ఏకపక్ష వైఖరిపై గగ్గోలు
ఆన్‌లైన్‌లో మినరల్ డీలర్ లైసెన్స్ లాగిన్ ద్వారా పర్మిట్లు తీసుకోకుండా బ్లాక్ చేశారు... గ్రానైట్ ముడిరాయికి రాయితీ లభించే స్లాబ్ విధానంలో చేరేందుకు అనుమతించడం లేదు... ఇదేమని ప్రశ్నించినా, మిల్లుల్లో ప్రొడక్షన్ నిలిపేస్తామని హెచ్చరించినా.. వెంటనే గనులశాఖ రంగంలోకి దిగుతోంది.. ఆ మిల్లుల్లో తనిఖీల పేరిట భయపెడుతూ ఎవరూ నోరెత్తకుండా చూస్తోంది... ఇది.. సీనరేజ్ వసూళ్లు చేస్తున్న జిల్లాల్లో లీజుదారులను గనులశాఖ వేధిస్తున్న తీరు.
లాగిన్ తెరవరు.. స్లాబ్ విధానానికి అనుమతించరు
సీనరేజ్ వసూలు తీరుపై గ్రానైట్ మిల్లుల యజమానుల మండిపాటు
చిత్తూరు జిల్లాలో కార్యకలాపాలు నిలిపేస్తామని హెచ్చరిక
వెంటనే కొందరి లీజుదారులను తనిఖీలతో భయపెడుతున్న గనులశాఖ
ఈనాడు-అమరావతి: ఆన్‌లైన్‌లో మినరల్ డీలర్ లైసెన్స్ లాగిన్ ద్వారా పర్మిట్లు తీసుకోకుండా బ్లాక్ చేశారు... గ్రానైట్ ముడిరాయికి రాయితీ లభించే స్లాబ్ విధానంలో చేరేందుకు అనుమతించడం లేదు... ఇదేమని ప్రశ్నించినా, మిల్లుల్లో ప్రొడక్షన్ నిలిపేస్తామని హెచ్చరించినా.. వెంటనే గనులశాఖ రంగంలోకి దిగుతోంది.. ఆ మిల్లుల్లో తనిఖీల పేరిట భయపెడుతూ ఎవరూ నోరెత్తకుండా చూస్తోంది... ఇది.. సీనరేజ్ వసూళ్లు చేస్తున్న జిల్లాల్లో లీజుదారులను గనులశాఖ వేధిస్తున్న తీరు. తద్వారా పరోక్షంగా ప్రైవేటు సంస్థలకు గనులశాఖ సహకరిస్తోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రంలో ఇప్పటివరకు ఉమ్మడి చిత్తూరు, అనంతపురం, కడప, తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల్లో మైనింగ్ లీజుదారుల నుంచి సీనరేజ్ వసూళ్లను ప్రైవేటు సంస్థలకు అప్పగించారు. వీటి తీరుపై కొందరు లీజుదారులు, గ్రానైట్ పాలిషింగ్, కటింగ్ మిల్లుల యజమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. గనులశాఖ మాత్రం వీరి గోడును పట్టించుకోవడం లేదు.
బ్లాక్ చేసేశారు అంతే..
ఏదైనా ఖనిజాన్ని కొనుగోలు చేసి, దానిని ప్రాసెసింగ్ చేసే వారికి గనులశాఖ మినరల్ డీలర్ లైసెన్స్ (ఎండీఎల్) ఇస్తుంది. ఎండీఎల్ లాగిన్ ఇచ్చి, ఆన్‌లైన్‌లో పర్మిట్లు జారీ చేస్తారు. కొందరు ముందే డబ్బులు చెల్లించి, ఎక్కువ పర్మిట్లకు తీసుకునేవారు. సీనరేజ్ వసూళ్లు ప్రైవేటు సంస్థలకు అప్పగించిన జిల్లాల్లో.. అందరి ఎండీఎల్ లాగిన్లను బ్లాక్ చేశారు. వాటి ద్వారా పర్మిట్లు తీసుకోవడానికి వీలులేకుండా చేశారు. తాము ముందే కొనుగోలు చేసిన పర్మిట్లు ఉన్నాయని చెబుతున్నా పట్టించుకునేవారే కరవయ్యారు. ప్రైవేటు సంస్థలు చేతిరాతతో జారీ చేసే పర్మిట్లు తీసుకోవాల్సిందేనని అధికారులు ఒత్తిళ్లు చేస్తున్నారు.
స్లాబ్ విధానం ఏదీ?
గతంలో ఉండే స్లాబ్ విధానాన్ని గనులశాఖ గతేడాది మళ్లీ ప్రవేశపెట్టింది. దీని ప్రకారం అన్ని జిల్లాల్లో గ్రానైట్ కటింగ్ యూనిట్ నిర్వాహకులు ఒక బ్లేడ్‌కు నెలకు రూ.22 వేలు చొప్పున చెల్లించాలి. ప్రకాశం జిల్లాలోని యూనిట్లు మాత్రం బ్లేడ్‌కు రూ.27 వేలు చొప్పున చెల్లించాలి. వీళ్లు నెలకు 22 క్యూబిక్ మీటర్ల ముడిరాయిని వినియోగించుకునేందుకు వీలుంటుంది. దీని వల్ల ముడిరాయి విలువలో దాదాపు మూడింట రెండొంతులు భారం ఉండదు. తొలుత కొన్ని యూనిట్ల యజమానులు మాత్రమే ఈ విధానంలో చేరారు. తర్వాత మిగిలినవారు చేరేందుకు అనుమతించడం లేదు. ప్రైవేటు సంస్థలు సీనరేజ్ వసూళ్లు చేస్తున్న జిల్లాల్లో కూడా స్లాబ్ విధానంలో చేరుతామని మిల్లుల యజమానులు కోరుతున్నా, అవకాశం ఇవ్వడంలేదని చెబుతున్నారు.
నిరసన తెలిపితే వేధింపులే..
ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన గ్రానైట్ మిల్లుల యజమానులు గతనెల 10న చిత్తూరులోని గనులశాఖ డీడీ కార్యాలయంలో నిరసన వ్యక్తం చేశారు. ప్రైవేటు సంస్థ సీనరేజ్ వసూళ్ల విధానం సక్రమంగా లేదంటూ నినాదాలు చేశారు. తర్వాత మదనపల్లె, పుంగనూరు ప్రాంతాలకు చెందిన మిల్లుల యజమానులంతా.. ఫ్యాక్టరీలు మూసేయాలని, గతనెల 27 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించుకున్నారు. వెంటనే వారిపై గనులశాఖ నుంచి ఒత్తిళ్లు మొదలయ్యాయి. కొందరి ఫ్యాక్టరీల్లో గనులశాఖ అధికారులు తనిఖీలు చేశారు. వారికి జరిమానాలు విధించేందుకు సిద్ధమయ్యారు. మిగిలిన ఫ్యాక్టరీల యజమానులు తమ సమ్మెను విరమించుకున్నారు. సీనరేజ్ వసూళ్లు చేసే ప్రైవేటు సంస్థ ఒత్తిళ్లతోనే గనులశాఖ ఇలా వేధిస్తోందని కొందరు యజమానులు పేర్కొంటున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Intresting News: ఈరోజు ఆసక్తికర వార్తలు మిస్సయ్యారా?.. అయితే ఇవి మీకోసమే..
-
Road Accident: టూరిస్టు బస్సు బోల్తా.. 8 మంది మృతి
-
Gangula: తెలంగాణలో రేషన్ డీలర్లకు కమీషన్ పెంపు: మంత్రి గంగుల
-
Manipur: అల్లర్లతో అట్టుడికిన మణిపుర్లో.. ఉగ్ర కలకలం
-
Lokesh: పవన్ సభకు ప్రభుత్వం ఆటంకం కలిగించే అవకాశం: లోకేశ్
-
Asian Games: భారత్‌కు మరో రెండు పతకాలు.. ఫైనల్‌కు కిదాంబి శ్రీకాంత్