అజ్ఞాతంలోకి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణ?

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ అరెస్టు దిశగా విజయవాడ పోలీసుల అడుగులు వేస్తున్నారు.

Updated : 03 Jun 2023 06:02 IST

అరెస్టు చేసేందుకు ప్రత్యేక బృందాల అన్వేషణ

ఈనాడు, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం (ఏపీజీఈఏ) అధ్యక్షుడు కేఆర్‌ సూర్యనారాయణ అరెస్టు దిశగా విజయవాడ పోలీసుల అడుగులు వేస్తున్నారు. రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలిస్తున్నారు. శుక్రవారం నగరంలోని సత్యనారాయణపురంలోని ఆయన ఇంటికి, విద్యాధరపురంలోని సంఘం కార్యాలయానికి వెళ్లినా ఆచూకీ దొరకలేదు. వాణిజ్య పన్నుల శాఖలో నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించడం ద్వారా ప్రభుత్వాదాయానికి నష్టం కలిగించారన్న ఫిర్యాదుపై గత నెల 30న పటమట పోలీసులు అయిదుగురిపై కేసు నమోదు చేశారు. ఈ కేసులో ఇప్పటికే నలుగురు వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగులను అరెస్టు చేయగా న్యాయమూర్తి రిమాండ్‌ విధించారు. అయిదో నిందితుడిగా చేర్చిన సూర్యనారాయణ కోసం పోలీసులు గాలిస్తున్నారు.  

ఉన్నత స్థాయి ఆదేశాలతోనే..

ఈ కేసును ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వ్యక్తులు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. అక్కడి నుంచి వస్తున్న ఆదేశాల ప్రకారమే విజయవాడ పోలీసులు నడుచుకుంటున్నట్లు తెలిసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను నగర పోలీసు కమిషనర్‌ కాంతిరాణా టాటా ఎప్పటికప్పుడు ఉన్నతాధికారులకు అందిస్తున్నారు. కేసు నమోదు, అరెస్టు వరకు ఏ దశలోనూ వివరాలు బయటకు పొక్కకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. సూర్యనారాయణను అరెస్టు చేస్తే ఉద్యోగ సంఘాల్లో వ్యతిరేకత వస్తుందని భావించి, ఆయన మినహా మిగిలినవారినే అరెస్టు చేయాలని తొలుత ఉన్నతస్థాయి నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. మిగిలిన వారిని అరెస్టు చేసి, రిమాండ్‌కు పంపే ప్రక్రియ గురువారం రాత్రికి పూర్తయింది. అనంతరం సూర్యనారాయణ అరెస్టుకు ఆదేశాలు అందడంతో ఆగమేఘాలపై రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. తనను పోలీసులు అరెస్టు చేసే ఉద్దేశం ఉందనే అనుమానం రావడంతో ఫోన్లు వదిలేసి శుక్రవారం ఉదయం నుంచే ఆయన అజ్ఞాతంలోకి వెళ్లిపోయినట్లు సమాచారం. దీంతో పోలీసులు సూర్యనారాయణ ఫోన్లు, సహచరుల కదలికలపై నిఘా పెట్టారు. ఆయన తలదాచుకునేందుకు అవకాశం ఉన్న అన్ని ప్రాంతాల్లోనూ వెతుకుతున్నారు. ఈ కేసులో ఇంకా ఎవరి పాత్ర అయినా ఉందేమో వివరాలు రాబట్టాల్సి ఉందని, అందువల్ల రిమాండ్‌లో ఉన్న మెహర్‌కుమార్‌, సంధ్య, చలపతి, సత్యనారాయణలను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసులు శుక్రవారం మూడో ఏసీఎంఎం కోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషన్‌ సోమవారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని