ఆక్వారైతు ‘బరువయ్యాడా’?
ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ. 1.50 చొప్పున ఇస్తాం. మూడేళ్లలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. నాలుగో ఏడాది నుంచి చేపలు, రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం.
రాయితీ విద్యుత్తుకు అర్హుల సంఖ్య కుదింపు
ఏడాదికి రూ.284 కోట్ల ఆదా కోసం 15,237 మందికి ప్రభుత్వం మొండిచేయి
నష్టాలతో అల్లాడుతున్న రైతుపై విద్యుత్తు ఛార్జీల భారం
ఈనాడు, అమరావతి
ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును రాయితీపై రూ. 1.50 చొప్పున ఇస్తాం. మూడేళ్లలో ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేస్తాం. నాలుగో ఏడాది నుంచి చేపలు, రొయ్యలకు మద్దతు ధర ప్రకటిస్తాం.
2018 మే 18న ప్రతిపక్ష నేతగా పశ్చిమగోదావరి జిల్లా గణపవరంలో జగన్‌మోహన్‌రెడ్డి
ఆక్వా రైతులందరికీ రాయితీ విద్యుత్తు హామీని జగన్ అధికారంలోకి వచ్చాక 2021-22 వరకు అమలు చేసినా.. గతేడాది ఏప్రిల్ నుంచి మడమ తిప్పేశారు. తొలుత జోన్ పరిధిలో అయిదెకరాల్లోపు చెరువులకే రాయితీ విద్యుత్తు ఇస్తామని మెలిక పెట్టారు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో.. తర్వాత పదెకరాల వరకు చెరువులకు అమలు చేస్తామన్నారు. ఏడాది తర్వాత ఈ-ఫిష్ సర్వే పేరుతో అర్హుల సంఖ్యను 61,682 మంది నుంచి 46,445 మందికి కుదించారు. రాయితీపై విద్యుత్తు మొత్తాన్ని కూడా రూ.957 కోట్ల నుంచి రూ.673 కోట్లకు తగ్గించారు. సాగు పడిపోయిన నేపథ్యంలో రాయితీ అంత కూడా ఉండదనేది రైతుల అభిప్రాయం. సర్వే సమయంలో ఏడాది పాటు రాయితీ విద్యుత్తు నిలిపేసి, రూ.లక్షల్లో బిల్లులు వడ్డించారు.
ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని ఎన్నికల ముందు రొయ్యల చెరువుల దగ్గరకెళ్లి బీరాలు పలికిన జగన్‌మోహన్‌రెడ్డి.. అధికారంలోకి వచ్చాక రైతుల గోడు పట్టించుకోవడం లేదు. ధరలు పడిపోయి, పెట్టుబడులు పెరిగి.. గతేడాది రైతులు నిలువెల్లా మునిగినా సర్కారు చేయూత అందించలేదు. పైగా వారికి యూనిట్ రూ. 1.50 చొప్పున ఇస్తామన్న రాయితీ విద్యుత్తుకు కూడా కోత పెట్టారు. ఆర్థిక భారం పేరుతో ఆక్వా జోన్లను.. అయిదెకరాలు, పదెకరాల వరకే వర్తింపజేస్తామని ఆటలాడారు. మూలుగుతున్న రైతులపైనే ఏడాదిపాటు విద్యుత్తు భారం వేశారు. ఈ-ఫిష్ సర్వే పేరుతో అర్హుల సంఖ్యను తగ్గించారు. విద్యుత్తు రాయితీకి అర్హులైన రైతుల సంఖ్యకు కత్తెర వేసి, రాయితీ మొత్తాన్ని కుదించి, ప్రభుత్వంపై భారం తగ్గించుకున్నారు.
రూ.7 నుంచి రూ.2కి తగ్గించిన గత ప్రభుత్వం
రాష్ట్రంలో 2016కు ముందు స్లాట్లకు అనుగుణంగా విద్యుత్తు టారిఫ్ యూనిట్‌కు రూ. 4.63 నుంచి రూ.7 వరకు ఉండేది. ఆక్వా రంగానికి ప్రోత్సాహంలో భాగంగా అప్పటి ప్రభుత్వం 2016 నుంచి 2018 మే వరకు యూనిట్‌కు రూ. 3.86 చొప్పున ధర వసూలు చేసింది. 2019లో రొయ్యల ధరలు పతనమవడంతో.. రైతుల విజ్ఞప్తి మేరకు యూనిట్ విద్యుత్తును రూ.2కే ఇచ్చి, వారికి ఆర్థికంగా భరోసా కల్పించింది.
మరో అర్ధరూపాయి తగ్గిస్తామని.. మధ్యలోనే వెనక్కి తగ్గి
ఆక్వా రైతులకు యూనిట్ విద్యుత్తును రూ. 1.50 చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక 2019 జూన్ నుంచి యూనిట్‌కు రూ. 1.50 చొప్పున సరఫరా చేశారు. మూడేళ్లలో రూ. 2,378 కోట్లు రాయితీగా ఇచ్చారు. అయితే 2022-23లో అందరికీ ఇవ్వలేమని మడమ తిప్పేశారు. ఆక్వా జోన్ పరిధిలో అయిదెకరాల్లోపు చెరువులకే వర్తింపజేస్తామంటూ ఉత్తర్వులిచ్చారు. రైతుల నుంచి ఒత్తిడి పెరగడంతో ఆక్వా జోన్‌లో పదెకరాల వరకు విస్తరించారు. అర్హుల గుర్తింపు పేరుతో.. రాయితీ విద్యుత్తు నిలిపేశారు. దీంతో అధిక శాతం రైతులకు కరెంటు బిల్లులు రూ.లక్షల్లో వచ్చాయి. సాగులో నష్టాలతో సతమతమవుతున్న రైతు ఈ దెబ్బతో మరింత కుదేలయ్యాడు.
ఈ-ఫిష్ సర్వే పేరుతో ఏడాదికి రూ.284 కోట్ల ఆదా
ఆక్వా జోన్ పరిధిలో రైతుల్ని గుర్తించేందుకు ప్రభుత్వం ఈ-ఫిష్ సర్వే ప్రారంభించింది. 2021-22 వరకు 61,682 మంది రైతులకు యూనిట్ విద్యుత్తు రూ. 1.50 చొప్పున అందుతుండగా.. సర్వే తర్వాత అర్హుల సంఖ్యను 46,445కి కుదించేసింది. వారు సాగు చేస్తున్న 3.27 లక్షల ఎకరాలకు ఏడాదికి రూ. 672.61 కోట్లు రాయితీ చెల్లించాల్సి ఉంటుందని అంచనా వేసింది. రైతులకు ఇచ్చే సొమ్ములో ఏడాదికి రూ. 284 కోట్లను ఆదా చేసుకునేందుకు.. గతంలో రాయితీ విద్యుత్తు అందుకుంటున్న వారిలో 24% మందికి మొండిచేయి చూపింది. వీరిలో 7 శాతం మంది చిన్న రైతులే ఉన్నా.. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని కారణంగా అర్హత సాధించలేకపోయారు.
సంక్షోభంలో ఆక్వా రంగం
గతేడాది నుంచి ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ధరలు పడిపోయి రైతులు భారీగా నష్టపోయారు. సాగుకు అవసరమైన దాణా, ఇతర ఉత్పత్తుల్ని అరువుపై ఇవ్వలేమని వ్యాపారులు తేల్చి చెబుతున్నారు. దీంతో చాలా చోట్ల చెరువుల్ని ఎండబెట్టారు. కొందరు రైతులు 50% చేపలు, 50% రొయ్యలు సాగు చేస్తున్నారు. కొంతకాలం వేచి చూద్దామనే ఆలోచనలో మరికొందరు ఉన్నారు. ఈ ప్రభావం క్రమంగా హేచరీలపైనా పడుతోంది. ఇప్పటికే కొన్ని మూతపడుతున్నాయి. దాణా ఉత్పత్తి పరిశ్రమలకూ ఈ సెగ తగులుతోంది. మొత్తంగా ఆక్వా రంగం ఇబ్బందుల్లో ఉంది. ఈ నేపథ్యంలో విద్యుత్తు వినియోగం కూడా తక్కువే. ప్రభుత్వం చెబుతున్నట్లు ఏడాదికి రూ. 673 కోట్లు కూడా రాయితీకి ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదని రైతులు పేర్కొంటున్నారు. ఇవన్నీ తెలిసినా.. ప్రభుత్వం నుంచి ఆక్వా రంగానికి చేయూత కొరవడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ