బక్కచిక్కిన బాల్యం!
రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారంతో బాధపడే ఆరేళ్లలోపు వయసున్న చిన్నారులు సుమారు 2.97 లక్షల మంది ఉన్నట్లు తేలింది.
2.97 లక్షల మంది చిన్నారుల్లో పోషకాహార లోపం
గర్భిణుల్లో పెరిగిన రక్తహీనత
మే నెల వివరాల ఆధారంగా నిర్ధారణ
ఈనాడు డిజిటల్, అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా అంగన్‌వాడీ కేంద్రాల్లో పోషకాహారంతో బాధపడే ఆరేళ్లలోపు వయసున్న చిన్నారులు సుమారు 2.97 లక్షల మంది ఉన్నట్లు తేలింది. మే నెలకు సంబంధించి సమీకరించిన కొలతల్లో ఈ మేరకు నిర్ధారించారు. గతేడాది జనవరిలో పోషకాహార లోపంతో బాధపడే చిన్నారులు 2.50 లక్షలు ఉండగా.. అదే ఏడాది నవంబరు నాటికి ఆ సంఖ్య 4.60 లక్షలుగా నమోదైంది. ఇప్పుడు 2.97 లక్షల మంది ఉన్నారు. సరైన పోషణ అందని పిల్లలు ఎక్కువగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఉన్నారు. ఇక్కడ వయసుకు తగ్గ బరువు లేని పిల్లలు 12,591 మంది, వయసుకు తగ్గ ఎత్తు లేని వారు 22,451 మంది ఉన్నారు. ఆ తర్వాత స్థానాల్లో కర్నూలు, నంద్యాల జిల్లాలు ఉన్నాయి. అంగన్‌వాడీ కేంద్రాల్లో ప్రతి నెలా పిల్లల ఎత్తు, బరువు వివరాలు సేకరించి యాప్‌లో నమోదు చేస్తున్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో 6 ఏళ్ల లోపు పిల్లలు 24 లక్షల మంది సేవలు పొందుతున్నారు.
ఒక్కొక్కరికి రెండేసి సమస్యలు....
చిన్నారుల్లో వయసుకు తగ్గ బరువు, ఎత్తు లేకపోవడాన్ని, ఎత్తుకు తగ్గ బరువు లేకపోవడాన్ని పోషకాహారలోపంగా భావిస్తారు. ఆ ప్రకారం గత నెలలో నమోదైన వివరాలను పరిశీలిస్తే వయసుకు తగ్గ బరువు లేని చిన్నారులు 1,07,174 మంది, ఎత్తుకు తగ్గ బరువు లేనివారు 1,92,208 మంది ఉన్నారు.
73 వేల మంది గర్భిణుల్లో రక్తహీనత..
అంగన్‌వాడీ కేంద్రాల్లో సేవలు పొందుతున్న 73,212 మంది గర్భిణులు రక్తహీనతతో బాధపడుతున్నారు. 15-49 ఏళ్ల మధ్య ఉన్న 2,88,873 మంది గర్భిణులు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదై ఉండగా అందులో 25% మందిలో రక్తహీనత సమస్య ఉంది. 73 వేల మంది గర్భిణీల్లో 57 వేల మంది స్వల్పంగా, 16 వేల మంది మధ్యస్థంగా, 55 మంది తీవ్రమైన రక్తహీనత కలిగి ఉన్నారు. కర్నూలు జిల్లాలో అత్యధికంగా 4,846 మందిలో రక్తహీనత ఉంది. ఈ ఏడాది జనవరి నివేదికతో పోలిస్తే ఈ సంఖ్య పెరిగింది.
జులై నుంచి ఇంటికే సరకులు..
ఒక వైపు రక్తహీనత, పోషకాహార లోపం సమస్యలతో గర్భిణులు, చిన్నారులు బాధపడుతుండగా మరోవైపు అంగన్‌వాడీ కేంద్రాల్లో నమోదైన వారికి జులై 1 నుంచి ఇంటికే సరకులు అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడం విస్మయానికి గురిచేస్తోంది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేంద్రాల్లో వంట చేసి వడ్డిస్తుంటారు. అలా కాకుండా ఇంటికే సరకులు అందిస్తే.. అవి ఆ లబ్ధిదారులకే చేరతాయా.. చేరినా కుటుంబం మొత్తానికి వినియోగించుకుంటారేమో అనేదే ప్రధాన సమస్య. అయితే లబ్ధిదారుల అభ్యర్థన మేరకే ఇళ్లకు సరకులు అందించేందుకు నిర్ణయించామని అధికారులు చెబుతున్నారు.
ఏప్రిల్‌లో 72 శాతమే పాల సరఫరా...
ఏప్రిల్‌లో అంగన్‌వాడీ కేంద్రాలకు పాల సరఫరా పూర్తి స్థాయిలో జరగలేదు. 72 శాతం కేంద్రాలకు మాత్రమే సరఫరా చేశారు. దాదాపుగా 13 వేల కేంద్రాలకు ఆ నెలలో పాలు అందలేదు. మరుసటి నెల సర్దుబాటు చేశారు. మే నెలలో 98 శాతం కేంద్రాలకు పాలు అందించినట్లు అధికారులు పేర్కొన్నారు. 1300 కేంద్రాలకు అందలేదని జూన్‌లో సర్దుబాటు చేస్తామని తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Team India: భారత క్రికెట్ చరిత్రలో అరుదైన ఫీట్..
-
Vijay Deverakonda: ఆ బ్రాండ్‌కు విజయ్ దేవరకొండ బై.. ఈసారి అంతకుమించి!
-
Mohajer-10: 2 వేల కి.మీల దూరం.. 24 గంటలు గాల్లోనే.. సరికొత్త డ్రోన్లు ప్రదర్శించిన ఇరాన్
-
Vande Bharat Express: 9 రైళ్లు ఒకేసారి ప్రారంభం.. తెలుగు రాష్ట్రాల నుంచి 2.. ఆగే స్టేషన్లు ఇవే..!
-
10 Downing Street: బ్రిటన్ ప్రధాని నివాసంలో.. శునకం-పిల్లి కొట్లాట!
-
Chiru 157: చిరంజీవిని అలా చూపించాలనుకుంటున్నా: దర్శకుడు వశిష్ఠ