482 మంది ఏపీ ప్రయాణికుల్లో 267 మంది క్షేమం

కోరమాండల్‌ రైలు దుర్ఘటనలో చిక్కుకున్న రాష్ట్ర ప్రయాణికులకు అవసరమైన సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు.

Published : 04 Jun 2023 03:57 IST

113 మంది ఫోన్లు స్విచాఫ్‌
యశ్వంతపూర్‌ రైల్లో ప్రయాణిస్తున్న 28 మంది వివరాలూ తేలాలి
50 అంబులెన్సులు తరలింపు.. ఒక హెలికాప్టరూ సిద్ధం
మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడి

విశాఖపట్నం (వన్‌టౌన్‌), న్యూస్‌టుడే: కోరమాండల్‌ రైలు దుర్ఘటనలో చిక్కుకున్న రాష్ట్ర ప్రయాణికులకు అవసరమైన సహాయక చర్యలను ముమ్మరంగా చేపడుతున్నామని మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కోరమాండల్‌, యశ్వంతపూర్‌ ఎక్స్‌ప్రెస్‌ల్లో కలిపి 141 మంది రాష్ట్ర ప్రయాణికుల ఫోన్లు స్విచ్ఛాప్‌ వస్తున్నాయని, వారి ఆచూకీ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. సహచర మంత్రులు జోగి రమేష్‌, కారుమూరి నాగేశ్వరరావు, విశాఖ జిల్లా కలెక్టర్‌ ఎ.మల్లికార్జున, నగర పోలీసు కమిషనర్‌ త్రివిక్రమవర్మలతో కలిసి శనివారం సాయంత్రం విశాఖ కలెక్టరేట్‌లో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ప్రమాదం జరిగిన వెంటనే ముఖ్యమంత్రి జగన్‌ ప్రభుత్వ యంత్రాంగాన్ని పూర్తిస్థాయిలో అప్రమత్తం చేశారన్నారు. మంత్రి అమర్‌నాథ్‌ ఆధ్వర్యంలో ఐఏఎస్‌ అధికారులు అరుణ్‌కుమార్‌, ఒ.ఆనంద్‌, నవీన్‌కుమార్‌, ఐపీఎస్‌ అధికారులు విక్రాంత్‌, గౌతమి, లక్షిత్‌లతో కూడిన బృందాన్ని దుర్ఘటన జరిగిన ప్రాంతానికి పంపారని చెప్పారు. ఇంతవరకు 50 అంబులెన్సులు, వైద్య పరికరాలు, మందులు, వైద్యులతో కూడిన బృందాలు, మరో 15 మహాప్రస్థానం వాహనాలను ప్రమాద స్థలికి తరలించామన్నారు. రాష్ట్రానికి చెందిన ప్రయాణికులకు అత్యవసర వైద్యం అందించేందుకు భువనేశ్వర్‌లో రెండు కార్పొరేట్‌ ఆసుపత్రులను సిద్ధం చేసినట్లు వెల్లడించారు. అత్యవసర స్థితిలో తరలింపునకు వీలుగా విశాఖలో ఒక హెలికాప్టర్‌ను సిద్ధంగా ఉంచామని తెలిపారు. నౌకాదళ సేవలను వినియోగించుకోవడానికి ఆయా వర్గాలను అప్రమత్తం చేశామన్నారు. రాష్ట్రం నుంచి వెళ్లిన బృందాలు సహాయ కార్యక్రమాలు పూర్తయ్యే వరకు అక్కడే ఉంటాయని చెప్పారు.
- ఇంతవరకు తమకు అందించిన సమాచారం ప్రకారం కోరమాండల్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ట్రానికి చెందిన 482 మంది ప్రయాణిస్తున్నారని, వీరిలో 309 మందితో ఫోన్‌లో మాట్లాడామని బొత్స చెప్పారు. మిగిలినవారి నెంబర్లు దొరకడం లేదన్నారు. మొత్తం 482 మందిలో విశాఖకు చెందిన ప్రయాణికులు 309 మంది ఉన్నారని, రాజమహేంద్రవరం 31, ఏలూరు 5, విజయవాడకు చెందిన వారు 137 మంది ఉన్నట్లు వెల్లడించారు. వీరిలో 267 మంది సురక్షితంగా ఉన్నట్లు తేలిందన్నారు. మరో 20 మందికి తేలికపాటి గాయాలయ్యాయన్నారు. 82 మంది టికెట్లు లేకుండా ప్రయాణం చేశారని, 113 మంది ఫోన్లు స్విచాఫ్‌లో ఉన్నాయని వివరించారు. ప్రమాదంలో గాయపడ్డ లోకేష్‌, మినీలను విశాఖ ఆసుపత్రిలో చేర్పించామన్నారు.

* యశ్వంత్‌పూర్‌ రైల్లో రాష్ట్రానికి చెందిన 89 మంది ప్రయాణికులు టికెట్లు కొన్నారని, వీరిలో విశాఖ 33, రాజమహేంద్రవరం 3, ఏలూరు 1, విజయవాడ 41, బాపట్ల 8, నెల్లూరు వారు ముగ్గురు ఉన్నారని మంత్రి చెప్పారు. వీరిలో 49 మంది సురక్షితంగా ఉన్నారని, ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయని వివరించారు. పది మంది ప్రయాణం చేయలేదన్నారు. మరో 28 మంది వివరాలు తేలాల్సి ఉందన్నారు. అధికారులు నిరంతరాయంగా ప్రయాణికులకు ఫోన్లు చేసి వివరాలు తెలుసుకుంటున్నారని బొత్స తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు