పల్లె పేదలకు ఒక్క ఇల్లూ కట్టలేదు

రాజధాని అమరావతిలో స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శరవేగంగా అడుగులు వేస్తున్న వైకాపా ప్రభుత్వం.. 2020లో ఇళ్ల స్థలాలు కేటాయించిన సుమారు 2 లక్షల గ్రామీణ పేదలకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు.

Updated : 05 Jun 2023 08:53 IST

జగన్‌ సర్కారులో నాలుగేళ్లయినా అతీగతీ లేదు
కడుతున్న 18.64 లక్షల గృహాలూ కేంద్రం ఇచ్చినవే
2 లక్షల మంది గ్రామీణ పేదల ఎదురుచూపులు
ఈనాడు డిజిటల్‌ - అమరావతి


ఇళ్లు కట్టించేందుకు తాము చర్యలు చేపడుతుంటే.. దేవతల యజ్ఞానికి రాక్షసుల్లా అడ్డుపడుతున్నారని ఇటీవల కొత్త పల్లవి అందుకున్నారు జగన్‌. రెండున్నరేళ్లయినా 2 లక్షల మంది గ్రామీణ పేదలకు ఎవరు అడ్డుపడితే ఇళ్లు మంజూరు చేయలేదు?


రాజధాని అమరావతిలో స్థలాల పంపిణీ, ఇళ్ల నిర్మాణాలకు శరవేగంగా అడుగులు వేస్తున్న వైకాపా ప్రభుత్వం.. 2020లో ఇళ్ల స్థలాలు కేటాయించిన సుమారు 2 లక్షల గ్రామీణ పేదలకు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇళ్ల స్థలాల పంపిణీ కార్యక్రమంలో భాగంగా వీరికి ఈ స్థలాలు కేటాయించారు. మరో ఏడాది కాలంలో వైకాపా ప్రభుత్వ పదవీ కాలమే ముగుస్తున్నా... ఈ స్థలాల్లో ఇళ్లు నిర్మించే ప్రయత్నమే జరగక పోవడం గమనార్హం. పేదల తలరాతలను మార్చేందుకే స్థలాలు కేటాయించి ఇళ్లు కట్టించే కార్యక్రమాన్ని చేపడుతున్నామని పదే పదే చెప్పే ముఖ్యమంత్రి జగన్‌....ఆ తలరాత మార్చే వారిలో గ్రామీణ పేదలు లేరా? ఉంటే మరి రెండున్నరేళ్లుగా ఎందుకు ఇళ్లు మంజూరు చేయలేదనే విమర్శలు గ్రామీణ లబ్ధిదారుల నుంచి వినిపిస్తున్నాయి. ఆయనకు 2 లక్షల మంది గ్రామీణ పేదల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు కనిపించలేదా అని మండిపడుతున్నారు.

సొంతంగా జగన్‌ సర్కారు ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు..

వైకాపా ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామీణ పేదలకు సొంతంగా ఒక్క ఇల్లూ మంజూరు చేయలేదు. వినడానికి అతిశయోక్తిగా ఉన్నా ఇదే వాస్తవం. ప్రస్తుతం చేపట్టిన 18.64 లక్షల గృహాలూ కేంద్ర ప్రభుత్వమిస్తున్న ఆర్థిక సాయంతో నెట్టుకొచ్చేవే. ఇన్ని గృహాలను కేంద్రం మంజూరు చేసేటప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సొంతంగా 2 లక్షల మందికి ఇళ్లు ఇవ్వలేదా? దీని కోసం నాలుగేళ్ల సమయం పడుతుందా అని లబ్ధిదారులు ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుతం కడుతున్న 18.64 లక్షల ఇళ్లలో ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(పట్టణ) పథకం కింద నగరాలు, పట్టణాలు, పట్టణాభివృద్ధి సంస్థల్లో 16.84 లక్షలు గృహాలు ఉంటే, మరో 1.80 లక్షలు గృహాలు ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన (గ్రామీణ్‌) పథకం కింద కేంద్రం మంజూరు చేసినవే. జగనన్న కాలనీల్లో మౌలిక వసతులకు మినహా ఈ ఇళ్ల నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ఆర్థిక సాయం నామమాత్రమే. ఒక్కో ఇంటికి ఇస్తున్న రూ.1.80 లక్షల్లో పట్టణాల్లో నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వమిచ్చేది రూ.30 వేలే. పట్టణాభివృద్ధి సంస్థల్లో మొత్తం రూ.1.80 లక్షలూ కేంద్ర నిధులే. అదే గత తెదేపా ప్రభుత్వ హయాంలో కేంద్రం మంజూరు చేసిన ఇళ్లతోపాటు సొంతంగా ఎన్టీఆర్‌ గృహనిర్మాణ పథకం కింద గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టింది. ఇంటి నిర్మాణానికి ఎస్సీ, ఎస్టీలకు రూ.2 లక్షలు, ఇతర వర్గాలకు రూ.1.50 లక్షల చొప్పున అప్పటి రాష్ట్ర ప్రభుత్వమే సొంతంగా ఆర్థిక సాయం అందించింది.

నాలుగేళ్లయినా అయోమయంలోనే గ్రామీణ పేదలు..

నగరాలు, పట్టణాల్లో కేంద్రం ఇస్తున్న ఆర్థిక సాయంతో పేదల ఇళ్ల నిర్మాణాన్ని నెట్టుకొస్తున్న ప్రభుత్వం... గ్రామాల్లోని పేదలను మాత్రం పట్టించుకోవడం లేదు. 2020లో పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేసే సమయంలో రెండో దశలో చేపట్టే ఇళ్ల నిర్మాణాల్లో వీటిని చేర్చారు. 8 నెలల క్రితమే రెండో దశ కింద సుమారు 3 లక్షల నిర్మాణాలను ప్రారంభించారు. విశాఖపట్నం పరిధిలో చేపట్టే 1.14 లక్షల గృహాలతోపాటు కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదలకు అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ్‌) పథకం ఎంపిక చేసిన 1.80 లక్షల గృహాలు ఇందులో ఉన్నాయి. అప్పుడు కూడా గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం పట్టించుకోలేదు. తాజాగా అమరావతిలో చేపట్టిన 50 వేల మందికి పట్టాల పంపిణీకి సంబంధించి కేంద్రం ఇంకా ఇళ్లు మంజూరు చేయాల్సి ఉంది. కానీ అక్కడ ఇళ్ల నిర్మాణానికి ప్రభుత్వం హడావుడి చేస్తోంది. షియర్‌వాల్‌ సాంకేతికతతో కట్టేస్తామని చెబుతోంది. అయితే..గ్రామీణ పేదల ఇళ్ల మంజూరుపై నిర్లిప్తంగా ఉంది. కనీసం ఎప్పుడు వీటిని ప్రారంభిస్తారనే సమాచారం కూడా లబ్ధిదారులకు లేదు. దీంతో వారు అయోమయంలో ఉన్నారు.

ఆర్థిక భారమనే జాప్యమా?

రాష్ట్ర ప్రభుత్వం గుర్తించిన 2 లక్షల మంది గ్రామీణ పేదల ఇళ్ల నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన రెండు పథకాలూ వర్తించవు. గ్రామీణ పేదలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి ఆవాస్‌ యోజన(గ్రామీణ్‌) పథకాన్ని అమలు చేస్తున్నా....ఆ పథక లబ్ధిదారులను గతంలోనే ఎంపిక చేసింది. రాష్ట్రంలో ఆ పథకానికి 1.80 లక్షల మంది అర్హులున్నట్లు గుర్తించి వారికి ఆర్థిక సాయాన్ని అందిస్తోంది. 2020లో ఇళ్ల పట్టాల పంపిణీ సమయంలో కేంద్ర పథకాలు వర్తించని గ్రామీణ ఇళ్లు సుమారు 4 లక్షల వరకు ఉంటాయని అంచనా వేశారు. వీటి నిర్మాణ వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి. దీంతో కొత్త ఎత్తుగడ వేసిన ప్రభుత్వం...పట్టణాభివృద్ధి సంస్థల విస్తీర్ణాన్ని పెంచింది. కొన్ని కొత్త పట్టణాభివృద్ధి సంస్థలనూ ప్రకటించింది. దీంతో కొందరు గ్రామీణ లబ్ధిదారులు వాటి పరిధిలోకి వెళ్లారు. అయినా ఇంకా 2 లక్షల మంది మిగిలి ఉన్నారు. వీరంతా ఇళ్ల కోసం ఎదురుచూస్తున్నారు. దీనిపై గృహనిర్మాణశాఖ అధికారుల్ని వివరణ కోరగా..గ్రామీణ పేదలకు ఇళ్ల నిర్మాణాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉందని తెలిపారు.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని