ఏమయ్యారో.. ఎక్కడున్నారో!

ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చిక్కుకున్నవారు ఏమయ్యారో, ఎక్కడున్నారో అనే అంశం ఆందోళన కలిగిస్తోంది.

Published : 04 Jun 2023 03:57 IST

పనిచేయని 141 మంది ప్రయాణికుల ఫోన్లు

ఈనాడు, విశాఖపట్నం: ఒడిశాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంలో చిక్కుకున్నవారు ఏమయ్యారో, ఎక్కడున్నారో అనే అంశం ఆందోళన కలిగిస్తోంది. ప్రమాదానికి గురైన రెండు ప్రయాణికుల రైళ్లలో రాష్ట్రానికి చెందినవారు పెద్ద సంఖ్యలోనే ఉన్నారు. వీరిలో ఎంతమంది సురక్షితంగా ఉన్నారన్న విషయంపై శనివారం రాత్రి వరకూ స్పష్టత రాలేదు. ప్రయాణించిన వారిలో చాలామంది ఫోన్లు పని చేయడం లేదు. స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. కొన్ని రింగవుతున్నా సమాధానం ఇవ్వడం లేదు. కొన్ని బీప్‌ శబ్దం వచ్చి ఆగిపోతున్నాయి. వారంతా ఏమయ్యారు, ఎలా ఉన్నారో అధికారులూ చెప్పలేకపోతున్నారు. మృతులకు సంబంధించిన పూర్తిస్థాయి వివరాలు శనివారం అర్ధరాత్రి వరకు తూర్పు కోస్తా రైల్వే జోన్‌ వెల్లడించలేదు.  ప్రమాదానికి గురైన కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌, యశ్వంత్‌పూర్‌- హావ్‌డా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లలో ఏపీలోని విశాఖ, విజయవాడ, రాజమహేంద్రవరం, ఏలూరు, తాడేపల్లిగూడెం, ఇతర ప్రాంతాల నుంచి 571 మంది రిజర్వేషన్‌ చేయించుకున్నారు. ఇందులో 141 మంది ఫోన్లు పనిచేయటం లేదు. కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో ఏపీకి వస్తున్న వారిలో విశాఖలో దిగే వారే అధికంగా ఉన్నట్లు రిజర్వేషన్‌ ఛార్టులను బట్టి తెలుస్తోంది. ఈ రైల్లో ఏపీ ప్రయాణికులు ఎక్కువ మంది థర్డ్‌ ఏసీ బోగీలైన బీ1, బీ2, బీ4, బీ5, బీ6, బీ8, బీ9ల్లో ప్రయాణిస్తున్నారు. ప్రమాదంలో జనరల్‌ బోగీలతో పాటు బీ1 నుంచి బీ6 వరకు ఉన్న బోగీలు బాగా దెబ్బతిన్నట్లు క్షతగాత్రులు చెబుతుండటంతో అందులో ఉన్న రాష్ట్ర ప్రయాణికుల పరిస్థితిపై ఆందోళన వ్యక్తమవుతోంది.


పింఛను కోసం వచ్చి..

సంతబొమ్మాళి, న్యూస్‌టుడే: బతుకుదెరువు కోసం చాలా ఏళ్ల కిందటే ఒడిశాలోని బాలేశ్వర్‌కు వెళ్లి చేపలు పడుతూ, వలలు అల్లుకుంటూ జీవనోపాధి పొందుతున్న శ్రీకాకుళం జిల్లా సంతబొమ్మాళి మండలం జగన్నాథపురానికి చెందిన చోడిపల్లి గురుమూర్తి (63) రైలు ప్రమాదంలో చనిపోయాడు. గురుమూర్తి ఏపీ ప్రభుత్వ పింఛను కోసం స్వగ్రామానికి వచ్చి ఈ నెల 2న తిరుగు ప్రయాణమయ్యారు. పలాస రైల్వేస్టేషన్లో యశ్వôత్‌పూర్‌- హావ్‌డా రైలు ఎక్కి ప్రమాదంలో చనిపోయారు. బాలేశ్వర్‌ ఆసుపత్రిలో మృతదేహాన్ని గుర్తించి శనివారం అంత్యక్రియలు చేశారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు