క్రమశిక్షణ సంఘం విధించిన శిక్షను ట్రైబ్యునల్‌ సవరించలేదు

తప్పుచేసిన ఉద్యోగికి క్రమశిక్షణ సంఘం (డిసిప్లినరీ అథారిటీ) విధించిన శిక్షల విషయంలో ట్రైబ్యునల్‌/ న్యాయస్థానం సహజంగా జోక్యం చేసుకోవని, శిక్ష సహేతుకంగా లేదని భావించినప్పుడు దీన్ని పునఃపరిశీలించాల్సిందిగా తిరిగి పంపాల్సి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది.

Published : 04 Jun 2023 05:15 IST

పరిశీలించాలని మాత్రమే ఆదేశించగలదు
ఏపీఏటీ ఉత్తర్వులను కొట్టేసిన హైకోర్టు

ఈనాడు, అమరావతి: తప్పుచేసిన ఉద్యోగికి క్రమశిక్షణ సంఘం (డిసిప్లినరీ అథారిటీ) విధించిన శిక్షల విషయంలో ట్రైబ్యునల్‌/ న్యాయస్థానం సహజంగా జోక్యం చేసుకోవని, శిక్ష సహేతుకంగా లేదని భావించినప్పుడు దీన్ని పునఃపరిశీలించాల్సిందిగా తిరిగి పంపాల్సి ఉంటుందని రాష్ట్ర హైకోర్టు స్పష్టం చేసింది. ఎస్సై ముసుగులో ఓ వ్యక్తి నుంచి సొమ్ము డిమాండ్‌ చేయడం, మరో వ్యక్తి ఇంట్లో సోదాలు చేయడం, అధికారుల అనుమతి లేకుండా మోటారు సైకిల్‌ కొనుగోలు చేయడం తదితర ఆరోపణలు ఎదుర్కొన్న ఓ కానిస్టేబుల్‌కు.. ‘క్రమశిక్షణ అథారిటీ’ విధించిన శిక్షను ఏపీఏటీ (పరిపాలన ట్రైబ్యునల్‌) సవరించడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. ఏపీఏటీ 2009లో ఇచ్చిన ఉత్తర్వులను రద్దు చేసి, క్రమశిక్షణ సంఘం విధించిన శిక్షను పునరుద్ధరించింది. హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ సీహెచ్‌ మానవేంద్రనాథ్‌రాయ్‌, జస్టిస్‌ వి.గోపాలకృష్ణారావుతో కూడిన ధర్మాసనం ఇటీవల ఈ మేరకు తీర్పు ఇచ్చింది.విశాఖపట్టణానికి చెందిన కానిస్టేబుల్‌ మురహరిరావుపై పలు ఆరోపణలు వచ్చాయి. క్రమశిక్షణ సంఘం ఆయన సస్పెన్షన్‌ కాలానికి విధుల్లో లేనట్లు భావించి, మూలవేతనంలో నుంచి రెండు ఇంక్రిమెంట్లను తొలగించింది. ఆ ఉత్తర్వులను సవాలుచేస్తూ మురహరిరావు ఏపీఏటీని ఆశ్రయించారు. విచారణ జరిపిన ఏపీఏటీ.. ఒక ఇంక్రిమెంట్‌ తొలగింపునకు మాత్రమే పరిమితం చేసింది. సీనియార్టీ, పెన్షన్‌ చెల్లింపుల్లో సస్పెన్షన్‌ కాలాన్ని విధుల్లో ఉన్నట్లు భావించాలని పేర్కొంది. దీన్ని సవాలుచేస్తూ 2011లో హోంశాఖ ముఖ్యకార్యదర్శి, విశాఖ పోలీసు కమిషనర్‌ హైకోర్టును ఆశ్రయించారు. విచారణ జరిపిన ధర్మాసనం.. మురహరిరావుపై నమోదైనవి తీవ్ర నేరారోపణలని, నాలుగు అభియోగాలు విచారణలో రుజువయ్యాయని గుర్తుచేసింది. శిక్ష తగ్గింపును పరిశీలించాల్సిందిగా క్రమశిక్షణ సంఘానికి తిప్పిపంపకుండా నేరుగా ఏపీఏటీ తగ్గించిందని ఆక్షేపిస్తూ, ట్రైబ్యునల్‌ ఉత్తర్వులను రద్దు చేసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని