జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టుకు విద్యార్హత డిగ్రీ

దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాలు, దేవాదాయ సంస్థల్లోని జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఇప్పటివరకు విద్యార్హత ఇంటర్మీడియట్‌ ఉండగా, దానిని డిగ్రీగా సవరించారు.

Updated : 03 Jun 2023 05:50 IST

ఇంజినీరింగ్‌ అర్హతతో ఏఈఈ పోస్టులు
ఆలయాల ఉద్యోగుల అర్హత ప్రమాణాల నిబంధనల సవరణ

ఈనాడు-అమరావతి: దేవాదాయశాఖ పరిధిలో ఉన్న ఆలయాలు, దేవాదాయ సంస్థల్లోని జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులకు ఇప్పటివరకు విద్యార్హత ఇంటర్మీడియట్‌ ఉండగా, దానిని డిగ్రీగా సవరించారు. డీఈ పోస్టులకి డిప్లొమో ఉంటే ఇప్పటివరకు సరిపోయేది. ఇకపై ఇంజినీరింగ్‌ డిగ్రీ ఉండాలనే నిబంధన తెచ్చారు. కొత్తగా సృష్టించిన ఏఈఈ పోస్టులను కూడా ఇంజినీరింగ్‌ డిగ్రీ అర్హతతో నియామకాలు చేపట్టనున్నారు. ఇలా ఆలయాలు, దేవాదాయ సంస్థల్లోని అధికారులు, ఉద్యోగులకు సంబంధించి 2,000 సంవత్సరంలో అమల్లోకి తెచ్చిన సర్వీసు నిబంధనల్లో సవరణలు చేస్తూ, దాని తుది నోటిఫికేషన్‌ను ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. దేవాదాయశాఖలో అధికారులు, ఉద్యోగులకు ఎటువంటి అర్హతలు, నిబంధనలు ఉన్నాయో.. దాదాపు వాటినే ఆలయాల ఉద్యోగులకు కూడా వర్తింపజేసేలా సర్వీసు నిబంధనల్లో సవరణలు చేశారు. పదోన్నతులకు సంబంధించి శాఖాపరమైన పరీక్షలకు కూడా కొన్ని మార్పులు, చేర్పులు చేశారు. ఆలయాల్లోని జూనియర్‌ అసిస్టెంట్‌ పోస్టులన్నీ ఇప్పటివరకు పదోన్నతుల ద్వారానే చేపట్టేవారు. తాజా సవరణ ద్వారా ప్రతి 10 పోస్టుల్లో ఏడింటిని పదోన్నతులు ద్వారా, మూడింటిని రిక్రూట్‌మెంట్‌ ద్వారా భర్తీచేస్తారు. అలాగే ఆలయాల్లో పోస్టుల మంజూరుకు సంబంధించి సూపరింటెండెంట్‌, ఆపైన వాటికి ప్రభుత్వం అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్‌ కంటే దిగువస్థాయి పోస్టులకు కమిషనర్‌ అనుమతిస్తారు.

ప్రధాన ఆలయాల జాబితాలోకి మూడు

ఉమ్మడి రాష్ట్రంలో 11 ప్రధాన ఆలయాలు ఉండేవి. సింహాచలం, అన్నవరం, విజయవాడ దుర్గ గుడి, ద్వారకాతిరుమల, శ్రీశైలం, కాణిపాకం, శ్రీకాళహస్తి, పెనుగంచిప్రోలు తిరుపతమ్మ ఆలయాలతో పాటు భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలు ఉండేవి. రాష్ట్ర విభజన తర్వాత భద్రాచలం, యాదగిరిగుట్ట, వేములవాడ ఆలయాలు తెలంగాణ రాష్ట్ర పరిధిలోకి వెళ్లడంతో.. వాటి స్థానంలో విశాఖ కనకమహాలక్ష్మి అమ్మవారు, అనంతపురం జిల్లాలోని నెట్టికంటి ఆంజనేయస్వామి (కసాపురం), నంద్యాల జిల్లా మహానంది ఆలయాలను.. ప్రధాన ఆలయాల జాబితాలో చేర్చారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని