హీరోయిన్‌ను చేయాలని.. కుమార్తెకు రోజూ సూది మందులు

సినీరంగం అంటే రంగుల ప్రపంచం.. కలల కదంబం.. దానిపై మోజుతో కుమార్తెను హీరోయిన్‌గా చేయాలనుకున్నదో తల్లి. అంతవరకు బాగానే ఉంది కానీ.. చెప్పుడు మాటలు విని.. అభంశుభం తెలియని చిన్నారిని ‘త్వరగా పెద్దదాన్ని’ చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. బాధ భరించలేని బాధితురాలు చైల్డ్‌లైన్‌ విభాగానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.

Updated : 03 Jun 2023 06:46 IST

విజయనగరంలో ఓ మహిళ నిర్వాకం
వద్దని వేడుకుంటున్నా వదలని వైనం
అనారోగ్యంపాలైన బాలిక
అమ్మాయి ఫిర్యాదుతో దారుణం వెలుగులోకి

విజయనగరం నేరవార్తావిభాగం, న్యూస్‌టుడే: సినీరంగం అంటే రంగుల ప్రపంచం.. కలల కదంబం.. దానిపై మోజుతో కుమార్తెను హీరోయిన్‌గా చేయాలనుకున్నదో తల్లి. అంతవరకు బాగానే ఉంది కానీ.. చెప్పుడు మాటలు విని.. అభంశుభం తెలియని చిన్నారిని ‘త్వరగా పెద్దదాన్ని’ చేయడం కోసం ఇంజెక్షన్లు ఇవ్వడం మొదలుపెట్టింది. బాధ భరించలేని బాధితురాలు చైల్డ్‌లైన్‌ విభాగానికి ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. విజయనగరంలో చోటుచేసుకుందీ దారుణం. బాలల హక్కుల పరిరక్షణ కమిషన్‌ రాష్ట్ర ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపిన వివరాల మేరకు.. విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్‌ సమీపంలో ఓ మహిళ (40) నివాసముంటోంది. ఓ కుమార్తె పుట్టాక ఆమె మొదటి భర్త చనిపోయాడు. దీంతో మరో వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇద్దరు పిల్లలు జన్మించాక అతను ఆమెను వదిలిపెట్టి.. చిన్నారులను తీసుకుని వెళ్లిపోయాడు.

ప్రస్తుతం ఆమె ఇంకో వ్యక్తితో కలిసి ఉంటోంది. మొదటి భర్తకు పుట్టిన బాలిక (15) విశాఖలోని ప్రభుత్వ విద్యా సంస్థలో ఇటీవల పదో తరగతి పూర్తి చేసింది. వేసవి సెలవులు కావడంతో ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో తల్లి వద్దకు తరచూ ఎవరెవరో వస్తుండటాన్ని గమనించి అక్కడ ఉండేందుకు ఇష్టపడలేదు. ఈ విషయంలో తల్లితో గొడవపడేది. ఇటీవల ఇంటికి వచ్చిన ఓ వ్యక్తి ఆ బాలికను చూశాడు. హీరోయిన్‌ అయ్యే లక్షణాలు ఉన్నాయని, అయితే కొన్ని అవయవాలు బొద్దుగా పెరగాలంటూ నమ్మబలికాడు. అతడి సూచనల మేరకు కుమార్తెకు రోజూ ఏవేవో ఇంజెక్షన్లు ఇప్పించడం ప్రారంభించింది. ఈ క్రమంలో ఆ చిన్నారి అనారోగ్యం బారిన పడింది. బాధ భరించలేక.. తల్లిని వేడుకున్నా విడిచిపెట్టలేదు. దీంతో ఏం చేయాలో తోచక చివరకు గురువారం రాత్రి 1098కు ఫోన్‌ చేసి చైల్డ్‌లైన్‌ సిబ్బందికి తన దీనస్థితిని వివరించింది. వారు వెంటనే అప్రమత్తమై జిల్లా అధికారులకు సమాచారం ఇచ్చారు. వారు పోలీసుల సహకారంతో వెళ్లి బాలికను తమ అధీనంలోకి తీసుకున్నారు. అనంతరం విశాఖపట్నంలో స్వధార్‌ హోమ్‌కు పంపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేయాలని దిశ పోలీసులను కోరినట్లు రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్‌ కేసలి అప్పారావు తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని