మంది యశ్వంత్‌పూర్‌, తిరుపతి, రేణిగుంట స్టేషన్లలో ఎక్కారు. అలాగే మనరాష్ట్ర పరిధిలో వివిధ స్టేషన్లలో దిగారు. అలాగే తిరుపతి, రేణిగుంట, చీరాల స్టేషన్ల నుంచి ఖరగ్‌పూర్‌, హావ్‌డా వైపు 52 మందికిపైగా ప్రయాణికులు వెళ్లినట్లు జాబితాలో వివరాలు ఉన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని