సీబీఐ విచారణకు అవినాష్‌రెడ్డి

మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు శనివారం విచారించారు.

Updated : 04 Jun 2023 06:11 IST

ఏడు గంటలపాటు కార్యాలయంలోనే ఎంపీ
వాట్సప్‌ కాల్స్‌పై ఆరా.. శనివారం మరోసారి విచారణ

ఈనాడు, హైదరాబాద్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు శనివారం విచారించారు. ఉదయం 9.40కి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న అవినాష్‌రెడ్డి.. తన న్యాయవాదులతో కలిసి సీబీఐ కార్యాలయంలోకి వెళ్లారు. సాయంత్రం అయిదు గంటల వరకు అక్కడే ఉన్నారు. సీబీఐ అధికారులు ఆయనను సుదీర్ఘంగా విచారించారు. జూన్‌ 30 వరకు ప్రతి శనివారం సీబీఐ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారణకు హాజరుకావాలని హైకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయన తొలిసారి శనివారం విచారణకు హాజరయ్యారు. అవినాష్‌రెడ్డి సీబీఐ కార్యాలయానికి చేరుకున్న తర్వాత అరగంటకు సీబీఐ అధికారులు వచ్చారు. మధ్యాహ్నం 12 తర్వాతే ఆయన్ను విచారించారు. ఫోన్‌ డిపాజిట్‌ చేయించుకున్న తర్వాత విచారణ ప్రారంభించారు. వివేకా హత్య జరిగిన సమయంలో వాట్సప్‌ కాల్స్‌ గురించి ప్రశ్నించినట్లు తెలిసింది. నిందితులతో మాట్లాడారా? ఒకవేళ మాట్లాడితే అందుకు కారణాలేంటి? అని తెలుసుకునే కోణంలోనే విచారణ సాగినట్లు సమాచారం. సాయంత్రం 5 గంటలకు అవినాష్‌రెడ్డిని సీబీఐ అధికారులు తిరిగి పంపేశారు. వెళ్లేటప్పుడు సెల్‌ఫోన్‌ను తిరిగి ఇచ్చేశారు. మళ్లీ వచ్చే శనివారం మరోసారి విచారించనున్నారు.

తగ్గిన అనుచరుల హడావుడి

అంతకుముందు అవినాష్‌రెడ్డిని విచారించినప్పుడు సీబీఐ కార్యాలయం వద్ద ఆయన అనుచరుల హడావుడి ఉండేది. హైదరాబాద్‌లో ఉండేవారితో పాటు వైయస్‌ఆర్‌ జిల్లా నుంచీ వచ్చి విచారణ ముగిసేవరకూ అక్కడే ఉండేవారు. ఈసారి అలాంటిదేం లేదు. దాదాపు పది మంది కనిపించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని