విమ్స్‌ ప్రభుత్వాసుపత్రిలో తొలిసారి అవయవదానం

తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు ఓ మహిళ. శ్రీకాకుళానికి చెందిన పి.చంద్రకళ (32) భరించలేని తలనొప్పితో విశాఖ విమ్స్‌ ఆసుపత్రిలో చేరారు.

Updated : 03 Jun 2023 05:51 IST

నలుగురి జీవితాల్లో వెలుగు నింపిన మహిళ

విశాఖపట్నం (విశాలాక్షినగర్‌), న్యూస్‌టుడే: తాను చనిపోతూ నలుగురి జీవితాల్లో వెలుగులు నింపారు ఓ మహిళ. శ్రీకాకుళానికి చెందిన పి.చంద్రకళ (32) భరించలేని తలనొప్పితో విశాఖ విమ్స్‌ ఆసుపత్రిలో చేరారు. తలలో తీవ్ర రక్తస్రావమైనట్లు వైద్యులు గుర్తించారు. క్రమేణా ఆమె శరీర అవయవాలు దెబ్బతిన్నాయి. ఆమె బ్రెయిన్‌డెడ్‌ అయినట్లు గురువారం గుర్తించారు. వైద్యబృందం సూచనల మేరకు విమ్స్‌ డైరెక్టర్‌, రాష్ట్ర జీవన్‌దాన్‌ సమన్వయకర్త డాక్టర్‌ రాంబాబు మహిళ కుటుంబీకులతో చర్చించి అవయవదానంపై అవగాహన కల్పించారు. దీంతో ఆమె రెండు కళ్లు, మూత్రపిండాలను దానం చేసేందుకు వారు ముందుకొచ్చారు. సేకరించిన రెండు కిడ్నీలను నగరంలోని అపోలో, కేర్‌ ఆసుపత్రులకు చేరవేయగా..కళ్లను ఎల్వీ ప్రసాద్‌ ఆసుపత్రికి అందించారు. పలువురి జీవితాల్లో వెలుగులు నింపిన చంద్రకళ భౌతికకాయానికి ఆసుపత్రి సిబ్బంది ఘన నివాళులర్పించారు. ఆమె మృతదేహాన్ని ఆసుపత్రి గేటు వరకు ఊరేగింపుగా పూలు చల్లుతూ తీసుకెళ్లారు. ఇక్కడి ప్రైవేటు ఆసుపత్రులలో అవయవదానాలు తరచూ జరుగుతున్నాయని, ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న ఆసుపత్రిలో జరగటం ఇదే తొలిసారని డాక్టర్‌ రాంబాబు తెలిపారు.


పది మందికి యువకుడి అవయవదానం

ఎలమంచిలి, న్యూస్‌టుడే: ప్రమాదంలో మరణించిన అనకాపల్లి జిల్లా ఎలమంచిలి మున్సిపాలిటీ పరిధి కొత్తపాలేనికి చెందిన మళ్ల మణికంఠ అవయవాలను ఆయన తల్లిదండ్రులు కృష్ణ, పోలేరమ్మలు దానం చేసి పెద్ద మనసు చాటుకున్నారు. ఆ యువకుడి అవయవాలు పదిమందికి కొత్త జీవితాన్ని ప్రసాదిస్తున్నాయి. ఎలమంచిలిలో బీఎస్సీ చదువుతున్న మణికంఠ బంధువులతో కలిసి వాహనంలో వస్తుండగా దాని తలుపు తెరుచుకుని తాళ్లపాలెం సమీపంలో రోడ్డుపై పడిపోయారు. తలకు బలమైన గాయం కావడంతో విశాఖ కిమ్స్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం బ్రెయిన్‌డెడ్‌ అయ్యారు. ఆయన గుండె, ఊపిరితిత్తులను హైదరాబాద్‌కు తరలించారు. శుక్రవారం అవయవాలను ఏడుగురికి అమర్చారని కుటుంబీకులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని