రైలు ప్రమాదంపై చంద్రబాబు, లోకేశ్‌ దిగ్భ్రాంతి

ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు.

Published : 04 Jun 2023 03:57 IST

ఈనాడు డిజిటల్‌, అమరావతి: ఒడిశాలోని బాలేశ్వర్‌ జిల్లాలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై తెదేపా అధినేత చంద్రబాబునాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. క్షతగాత్రులు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ శనివారం ట్వీట్‌ చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ ఈ దుర్ఘటనపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రతిఒక్కరూ అండగా నిలవాలని కోరారు. భవిష్యత్తులో ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా కేంద్ర ప్రభుత్వం, రైల్వే శాఖ చర్యలు తీసుకోవాలని తెదేపా ఎంపీ రామ్మోహన్‌నాయుడు ఓ ప్రకటనలో కోరారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.

తెదేపా ఆధ్వర్యంలో సహాయ బృందం

రైలు ప్రమాద బాధితులకు సహాయ సహకారాలు అందించడానికి ఎమ్మెల్యే బెందాళం అశోక్‌, మాజీ ఎమ్మెల్యే కలమట వెంకటరమణ ఆధ్వర్యంలో తెదేపా ఏర్పాటు చేసిన ఓ బృందం శనివారం ఘటనా స్థలికి వెళ్లి సహాయక చర్యల్లో పాల్గొంది. అనంతరం కటక్‌లోని ఎస్‌సీబీ వైద్య కళాశాలలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించింది. పార్టీ శ్రేణులు బాధితులకు బాసటగా నిలవాలని రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఓ ప్రకటనలో కోరారు. ఏపీకి చెందిన బాధితుల వివరాలు సేకరించి, వారిని రాష్ట్రానికి సురక్షితంగా తీసుకురావాలని ఒడిశా, ఏపీ ప్రభుత్వాలను కోరారు.


దిగ్భ్రాంతికర ఘటన
- జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌

ఘోర రైలు ప్రమాదం తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది. ప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాలకు చెందినవారు ఎక్కువ మంది ఉన్నారని సమాచారం అందుతోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు బాధితుల కుటుంబాలకు సహాయం అందించేందుకు తగిన ఏర్పాట్లు చేయాలి. కేంద్ర ప్రభుత్వం రైలు ప్రమాదాల నివారణ, ప్రయాణికుల భద్రతపై దృష్టి సారించాలి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు